ఎమ్బీయస్‍ కథ: సమ్మర్ ఆఫ్ 42

‘‘రండి మహాలక్ష్మిగారూ, మేం యిక్కడున్నట్లు ఎవరు చెప్పారు?’’ అడిగింది రాజేశ్వరి తలుపు తీస్తూ. ‘‘మనం గూడెంలో ఉండగా పక్కింట్లో ఉండే లలితగారు యీ మధ్యే కనబడి, మీరూ యీ ఊళ్లోనే ఉంటున్నారని చెప్పారు. తన పెళ్లికి మిమ్మల్ని పిలవాలని వాసూ పట్టుబట్టడంతో పిలుపులకు వచ్చాం.’’ అంది మహాలక్ష్మి. ‘‘వాసూ పెళ్లా? పెద్దవాడై పోయాడన్నమాట. చూసి పధ్నాలుగు, పదిహేనేళ్లు అయి వుంటుంది. ఏడీ? తను రాలేదా?’’ అడిగింది రాజేశ్వరి. ‘‘స్కూటరు పార్క్ చేసి వస్తున్నాడు.’’ అని జవాబిచ్చింది మహాలక్ష్మి చేతిలో కుంకుమ భరిణతో లోపలకి వస్తూ. అంతలోనే శుభలేఖ చేతిలో పట్టుకుని వాసూ వచ్చాడు. అతన్ని చూస్తూనే రాజేశ్వరి చిరునవ్వు నవ్వింది. ముప్ఫయి దాటాయేమో. స్ఫురద్రూపం. చూడగానే మంచి పెళ్లికొడుకు అనిపిస్తున్నాడు. కుశలప్రశ్నలయ్యాక మహాలక్ష్మి వాసు చదువుసంధ్యల గురించి, ఉద్యోగం గురించి, పెళ్లికూతురి కుటుంబం గురించి చెప్తూంటే ఓ చెవితో వింటూనే రాజేశ్వరి మనసు గతంలోకి వెళ్లింది.

గూడెంలో ఉండే రోజుల్లో తన భర్తది చాలా చిన్న ఉద్యోగం. ఓ చిన్న వాటాలో కాపురం ఉండేవారు. తర్వాత కొన్నాళ్లకు మహాలక్ష్మిగారి కుటుంబం వచ్చి చేరింది. వాళ్ల అబ్బాయి వాసు మొదట్లో బాగానే ఉండేవాడు కానీ తర్వాతి రోజుల్లో న్యూసెన్సుగా తయారయ్యాడు. దానికి సగం కారణం తన భర్త వెంకటేశ్వర్లే. ఆయన అప్పటికీ యిప్పటికీ ఏదో అయోమయపు మనిషిలా వుంటారు. 45 ఏళ్లకే తల బాగా నెరిసి, పెద్దవాడిలా కనబడేవారు. తనకంటే పదేళ్లే పెద్ద. కానీ అంతకంటె ఎక్కువ తేడా వున్నట్టు కనబడతారు. తన మొఖం తీరుతెన్నులు చక్కగా అమిరి వుండడం వల్లా, కాస్త శ్రద్ధ తీసుకోవడంవల్లా వున్న నడివయసు దానిలా కాక చిన్నదానిలా అనిపించేది. అప్పటికి శైలజ పుట్టకపోవడం వల్ల వయసు తెలిసేది కాదు. పైగా వున్నంతలో కాస్త శుభ్రమైన బట్టలు వేసుకునేది.

