ఎర్రన్నలతో తమ్ముళ్ళ ఇచ్చి పుచ్చుకునే బేరం

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇపుడు కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికలనే సెమీ ఫైనల్స్ గా విపక్షాలు తీసుకుంటున్నాయి. నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ఇప్పటిదాకా ఓటమి అనేదే ఎదురు కాలేదు సరికదా ఏ ఎన్నిక జరిగినా భారీ మెజారిటీతో ఢంకా భజాయిస్తోంది. మూడు ఉప ఎన్నికలు జరిగితే విపక్షాలు సోదిలో లేకుండా పోయాయి.

లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరిగితే నూటికి తొంబై శాతం వైసీపీ గెలుచుకుంది. అయినా వైసీపీ మీద భారీ వ్యతిరేకత ఉందని తెలుగుదేశం ప్రచారం చేస్తోంది. అయినా దాన్ని ఎన్నికల ద్వారా నిరూపిస్తేనే ఆ పార్టీ వాదనకు బలం చేకూరుతుంది. ఇపుడు అందివచ్చిన అవకాశంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి.

లోకల్ బాడీ కోటాలో నాలుగు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ వైసీపీ ఖాతాలో పడడం ఖాయం. మరో అయిదు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇందులో టీచర్ ఎమ్మెల్సీ రెండు, పట్టభద్రుల ఎమ్మెల్సీ మూడు ఉన్నాయి. వీటి మీదనే తెలుగుదేశం గురి పెట్టింది. వీటిని ఎలాగైనా గెలుచుకుంటే ఏపీలో వైసీపీ పని అయిపోయిందన్న తమ ప్రచారానికి మంచి బలం వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కామ్రేడ్స్ పోటీ చేస్తున్నారు. టీడీపీ పోటీ పెట్టలేదు. దాంతో పట్టభద్రుల ఎమ్మెల్సీకి టీడీపీ పోటీ చేస్తున్న మూడు చోట్ల తమకు మద్దతు ఇవ్వమని తెలుగుదేశం కామ్రేడ్స్ తో ఇచ్చి పుచ్చుకునే రాయబారాన్ని నడుపుతోందని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓట్లు కీలక పాత్ర వహిస్తాయి. తొలి ప్రాధాన్యత ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు చాలా విలువ చేస్తాయి. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కామ్రెడ్స్ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తమకు వేస్తే తాము ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ఆ పార్టీ అభ్యర్ధులకు వేస్తామని తెలుగుదేశం నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నట్లుగా ప్రచారం జ‌రుగుతోంది.

ఇలా రెండు పార్టీలు పరస్పర అవగాహనతో ముందుకు సాగితే ఎవరు గెలిచినా వైసీపీ ఓడిపోవడం ఖాయం చేయాలన్న ఉమ్మడి వ్యూహం ఉందని అంటున్నారు. ఎర్రన్నలతో తెలుగుదేశం పొత్తు ప్రతిపాదనలకు ఇది తొలి మెట్టుగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలను చూసిన మీదట రేపటి ఎన్నికల్లో కలసి ముందుకు వెళ్తారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎర్రన్నలతో ఇచ్చి పుచ్చుకునే ఈ రాజకీయం అధికార పార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఉత్తరాంధ్రాలో కామ్రేడ్స్ కి బలం ఉంది. వైసీపీ కూడా ఇక్కడ పట్టు పెంచుకుంది. ఇపుడు తెలుగుదేశం కలసి వస్తే ఏ రకంగా ఫైట్ ఇస్తారో అన్నది తెలియాల్సి ఉంది.

Show comments