సీఎం ప‌ద‌విపై ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారా?

ఈ నెల 14న మ‌చిలీప‌ట్నంలో జ‌న‌సేన 10వ వార్షికోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. మూడు రోజులు ముందుగానే ప‌వ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వచ్చారు. బీసీల సంక్షేమంపై ఆయ‌న ఆ కులాల‌తో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీసీల స‌మావేశంలో ప‌వ‌న్ ఎక్క‌డా ఆవేశానికి లోను కాలేదు. పవ‌న్ ప్ర‌సంగం ఆయ‌న‌లోని ఆలోచ‌నాప‌రుడిని చూపింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నెల 14న జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో సీఎం ప‌ద‌విపై ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌వ‌న్ స‌న్నిహితులు చెబుతున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌ర‌చూ త‌న‌కు ప‌ద‌వుల‌పై మోజు లేద‌నే సంగ‌తిని ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. కాపులు, బీసీలు క‌లిస్తే అధికారాన్ని సాధించొచ్చ‌నే కీల‌క వ్యాఖ్య‌తో పాటు మ‌రికొన్ని అంశాల‌ను లోతుగా ప‌రిశీలిస్తే.... సీఎం ప‌ద‌విపై ఆయ‌న ప్ర‌క‌ట‌న ఏపీ రాజ‌కీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చే అవ‌కాశం వుందంటున్నారు. అయితే ఆ స‌మ‌యానికి మ‌ళ్లీ ప‌వ‌న్ మ‌న‌సు మార‌కుండా వుంటేనే ఇది సాధ్య‌మ‌ని అంటున్నారు.

జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకొస్తే... బీసీని సీఎం కుర్చీలో కూచోపెడ‌తామ‌నే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఆయ‌న చేయ‌వ‌చ్చ‌ని స‌మాచారం. అదే జ‌రిగితే ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన కార్యాల‌యంలో జ‌రిగిన బీసీల స‌ద‌స్సులో ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీల‌తో పొత్తు విష‌యాన్ని ప‌క్క‌న పెట్టాల‌ని ప‌వ‌న్‌కు సూచించారు. బీసీల‌తో పొత్తు పెట్టుకోవాల‌ని సూచించారు. తాము అండ‌గా వుంటామ‌ని ఆయ‌న‌కు భ‌రోసా ఇచ్చారు. దీంతో ఆయ‌నలో అంత‌ర్మ‌థ‌నం మ‌రింత ఎక్కువైంద‌ని ప‌వ‌న్ స‌న్నిహితులు చెబుతున్నారు.

గ‌త కొంత కాలంగా పొత్తుల‌పై ఆయ‌న సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నార‌ని తెలిసింది. టీడీపీతో వెళ్లాల‌నే నిర్ణ‌యంపై ప‌వ‌న్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా త‌న‌కంటే ఆ పార్టీకే ప్ర‌యోజ‌నం త‌ప్ప‌, జ‌న‌సేన‌కు చాలా త‌క్కువ ప్ర‌యోజ‌న‌మ‌ని ఆయ‌న అనుకుంటున్నారు. ఏపీలో బ‌లీయ‌మైన బీసీ, కాపు, బ‌లిజ‌, వాటి అనుబంధ కులాల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితే రాజ‌కీయంగా అద్భుతాలు సృష్టించొచ్చ‌నే ఆలోచ‌న‌తో ప‌వ‌న్ భ‌విష్య‌త్‌పై దృష్టి సారించారు.

నిన్న‌టి బీసీల స‌మావేశంలో కూడా ఆ రెండు కులాల‌కు కూడా బీసీల చేతిలోకి అధికారం రావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ‘రాష్ట్రంలో బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి. అత్యధిక సంఖ్యా బలం ఉండి కూడా నేటికీ దేహీ అనే స్థితిలో ఉండటం బాధాకరం. హక్కుల కన్నా ముఖ్యం ఐక్యత, ఆర్థిక పరిపుష్టి. వాటిని సాధించిన రోజు బీసీలకు రాజ్యాధికారం తప్పక సిద్ధిస్తుంది. ఈ కృషిలో జనసేన మీ వెంట ఉంటుంది. బీసీలకు సాధికారిత రావాలని మాటలు చెప్పే నాయకుల్నే మీరు చూశారు. చేతల్లో దాన్ని సాధించి చూపించే నాయకత్వాన్ని నేను చూపిస్తాను’ అని ప‌వ‌న్ అన్నారు. బీసీల కోసం ఇది ఆరంభం మాత్రమే అని, మున్ముందు రోజంతా స‌మావేశం అవుదామ‌ని ఆయ‌న అన్నారు.

అలాగే ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభా వేదిక‌పై పవన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారని జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పారు. ఈ ప‌రిణామాల‌న్నింటిని గ‌మ‌నిస్తే బీసీల‌కు సీఎం ప‌ద‌వే జ‌న‌సేన ల‌క్ష్య‌మంటూ ప‌వ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాన్ని తోసిపుచ్చ‌లేమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఎందుకంటే వైఎస్ జ‌గ‌న్ కంటే బీసీల‌కు ప‌ద‌వులు ఇచ్చిన ముఖ్య‌మంత్రులు మ‌న‌దేశంలో లేరు. బీసీలు ముఖ్య‌మంత్రులుగా ఉన్న చోట కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ సామాజిక వ‌ర్గానికి వ‌చ్చిన‌న్ని ప‌ద‌వులు, మ‌రెక్క‌డా ఇవ్వ‌లేద‌న్న‌ది వాస్త‌వం.

సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయంగా ఎన్నైనా విమ‌ర్శ‌లు చేయ‌వ‌చ్చు. కానీ బీసీలు ప‌ద‌వులు పొందార‌న్న వాస్త‌వాన్ని ఎలా కాద‌న‌గ‌ల‌రు? కావున బీసీల ఆద‌ర‌ణ పొందాలంటే ప‌వ‌న్ ఎదుట ఉన్న ఏకైక ఆప్ష‌న్‌... వారికి సీఎం ప‌ద‌వి ప్ర‌క‌టించ‌డ‌మే. చంద్ర‌బాబుతో క‌లిస్తే ఎటూ త‌న‌కు సీఎం ఇవ్వ‌ర‌నే ప‌వ‌న్‌కు బాగా తెలుసు. అలాంట‌ప్పుడు టీడీపీకి దూరంగా వుండి, బీసీలకు రాజ్యాధికారం సాధించ‌డానికి ప‌ద‌వీ త్యాగం చేసిన నాయ‌కుడిగా ప‌వ‌న్ త‌న‌ను తాను ఆవిష్క‌రించుకోవ‌చ్చు. ఆ దిశ‌గా అడుగులు వేస్తే... ప‌వ‌న్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ మున్ముందు ఓ రేంజ్‌లో వుంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Show comments