ఈయన పాత రకంగా బట్టలు కుట్టించుకుంటారు, గడ్డం ఎప్పుడూ మాసే వుండేది. పైగా అప్పట్లో సైకిల్ మీద ఫైల్స్ వేసుకుని ఇంటికి తెచ్చే అలవాటొకటి ఉండేది. ఆనాటి నాటకాల్లో ‘నలుగురు ఆడపిల్లల తండ్రి’, ‘బతకలేక బడిపంతులు’ వేషం వేసేవాళ్ళలా వుండేవారు. ఎన్నోసార్లు చెప్పింది శుభ్రంగా జుట్టుకు రంగేసుకుని కలర్‌ఫుల్ షర్టు వేసుకోండని. వినేవారు కాదు. కూతురు పోరు భరించలేక యిప్పుడు కాస్త మారారు. జుట్టుకి రంగేస్తున్నారు. రోజూ గడ్డం గీస్తున్నారు. అప్పట్లో మాత్రం కాస్త శుభ్రంగా ఉండమంటే ‘ఇప్పుడే రంభ వరించాలి?’ అనేవారు. వరించడానికి రంభే కావాలా? భార్య సరిపోదా? మాట కూడా అదో రకం. అన్నిటికీ నిస్పృహగా మాట్లాడతారు. అది మాత్రం మారలేదు. చీరల గురించి మాట్లాడితే ‘ఏం చీరలో, ఏం లోకమో, ప్చ్’ అంటారు. సినిమాల గురించి మాట్లాడబోతే ‘ఏం సినిమాలో, ఏం లోకమో’ అంటారు. ఆయన్తో మాట్లాడడమే ఓ పెద్ద శిక్ష.

శైలజ యింకా పుట్టలేదు కాబట్టి తనకు పొద్దుపోవడం ఓ పెద్ద సమస్యగా ఉండేది. పెళ్లిలో నాన్నగారి కొలీగ్స్ బహుమతిగా ఇచ్చిన టూ-ఇన్-వన్ టేప్ రికార్డరు అక్కరకు వచ్చింది. పాటలు వినడమే పెద్ద కాలక్షేపంగా ఉండేది. పుస్తకాలు చదవడంకూడా తనకిష్టమే. కొనుక్కునే తాహతు ఉండేది కాదు కాబట్టి అద్దె పుస్తకాల షాపుకెళ్ళి తీసుకొనేది. అప్పటికే పుస్తకాలు అద్దె కిచ్చే షాపులు తగ్గిపోయాయి. ఓ ముసలాయన మాత్రం షాపు మూసేయకుండా ఉంచి తన కొడుకుని చూసుకోమన్నాడు. ఆ కుర్రాడికి తోడుగా నలుగురు నిరుద్యోగులైన స్నేహితులు ఎప్పుడూ అక్కడే తగలడేవారు. ఏ మేగజైన్ జూసినా ఏదో ఒక సెక్స్ రచన వుండక తప్పదు. ఒకటో, రెండో అలాంటి బొమ్మలూ వుంటాయి. తను మాగజైన్ తీసుకుని అటూ, ఇటూ తిరగేస్తుంటే అలాంటి కథలో, బొమ్మలో రాగానే వాళ్ళు తన మొహంకేసి ఆసక్తిగా చూసేవారు. తన రియాక్షన్ ఎలా వుంటుందాని.

ఏం ఆడవాళ్ళు మాత్రం సెక్స్ కథలు చదవకూడదా? అవన్నీ మగవాళ్ళ సొత్తేనా? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, ఆడైనా మగైనా, రుచులూ, అభిరుచులూ ఇచ్చేడు. కొంత మంది కనబరచుకుంటారు. కొందరు కనబరచుకోరు. అందరు ఆడవాళ్ళూ ఒకేలా వుండరు. తన ఫ్రెండు పద్మకు పచ్చిగా రాస్తే పరవశం. తనకది నచ్చదు. సగం రాసి తక్కినది మన ఊహకి వదిలేస్తే బాగుంటుంది. అలాగే మొగవాళ్లనూ. వాళ్లలోనూ డిగ్రీలుంటాయనకుంటా. మగవాళ్ళంతా రసిక శిఖామణులూ, ఆడవాళ్ళంతా అయిసుగడ్డలూ అన్నట్లు కథలు రాసేవారు అప్పట్లో. అవి చదివి కుర్రగాంగు అయిసుగడ్డలు కరిగించడం తమ బాధ్యత అనుకునేవారు. కర్తవ్యనిర్వహణలో చిన్నాపెద్దా వయసు తేడా పట్టించుకోకూడ దనుకునేవారు.

