ఓటుకు సీటు, నోటు ఆఫ‌ర్‌!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీల‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి వుంది. రేపు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. టీడీపీకి అధికారిక సంఖ్యా బ‌లం ప్ర‌కారం ఒక ఎమ్మెల్సీ స్థానం ద‌క్కాల్సి వుంది. 

అయితే టీడీపీకి చెందిన న‌లుగురు వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ ఎన్నిక ఆస‌క్తి రేపుతోంది. వైసీపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఆత్మ‌ప్ర‌బోధానుసారం ఓటు వేస్తాన‌ని వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రో రెబ‌ల్ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఏం మాట్లాడ‌క‌పోయినా, ఆయ‌న ఓటు త‌మ‌కే అని టీడీపీ ధీమాగా వుంది. 

ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల గేమ్ రంజుగా మారింది. ఎలాగైనా ఒక స్థానాన్ని గెలుచుకోవాల‌ని టీడీపీ ప‌ట్టుద‌ల‌తో వుంది. దీంతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల‌పై టీడీపీ దృష్టి సారించింది. రానున్న ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చేది లేద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎవ‌రెవ‌రికి చెప్పార‌నే విష‌య‌మై టీడీపీ ఆరా తీస్తోంది. అలాంటి వారికి తాము టికెట్ ఇవ్వ‌డంతో పాటు ఎన్నిక‌ల ఖ‌ర్చు కూడా పెట్టుకుంటామ‌ని ఆఫ‌ర్ ఇస్తోంద‌నే ప్ర‌చారానికి తెర‌లేచింది.

టీడీపీ ఆఫ‌ర్ గాలానికి ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యే త‌లొగ్గార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే నిజ‌మైతే టీడీపీ ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం ఖాయం. గ‌తంలో తెలంగాణ‌లో అస‌లు ఏ అవ‌కాశం లేని చోట సంద‌ర్భంలో కూడా టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్ర‌య‌త్నించి అభాసుపాలైన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ఓటుకు నోటు ఇస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి నేరుగా ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. 

ఇప్పుడు కేవ‌లం ఒకే ఒక్క ఎమ్మెల్యే అవ‌స‌రం ఉంద‌ని, చంద్ర‌బాబు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటు కోసం ఎంత‌కైనా బ‌రి తెగిస్తార‌నే ఆందోళ‌న‌లో వైసీపీ వుంది. ఇదే సంద‌ర్భంలో టీడీపీ ఎత్తుల‌ను చిత్తు చేసేందుకు వైసీపీ అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాల్లో మునిగి తేలింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల గేమ్‌లో టీడీపీ ఆఫ‌ర్స్ ఏ మేర‌కు ప‌ని చేశాయో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు తేల్చ‌నున్నాయి.

Show comments