ఎమ్మెల్సీ ఎన్నిక‌లు...వైసీపీ శ్రేణుల అంత‌రంగం!

ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ‌, స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నేటి సాయంత్రానికి ప్ర‌చారం ముగుస్తుంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ సునాయాసంగా గెలుపొందుతుంది. టీచ‌ర్స్‌, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఎదుర్కోంటోంది. ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో వైసీపీ శ్రేణుల అంత‌రంగం గురించి తెలుసుకుంది. వారి మ‌న‌సులో అభిప్రాయాల్ని తెలుసుకుంటే వైసీపీ పెద్ద‌లు షాక్‌కు గురి కావాల్సిన ప‌రిస్థితి.

ఇటు శ్రీ‌కాకుళం మొద‌లుకుని, అటు పులివెందుల వ‌ర‌కూ ఒకే ర‌కంగా ఆలోచిస్తుండ‌డం విశేషం. ఏపీలో మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు ఈ నెల 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌రాంధ్ర‌, తూర్పు, ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో విజ‌యం సాధించ‌డం వైసీపీకి త‌ప్ప‌నిస‌రైంది. ఈ స్థానాల నుంచి వైసీపీ త‌ర‌పున సీతంరాజు సుధాక‌ర్‌, పేర్నాటి శ్యాంప్ర‌సాద్‌రెడ్డి, వెన్న‌పూస ర‌వీంద్రారెడ్డి బ‌రిలో నిలిచారు. ఎంతో మందుగానే అభ్య‌ర్థుల‌ను అధికార పార్టీ ప్ర‌క‌టించింది.  

అన్ని చోట్లా వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులే ఉన్నారు. అయితే ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో వైసీపీకి విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కా? అంటే కాద‌నే చెప్పాలి. అలాగ‌ని ఓడిపోతుందని చెప్ప‌లేం. ఎందుకంటే గ‌ట్టి పోటీ నెల‌కుంది. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అభిమానుల మ‌నోగ‌తం చాలా విచిత్రంగా వుంది. గ‌త నాలుగేళ్ల‌లో త‌మ‌కెలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని, అస‌లు ప‌ట్టించుకునే దిక్కే లేద‌నే ఆవేద‌న‌, ఆగ్ర‌హం వైసీపీ శ్రేణుల్లో బ‌లంగా ఉంది.

క‌నీసం ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థుల్ని ఓడిస్తే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు జ్ఞానోద‌యం అవుతుంద‌ని ఆలోచించే వాళ్లే ఎక్కువంటే అతిశ‌యోక్తి కాదు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓడిస్తే సీఎం జ‌గ‌న్‌తో పాటు మిగిలిన వైసీపీ నేత‌ల‌కు బుద్ధి వ‌స్తుంద‌ని, అప్పుడు త‌మ‌ను ప‌ట్టించుకుంటార‌నే కోణంలో అధికార పార్టీ సానుభూతిప‌రులైన వార్డు, గ్రామ‌, మండ‌లస్థాయి నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. 2024లో మాత్రం వైసీపీనే గెల‌వాలి, మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం కావాల‌ని వారంతా ఆకాంక్షిస్తుండ‌డం విశేషం.

గ‌తంలో అధికార పార్టీ అభ్య‌ర్థుల్ని కాద‌ని, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నేత‌ల్ని గ్రాడ్యుయేట్స్‌, టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిపించిన దాఖ‌లాలు చాలా ఉన్నాయి. చంద్ర‌బాబు హ‌యాంలో తూర్పు, ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థులే గెలుపొందారు. స్వ‌యంగా మంత్రి నారాయ‌ణ స‌మీప బంధువే ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న‌ప్పుడు ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి టీడీపీ అభ్య‌ర్థి వెంక‌ట‌శివారెడ్డి గెలుపొందారు.

ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల తీర్పు భిన్నంగా వుంటుంది. ప్ర‌జాసంఘాలు, పార్టీల‌పై అసంతృప్తులు ఈ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌క ప‌ని చేస్తాయి. ప్ర‌స్తుతం వైసీపీ శ్రేణుల అంత‌రంగాన్ని ఆ పార్టీ పెద్ద‌లు చద‌వ‌గ‌లిగితే చాలా పాఠాలే నేర్చుకోవ‌చ్చు. రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు గుణ‌పాఠాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

Show comments