ప్రాణం విసుగుపుట్టి పుస్తకాల షాపుకి వెళ్ళడం మానుకుంది. అదృష్టవశాత్తూ పక్కింట్లోకి మహలక్ష్మిగారు వచ్చి చేరింది. వాళ్ళాయన స్కూల్లో లైబ్రేరియన్. ఏ పుస్తకం కావాలన్నా ఇంటికి తెచ్చేస్తాడు. మహలక్ష్మి కలుపుగోలు మనిషి. 'పుస్తకాలు ఏం చదవాలన్నా నాకు చెప్పండి. తెప్పించి పెడతాను. మా అబ్బాయి వాసు ఉన్నాడు. ఏవైనా ఇంట్లో పనులు ఉంటే చెప్పి చేయించుకోండి. ఇరుగుపొరుగన్నాక ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా?" అంది. వాసుకూడా బుద్ధిమంతుడే. చెప్పిన పని చేస్తూ, చేదోడు వాదోడుగా వుండేవాడు. సరదాగా కబుర్లు చెప్పేవాడు. వాళ్ళ నాన్న తెచ్చే పుస్తకాలే కాకుండా ఫ్రెండ్స్‌ నడిగి పత్రికలూ, పుస్తకాలూ తెచ్చి పెట్టేవాడు. షాపు నుంచి ఏ రకమైన పత్రికైనా సరే ప్రశ్నలడక్కుండా తెచ్చిపెట్టేవాడు. 'ఆంటీ' అంటూ వెంట తిరిగేవాడు. 

కానీ అతనిలో క్రమంగా మార్పొచ్చింది. సీరియల్స్, సినిమాలు చూశాక ‘ఆంటీ’ అనేది ఒక రొమాంటిక్ పదార్థం అనిపించిందేమో! ఈయన వాలకం చూసి, పిల్లలు లేకపోవడం చూసి మా ఇద్దరి మధ్యా శారీరక సంబంధం లేదేమో, తను నరాల ఆకలితో కరకరలాడుతోందని అనుకున్నాడులా ఉంది. తన వెంట పడడం మొదలెట్టాడు. ఓరోజు తను నేలమీద కూర్చుని లేవబోతుంటే తొట్రుపడి మెడలో వున్న లాకెట్ ఎగిరి జాకెట్టు మధ్యలో ఇరుక్కుంది. ఎదురుగా వున్న వాసు దాని మీద చమత్కారంగా వ్యాఖ్యానించాడు. తను నవ్వు అపుకోలేకపోయింది. అప్పటినుంచీ పేట్రేగిపోయాడు. ఓసారి వాళ్ళింట్లో టీవీ చూస్తుంటే అతను పక్కన వచ్చి కూర్చోబోయాడు. తను పక్కకు జరిగి ‘నీకీ చోటు చాలా?’ అనడిగింది. అతనేదో ద్వంద్వార్థంగా మాట్లాడాడు. అలాగే యీయన మామిడిపళ్లు తెచ్చినప్పుడు కూడా! గత అనుభవంతో తను నవ్వలేదు. 

