క‌ర్ణాట‌క‌కు మ‌ళ్లీ కొత్త ముఖ్య‌మంత్రా..!

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిని బీజేపీ అధిష్టానం మార్చేయ‌నుంద‌నే ప్ర‌చారం మ‌ళ్లీ ఊపందుకుంటోంది. గ‌త ఏడాది జూలైలో ముఖ్య‌మంత్రి హోదాను అధిష్టించిన బ‌స‌వ‌రాజ్ బొమ్మైకి రెండు మూడు నెల‌లు కూడా ప్ర‌శాంత‌త‌ను ఇచ్చిన‌ట్టుగా లేరు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు సీటును స‌ర్దుకోవ‌డ‌మే స‌రిపోతున్న‌ట్టుగా ఉంది. ఎప్ప‌టికప్పుడు అదిగో.. ఇదిగో.. అంటూ బీజేపీ నేత‌లే బెంబేలెత్తిస్తూ ఉన్నారు.

ఇలాంటి త‌రుణంలో హిందుత్వ వాదుల మ‌ద్ద‌తును చూర‌గొన‌డానికి బొమ్మై చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు! మ‌త మార్పిడిల నిరోధ‌క చ‌ట్టం, ముస్లిం యువ‌తుల హిజాబ్ పై నిషేధం. ఇలాంటి ర‌చ్చ‌లు కూడా బొమ్మై ప‌ద‌విని ర‌క్షిస్తున్న‌ట్టుగా లేవు. ఆయ‌న‌ను మార్చాల‌ని, మార్చేస్తున్నారంటూ బీజేపీ నేత‌లే త‌ర‌చూ చెబుతూ వ‌స్తున్నారు.

అయితే ఇప్పుడు మ‌రో పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ప్ర‌హ్లాద్ జోషీని క‌ర్ణాట‌క సీఎంగా చేయ‌డం దాదాపు లాంఛ‌న‌మే అని ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. బొమ్మైని మార్చేయ‌నున్నార‌నే ప్ర‌చారానికి ఇప్పుడు జోషీ పేరు కూడా తోడ‌య్యింది. ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా ఇప్పుడు ఈ అంశంపై స్పందిస్తున్నాయి. బొమ్మైని కాద‌ని జోషీని చేసినా బీజేపీకి ఓట‌మే అంటున్నాయి క‌ర్ణాట‌క ప్ర‌తిప‌క్షాలు.

అలాగే సామాజిక‌వ‌ర్గాల అంశం కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. య‌డియూర‌ప్ప‌ను కాద‌ని బొమ్మైని సీఎం సీట్లో కూర్చోబెట్టిన‌ప్పుడు లింగాయ‌త్ ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డానికి బీజేపీ అధిష్టానం ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన‌ట్టుగా క‌నిపించింది. అయితే  ప్ర‌హ్లాద్ జోషీ లింగాయ‌త్ కాదు. ఆయ‌న బ్ర‌హ్మ‌ణ సీఎం. క‌ర్ణాట‌క‌కు చాలా ద‌శాబ్దాల తర్వాత బ్ర‌హ్మ‌ణ సీఎం వ‌చ్చిన‌ట్టుగా అవుతుంది. 

జ‌నాభాతో పోల్చి చూసినా క‌ర్ణాట‌క అసెంబ్లీలో , క‌ర్ణాట‌క నుంచి లోక్ స‌భ‌కు ఎన్నికైన బ్ర‌హ్మణ నేత‌ల సంఖ్య బాగానే ఉంటుంది. ఇలాంటి నేప‌థ్యంలో సీఎం సీటును బ్ర‌హ్మిణ్స్ కు ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. జోషీ పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది!

Show comments