Kabzaa Review: మూవీ రివ్యూ: కబ్జా

చిత్రం: కబ్జా
రేటింగ్: 1.5/5
తారాగణం: ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ శరణ్, మురళి శర్మ, నవాబ్ షా తదితరులు
ఎడిటింగ్: మహేష్ ఎస్ రెడ్డి
కెమెరా: ఎ.జె.శెట్టి
సంగీతం: రవి బస్రూర్
నిర్మాత: ఆనంద్ పండిట్ పిక్చర్స్, ఇన్వేనియో, శ్రి సిద్ధేశ్వర ఎంటెర్ప్రైజెస్
దర్శకత్వం: ఆర్. చంద్రు
విడుదల తేదీ: 17 మార్చ్ 2023

కేజీఎఫ్ వచ్చినప్పటి నుంచీ ఆ తరహాలో సినిమాలు తియ్యాలనే తహతహ చాలామందిలో పెరిగింది. ఈ మధ్యనే "మైఖేల్" పేరుతో సందీప్ సినిమా ఒకటొచ్చింది. స్టైల్ తప్ప సంగతి లేదని జనం పట్టించుకోలేదు. ఇప్పుడు కబ్జా వచ్చింది.  ప్రధాన పాత్ర ఉపేంద్ర అయినప్పటికీ కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్ కూడా కనిపిస్తారు. అంటే ముగ్గురు కన్నడ సూపర్ స్టార్స్ కనిపించే సినిమా. వివరాల్లోకి వెళ్దాం.

కథగా చెప్పాలంటే ఒక వెబ్ సిరీస్ కి సరిపోయేటంత కథని, పాత్రల్ని పెట్టుకున్నారు. 1945లో ఒక ఉత్తరభారతదేశంలో రాజకుటుంబం. ఆ రాజు ఆంగ్లేయులపై పోరాడతాడు. బ్రిటీషర్స్ తో చేయికలిపిన ఢాకా అనే ఒక కౄరుడు ఆ ఊరిని తగలబెట్టి, రాజుని చంపేసి కబ్జా చేస్తాడు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ చనిపోయిన వాడి భార్య ఊరొదిలి దక్షిణభారత దేశం వచ్చి ఒకచోట తలదాచుకుని బతుకుతుంటుంది. ఇంతకీ ఢాకా అనేవాడు కనపడడు. వాడు ఉత్తరభారతదేశానికి ఒకడిని, దక్షిణాదిన ఒకడిని తన తరపున ఏలడానికి పెట్టి యూరప్ లో తలదాచుకుంటాడు. అలా ఒకరి కింద మరొకరు పనిచేస్తూ ఒక్కో ఊరిని ఢాకా తరపున ఏలుతుంటారు. మొత్తానికి పిల్లలు పెరిగి పెద్దవుతారు. ఆ ఇద్దరిలో ఒకడిని విలన్లు చంపుతారు. తన అన్నను చంపిన ఆ విలన్ల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మన హీరో అర్కేశ్వర్  (ఉపేంద్ర) కూడా కౄరంగా మారతాడు. ఆ ఊరి యువరాణి (శ్రియ) అర్కేశ్వర్ ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏమౌతుందనేది మిగతా కథ.

కథనం మొత్తం కేజీఎఫ్ ఫార్మాట్ లోనే సాగుతుంది. తెర మీద దృశ్యం కూడా బ్రైట్ లైట్లో కాకుండా డార్క్ షేడ్ లో నడుస్తుంటుంది. భారీ యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్ కలగలిపి ఒక ఎపిక్ లాగ తీర్చిదిద్దే ప్రయత్నమైతే చేసారు. అయితే చూస్తున్నప్పుడు కావాల్సిన గూజ్ బంప్స్ రాలేదు. ఎమోషనల్ గా పిండేసే సీన్స్ కూడా లేవు. డైలాగ్స్ కూడా అంతే. ఒకటి రెండు సన్నివేశాల్లో ఓకే గానీ ఓవరాల్ గా ఏవరేజ్ అంతే.