కానీ అతను అలాటి కామెంట్లు మానలేదు. తల్లి దగ్గర్లో ఉంటే సగం గట్టిగా, సగం మెల్లిగా అనేవాడు. అక్కరలేనంత దగ్గరగా తగిలీతగలనట్లు నిలబడేవాడు. చూసుకోకుండా కదిలితే ప్రమాదమే! మహలక్ష్మి గారితో ఓసారి అంది కూడా ‘మీ వాసు ఈమధ్య అదోలా మాట్లాడుతున్నాడు గమనించారా?’ అని. ఆవిడ వినిపించుకొంటేగా! ‘వాడు చిన్నప్పటి నుంచీ తెలివైనవాడే. బుద్ధిమంతుడు కూడాను. భలే చమత్కారంగా మాట్లాడతాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ’ అంటూ చెప్పుకొచ్చింది. ‘సెన్సాఫ్ హ్యూమర్ కాదు తల్లీ హ్యూమరాఫ్ సెక్స్’ అని చెప్పబుద్ధేసింది. అవిడ సొద ఆవిడదే. అవును మరి. ఒక్కగానొక్క కొడుకు. క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఇంట్లో పనులు చేసిపెడతాడు. వాడి గురించి చెడుగా చెబితే ఎవరు నమ్ముతారు? అందునా తల్లి నమ్ముతుందా?

వాసు పుస్తకాలు, మాగజైన్లు ఇచ్చి వెళ్ళిపోవటంలేదు. ‘ఆంటీ ఈ బొమ్మ చూశారా? ఒంపులు అన్నేచురల్‌గా వున్నాయి కదూ’ అనో, ‘మిమ్మల్ని మోడల్‌గా పెట్టుకుని బొమ్మ వేయించి ఉంటే బాగుండేది’ అనో అనేవాడు. ఓసారి ‘ఈ కథ చదివారా? దీంట్లో ఓ కుర్రాడు ఇంటిపక్కావిడతో సంబంధం పెట్టుకుని ఊరంతా చెప్పుకుంటాడు. అది అన్యాయం కదూ..’ అన్నాడు. ‘నన్ను చేరదీసినా గుట్టుగానే వుంచుతాను’ అని తనకి హింట్ ఇచ్చాడేమో. తను మామూలుగానే సంసారం చేసుకుంటోందనీ, పిల్లలు పుట్టకపోవడానికి శారీరకలోపమో, ప్రయత్నలోపమో కారణం కాదని ఆ కుర్రాడికి విప్పి చెప్పడం ఎలా? వాసు తీరు గురించి యీయనకి చూచాయగా చెప్పబోతే అర్థం చేసుకోలేదు. ‘నువ్వేమైనా కన్నెపిల్ల వనుకుంటున్నావా?’ అంటూ కొట్టి పారేశారు. పోనీ వాసుని దూరం పెట్టేద్దాం, యింట్లోకి రానీయకుండా చేద్దాం అనుకుంటే ఏ కారణం చెపుతుంది? మహలక్ష్మిగారితో స్నేహం చెడుతుంది. తనే ఏదోలా అతన్ని సవ్యమైన దారిలో పెట్టాలి అనుకుంది.

50వ పడిలో పడినా అందంగా, హుందాగా ఉన్న రాజేశ్వరీ ఆంటీని చూస్తూంటే వాసుకి పాత విషయాలు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో తరుణవయస్కుడిగా ఆవిడంటే ఎందుకు పడి చచ్చేవాడో యువకుడిగా యిప్పుడు బాగా అర్థమౌతోంది. తన క్లాసుమేట్ శేషుగాడు బాగా ఎగదోసేవాడు.  ‘ప్రౌఢలకు సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయి. మొగుడికీ అవి తీర్చే ఓపికా, తీరికా ఉండవు. మొగుడు సరిగా లేని నడివయస్కులైన ఆడాళ్ళు అందుబాటులో ఉన్న కుర్రాళ్ళని మరిగి అన్నీ దోచిపెడతారు. వాళ్లయితే ఎవరికీ అనుమానం రాదని ధీమా.’ అనేవాడు. తను చదివే పుస్తకాల్లో పక్కింటి ఆంటీల గురించి బోల్డు కథలుండేవి. రాజేశ్వరి ఆంటీ అలాటి కాండిడేటు అవునా కాదా అనేది తేలేదికాదు. సరదాగా ఉంటుంది. తన జోక్స్‌కి పడిపడి నవ్వుతుంది. తనచేత అలాంటి పుస్తకాలు తెప్పించుకుంటుంది. నాన్‌వెజ్ జోక్స్ వేసినా కోపగించుకోదు, యాగీ చేయదు. ఆవిడకు తన మీద ఎలాటి అభిప్రాయం ఉందో అంతు పట్టేది కాదు.

