Dochevarevarura Review: మూవీ రివ్యూ: దోచేవారెవరురా

చిత్రం: దోచేవారెవరురా
రేటింగ్: 1.5/5
తారాగణం:
ప్రణవ్ చంద్ర, మాళవిక సతీశన్, అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: రోహిత్ వర్ధన్
కెమెరా: అర్లీ
నిర్మాత: బొడ్డు కోటేశ్వర రావు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ నాగేశ్వర రావు
విడుదల తేదీ: 11 మార్చ్ 2023

చాలా కాలం తర్వాత దర్శకుడు శివనాగేశ్వర రావు కొత్త సినిమాతో ముందుకొచ్చారు. ఆయన కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని ఆయన గత సినిమాలు చూసిన అందరికీ తెలుసు. ఇప్పుడీ "దోచేవారెవరురా" ఎంత వరకు ప్రేక్షకుల మనసుల్ని దొచుకుందో చూద్దాం. కామెడీ కూడా ఎంతుందో లెక్కేద్దాం.

కథలోకి వెళ్తే సిద్ధు (ప్రణవ్ చంద్ర) ఒక జేబు దొంగ. తనతో పాటు ఒక పిల్లవాడు కూడా తోడుగా ఉండి అదే పని చేస్తుంటాడు. లక్కీ (మాళవిక) అనే అమ్మాయి ఒక కంపెనీలో పనిచేస్తుంటుంది. అతని బాస్ ఆమెను హరాస్ చేస్తుంటాడు. ఒక రోజు ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీయించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ వీడియో ఉన్న ఫోన్ ని దొంగతనం చేసి తెమ్మని మన హీరోని అడుగుతుంది. ఇతను అంతా ప్లాన్ ప్రకారమే చేసి పని కానిస్తాడు. కానీ ఆ బాస్ అదే రాత్రి తన ఇంటిలో హత్యకు గురౌతాడు. ఆ హత్య చేసిందెవరనేది మిగతా కథ. 

ఈ కథలోకి ఇంకా చాలా పాత్రలు వస్తాయి. ఒక వ్యాపారి (అజయ్ ఘోష్) తన భార్యని చంపమని సత్తి (బిత్తిరి సత్తి)కి సుపారీ ఇస్తాడు. నానా రకాల ట్రాకుల్లోంచి కథ నడిచి చివరికి షరా మామూలుగా సుఖాంతమవడం కథ. 

సీనియర్ దర్శకులు ట్రెండుకి అస్సలు మ్యాచ్ అవ్వలేకపోతున్నారు. దానికి కారణం కొత్త సినిమాలు రెగ్యులర్ గా చూడకో, లేక తాము తీసిందే కరెక్ట్ అనుకునే ధోరణి వల్లో తెలీదు కానీ దశాబ్దాల క్రితం నాటి మేకింగ్ స్టైలుకే అతుక్కుపోతున్నారు. మొన్నవారం "ఆర్గానిక్ మామ-హైబ్రిడ్ అల్లుడు" పేరుతో సినిమా తీసిన ఎస్వీ కృష్ణా రెడ్డి నేటి ట్రెండుకి అస్సలు సింకవ్వక నీరసపరిస్తే, ఈ రోజు శివనాగేశ్వర రావు "దోచేవారెవరురా" అంటూ అదే పని చేసారు. ఒకనాటి మనీ, సిసింద్రీ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు మారుతున్న కాలంతో పాటూ అప్గ్రేడ్ అవ్వలేదనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. 

చెప్పుకోవాలంటే ఇందులో చాలా ఇబ్బందులున్నాయి. ప్రధానంగా కామెడీ అస్సలు లేకపోవడం. ఒకటి రెండు జోకులకి మించి అసలిందులో మొహమాటానికి నవ్వుదామన్నా కూడా నవ్వు రాని సీన్లే ఎక్కువ. కథ పరంగా ఎక్కడా ఉత్కంఠ ఉండదు. ఆపైన చాలా పాత కాలపు కథనం. వీటికి తోడు టెక్నికల్ గా కూడా ఇప్పటి ట్రెండుకి తగ్గట్టు లేదు. సంగీతం చాలా వీక్ గా ఉంది. పాటల్లో కానీ, నేపథ్య సంగీతంలో కానీ ఎక్కడా నేటి ట్రెండ్ వినపడలేదు. కథనం కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు నేపథ్య సంగీతం ఆదుకోవాలి. అసలా చాన్సే లేని స్థాయిలో ఉంది ఔట్ డేటెడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. 

ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్ ఒక్కటే... 2 గంటల లోపు సినిమా ముగిసిపోవడం. దీనికంటే యూట్యూబులో వచ్చే షార్ట్ వీడియోస్ ఎక్కువ నవ్వు తెప్పిస్తాయి. 

ప్రణవ్ చంద్ర చూడ్డానికి పర్వాలేదనుకున్నా, డిక్షన్ బాగున్నా మాస్ ని ఆకట్టుకునే లక్షణాలు నటనలో పెద్దగా లేవు. మాళవిక సతీశన్ అభినయంలో ఓకే కానీ హీరోయిన్ గా కనపడడానికి చాలా శారీరక శ్రమ చెయ్యాలి. బిత్తిరి సత్తి కామెడీ నీరసాన్ని, అజయ్ ఘోష్ కామెడీ నిట్టూర్పుల్ని తెప్పిస్తాయి. 

ఎలా చూసుకున్నా టీవీలోనో, ఓటీటీలోనో వచ్చినప్పుడు ఫ్రీగా చూడ్డానికి ఓకేనేమో కానీ టికెట్టు కొనుక్కుని హాలుకెళ్లి చూసే స్థాయిలో లేదు ఈ చిత్రం. 

బాటం లైన్: మనసు దోచుకోలేదు

Show comments