సీనియర్ హీరోలైన ఉపేంద్రకి, శివరాజ్ కుమార్ కి, సుదీప్ కి కేజీఎఫ్ తరహా సినిమాతో ఈ జనరేషన్ ఆడియన్స్ కి కూడా దగ్గరవ్వాలనుకునే కోరిక కలిగినట్టుంది. వారి ఆలోచన మంచిదే. ఆ మధ్య కమల్ హాసన్ కూడా ఇలాగే "విక్రం" తో కొత్తతరం ప్రేక్షకులతో కూడా చప్పట్లు కొట్టించుకున్నాడు.

అయితే తీసే టెక్నిక్కుతోనే కాకుండా కథనంతో కూడా అదే విధంగా ఆకట్టుకోగలగాలి. అందునా కేజీఎఫ్ ఒక బెంచ్ మార్క్ గా ఉంది కనుక ఏం రాసుకున్నా దానికి మించి ఉండాలి. ఆ విషయంలో ఈ సినిమా పూర్తిగా వెనుకబడింది. చాలా గందరగోళంగా, అవకతవకగా, అతిగా, అతకనట్టుగా...ఇలా నానా రకాలుగా ఉంది ఈ సినిమా. 

ఉపేంద్ర తన పాత్రకు న్యాయమైతే చేశాడు. పాత్రకి కావాల్సిన ఫిజిక్ ని కూడా బాగా చూపించాడు.

శ్రియ ఎప్పటిలాగానే గ్రేస్ఫుల్ గా ఉంది. కొన్ని సన్నివేశాల్లో నటనకి స్కోపున్న చోటల్లా రాణించింది.

సుదీప్ ది అతిధి పాత్ర. సీక్వెల్ లో ఏమైనా నిడివి ఉంటుందేమో చూడాలి.

శివరాజ్ కుమార్ క్లైమాక్స్ లో మాత్రమే వస్తాడు. సీక్వెల్ మొత్తం ఇతని మీదే అని చెప్పకనే చెప్పారు.

పాన్ ఇండియా సినిమా అనిపించుకోవడంలో భాగంగా తెలుగు వారికి నేటివిటీ ఫీలింగ్ తెప్పించడానికి మురళిశర్మని, సుధని పెట్టుకున్నారు. వాళ్ల పాత్రలను వాళ్లు చక్కగా పోషించారు. అయితే మురళీశర్మకి సొంత గొంతు కాకుండా డబ్బింగ్ పెట్టడం బ్యాడ్. ఎందుకంటే ఆయన గొంతుతో అందరికీ సుపరిచితుడు.

ఒకే ఒక్క షాట్లో కోటశ్రీనివాసరావు కనిపించారు. ఆయన పాత్ర ఏవిటో కూడా తెలీదు.

రవి బస్రూర్ సంగీతం ఓకే. "కబ్జా.." టైటిల్ సాంగ్ బానే ఉంది. అయితే ఆద్యంతం కేజీఎఫ్ కి ఇమిటేషన్ లాగానే ఉంది నేపథ్య సంగీతం కూడా. కెమెరా, లైటింగ్, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే చాలా సెన్స్ లెస్ గా లౌడ్ గా ఉన్న చిత్రమిది. 

కథగా తీసుకుంటే ఇందులోని పాత్రలని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. లార్జర్ దేన్ కాన్వాస్ అనిపించుకోవడానికి అవసరం లేకపోయినా అన్నేసి పాత్రలు రాసుకున్నారేమో అనిపిస్తుంది.

ఓవరాల్ గా కేజీఎఫ్ ఇమిటేషన్లో సీనియర్ కన్నడ హీరోని చూడాలనుకునే వారికి నచ్చవచ్చు. అంత ఓపిక లేదనుకుంటే హాయిగా ఈ చిత్రానికి దూరంగా ఉండొచ్చు. 

బాటం లైన్: కేజీఎఫ్ ని చూసి వాతలు

Show comments