‘ఆంటీ నన్ను ఎంకరేజ్ చేస్తోంది కానీ ఆహ్వానించడం లేదింకా. తొందరపడితే కథ అడ్డం తిరిగి నేను వీధిన పడాల్సి వస్తుంది’ అని అంటే శేషుగాడు ‘ఇవాళ ఫలానావేళ మా ఇంటికి రావోయ్, ఎవరూ ఉండరు అని ఎప్పుడూ ఓపెన్‌గా చెప్పర్రా. మనమే చొరవ తీసుకుని నడుంమీదో, హిప్‌ మీదో చెయ్యేసేయాలి. అప్పుడే వాళ్ళు దగ్గరకు లాక్కుంటారు. లేకపోతే ‘పప్పు సుద్దగాడు’ అనుకొంటారు. చొరవ తీసుకోవడం మగాళ్ల బాధ్యత!’ అన్నాడు. తనకంత ధైర్యం చాలేది కాదు. ఆవిడ అమ్మతో చెప్పేస్తే..! అని భయపడుతూండే రోజుల్లో బంధువులొకాయన ‘సిడిలొచ్చాక యింకా యీ పాత టేప్ రికార్డరెందుకు, రిపేరు చేసేవాడూ లేడు’ అనుకుని తన కిచ్చేశాడు. పట్టుకెళ్ళి ఆంటీకి చూపిస్తే ‘నా దగ్గిర పాటల కాసెట్లున్నాయి తీసుకెళ్ళు. సిడిలైతే వాళ్ల సెలక్షనే ఉంటుంది. కాసెట్లయితే మనకిష్టమైనవి ఏరికోరి చేయించుకోవచ్చు. నేను అలా చేయించుకున్నవే’ అంటూ రెండిచ్చింది. 

వాటిలో కొన్ని ప్రేమగీతాలు ఉన్నాయి. ఒక విరహ గీతం కూడా ఉంది. బహుశా ఆవిడ బాధను, భావాలనూ ఆ పాట ద్వారా వెలిబుచ్చిందేమో. తనే గ్రహించలేకుండా ఉన్నాడేమో. ఒక పాటలో ‘హల్లో కులాసా? ఓ శ్రీనివాసా!’ అనే పాట కూడా వుంది. తన పూర్తిపేరు శ్రీనివాస్ కాబట్టే ఆమె ఆ పాట రికార్డు చేసుకుందేమో అనుకున్నాడు. మూడోసారి యిచ్చిన కాసెట్‌ చివరకు వచ్చేసరికి పాటలకు బదులు మాటలు వినబడగానే తను ఉలిక్కిపడ్డాడు. ఆ మాటలన్నీ యిప్పుడు గుర్తు లేవు కానీ అది ఆంటీ, అంకుల్ మధ్య సరససంభాషణ. అంకుల్ మాటలు వింటూంటే మామూలుగా మాట్లాడినట్లే ఉన్నాయి పదాలు. దానికి ఆంటీ యిచ్చిన జవాబులు వింటే అర్థమౌతుంది, వాటిలో మరో మీనింగు ఉందని. అబ్బ, యింత రసికుడా అంకుల్ అనిపించింది. 

ఓ మధ్యాహ్నం యీవిడ పాటలు వింటూంటే ఆయన మధ్యలో వచ్చినట్టున్నాడు. ఈవిడ స్టాప్ బటన్ నొక్కబోయి రికార్డు బటన్ నొక్కేసినట్టుంది. దాంతో వాళ్ల మాటలు, చేష్టలు రికార్డయిపోయాయి. ఈవిడ ‘వేళ కాని వేళ, ముందుగదిలో యీ దుకాణం ఏమిటి?’ అంటూనే సహకరిస్తోంది. ఆయన ‘ఏం ఫర్వాలేదు, దీనికి వేళాపాళా ఏముంటుంది?’ అంటూ ముందుకెళ్లిపోతున్నాడు. ఆ తర్వాత వినబడిన రకరకాల శబ్దాలు వింటే అక్కడ జరిగిందేమిటో సులభంగా తెలిసిపోతుంది. అది వినగానే తనకు మతిపోయింది. రాజేశ్వరి ఆంటీ సంగతి ఇదా, మొగుడితో హాయిగా కులుకుతోంది. అందుకనే తనను దగ్గరికి రానివ్వటంలేదు అని అర్థమైంది. 

అప్పటికీ తన ఫ్రెండ్ మదన్ అంటూనే ఉండేవాడు. ‘ఈ పెళ్ళయిన ఆడాళ్ళంతా ఇంతేరా! వాళ్ళకు మొగుడి దగ్గర అన్నీ దొరుకుతాయి. కడుపు నిండిన బేరం. మనని వెర్రాళ్ళని చేసి ఆడిస్తూ పనులు చేయించుకుంటారు. మనం వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళ ‘ఇగో’ తృప్తిపడుతుంది. అంతకంటే పెళ్ళికాని పిల్లలయితే నయం. వాళ్ళకి కొత్త అనుభవం ఎలా వుంటుందో చూడాలనిపిస్తుంది. ఈజీగా పడతారు'అని. శేషుగాడే తన బుర్ర పాడుచేసి వెర్రాణ్ని చేశాడు అని తేలగానే కోపం కొద్దీ, ఉక్రోషం కొద్దీ ఆ కాసెట్ తీసి విసిరి పారేశాడు. తర్వాత ఆంటీతో ‘టేప్ రికార్డులో చిక్కుకుని టేప్ తెగిపోయింది.’ అని చెప్పాడు. అప్పణ్నుంచి ఆవిడతో మామూలుగానే ఉన్నాడు. ఇది జరిగిన ఆర్నెల్లకు కాబోలు ఆవిడ గర్భవతి అని తెలిసింది. ఆ పైనెలే తండ్రికి బదిలీ కావడంతో ఆ ఊరు వదిలేసి వచ్చేశారు. తన కుర్రకారు రోజులకు తీపిగుర్తు, ఆంటీతో తన ఒన్‌సైడ్ ‘ప్రణయం’ అని నవ్వుకున్నాడు.

‘ఏమోయ్, నువ్వు చేసుకోబోయే అమ్మాయి నీ అంత బాగుంటుందా?’ అని రాజేశ్వరి అడగడంతో వాసు ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు. ‘అప్పటి మీలా ఉంటుందనుకోండి’ అన్నాడు. రాజేశ్వరి ఫక్కున నవ్వి ‘నీ కొంటెతనం అలాగే ఉంది సుమా’ అని మెచ్చుకుంది.

కాఫీ, ఫలహారాలయ్యాక మహాలక్ష్మిగారు బాత్‌రూమ్‌కి వెళ్లినపుడు వాసు గొంతు సవరించుకుని ‘ఆంటీ, ఒక విషయం చెప్పాలనే ప్రత్యేకంగా వచ్చాను. అప్పట్లో మీపట్ల నాకు క్రష్ ఉండేది. పిచ్చిపిచ్చి మాటలతో మీకు చికాకు తెప్పించి ఉంటాను కూడా. మీ గురించే ఆలోచిస్తూ ఉంటే చదువు మీద ధ్యాస నిలిచేది కాదు. కానీ ఓ రోజు అనుకోకుండా మీరిచ్చిన కాసెట్‌లో మాటలు వినబడ్డాయి. మీ భార్యాభర్తల మధ్య యింటిమసీ తెలిసింది. నా తప్పు తెలుసుకున్నాను. దారిలో పడ్డాను. చదువు మీదే శ్రద్ధ పెట్టి బాగా చదివాను. రెండు మూడేళ్లు గడిచేసరికి ఆనాటి నా ప్రవర్తనకు గిల్టీగా ఫీలవడం మొదలెట్టాను. ఇంకో ఏడాదికో, ఏమో ‘సమ్మర్ ఆఫ్ 42’ నవల చదివాను. ప్రతీ వ్యక్తికీ ఎడలెసెన్స్‌లో ఆ దశ వస్తుందని అర్థమైంది. సమాధానపడి ఊరుకున్నాను.  

ఏడాది క్రితమే ఓ ఊహ వచ్చింది, ఆ కాసెట్ మీరు కావాలనే నాకిచ్చేరేమో అని. ఎందుకంటే ప్రతీ కాసెట్టూ మీరు శ్రద్ధగా చూసుకునేవారు. దేనిలో ఏ పాట ఉందో యిండెక్స్ రాసి పెట్టుకునేవారు. మాటిమాటికీ వినేవారు. దీనిలో పాటలు ఎరేజ్ అయిపోయాయంటే గమనించే ఉంటారు. నన్ను దారిలో పెట్టడం కోసం మీరు కావాలనే అది యిచ్చారేమో అనిపించింది. ఏది ఏమైనా అది నా కళ్లు తెరిపించింది. నా జీవితాన్ని సరైన మార్గంలోకి తిప్పింది.’ అన్నాడు వాసు.

‘నీకు కాసెట్లిచ్చిన విషయాలేవీ గుర్తు లేదు కానీ, అప్పట్లో నువ్వు కాస్త క్రేజీగానే ఉండేవాడివి. ఏ వయసులోనైనా సరే ఆడవాళ్లకు యిలాటి కష్టాలు తప్పవు. పైకి చెప్పనూ లేదు, భరించనూ లేదు. మగవాళ్లకు యిలాటివి తోచవు. రేపు మీ ఆవిడ తన వెనక్కాల ఏ హైస్కూలు కుర్రాడో పడి సతాయిస్తున్నాడని చెపితే కాస్త చెవి ఒగ్గి విను, చాలు. నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావేమోనంటూ ఎగిరిపడకు.’ అని ఫక్కున నవ్వింది రాజేశ్వరి. మహాలక్ష్మి తిరిగి రావడంతో సంభాషణ యిక సాగలేదు.

వాళ్లు వెళ్లగానే రాజేశ్వరి నిట్టూర్చింది. ‘కాసెట్ విషయం గుర్తు లేకపోవడమేమిటి బాబూ! అది తయారుచేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. ఆయన సాధారణంగా మాట్లాడిన మాటలను రికార్డు చేసి పెట్టుకుని, నా సరస సంభాషణ స్క్రిప్టు రాసుకుని, రికార్డు చేసి, మధ్యలో సౌండు ఎఫెక్టులు జోడించి, రెండు టేప్ రికార్డులు పక్కపక్కన పెట్టుకుని ఒక కాసెట్‌లో వచ్చేట్టు చూసుకుని.. ఓ సంక్షిప్త శబ్దచిత్రం తీసినంత శ్రమ పడ్డాను. చివరకు ఫలితం దక్కింది. మర్యాదగా బయటపడ్డాను’ అనుకుంది. ఆ తర్వాత ‘సమ్మర్ ఆఫ్ 42 అన్నాడు. ఆ పుస్తకమేమిటో తెప్పించి చదవాలి’ అనుకుంది, పుస్తకపఠనాసక్తి యింకా పోని రాజేశ్వరి. (వ్యథావనితాయణం సీరీస్‌లో మరో కథ వచ్చే నెల) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)

mbsprasad@gmail.com

Show comments