అద్వితీయంగా 200 టీవీ ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న ఘంటసాలకు భారతరత్న కార్యక్రమం

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుంచి శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 200 టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచ రికార్డు ను నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇందులో భాగంగా అమెరికా గానకోకిల శ్రీమతి శారద ఆకునూరి వ్యాఖ్యాతగా 8 జనవరి 2023 నాడు జరిగిన అంతర్జాల (జూమ్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ శంకర్ నేత్రాలయ ద్వారా ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శత జయంతి "200 వ టీవీ ఎపిసోడ్" ఉత్సవాలకు రమ్మని ఆహ్వానం పలికారు. కానీ పని ఒత్తిడి కారణంగా నేను యు.యెస్.ఏ కి రాలేకపోతున్నాను, అయినప్పటికీ కూడా మన దేశ రాజధాని ఢిల్లీ నుండి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు కి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.

మన అందరికి తెలుసు స్వర్గీయ ఘంటసాల తనయొక్క గొంతుకతో కోట్లాది మంది ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తన గానంతో వేలాది పాటలు వారు మనకు అందించారు... తెలుగుతో పాటు అనేక భాషలలో వేలాది మధురమైన పాటలు వారు మన అందరికీ అందించారు. ఈరోజు ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే సుప్రభాతం కానీ, అనేక భక్తి గీతాలు కానీ, లేక భగవద్గీత గాని  వినిపించే గొంతు ఎవరిది అంటే అది స్వర్గీయ ఘంటసాల. వారు ఒక గాయకుడు, సంగీత దర్శకుడు  మాత్రమే కాకుండా అన్నిటికీ మించి  ఈ దేశ  స్వాత్రంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో పాల్గొన్న స్వతంత్ర పోరాట యోధుడు...  చిన్నప్పుడు గాంధీజీ సిద్ధాంతాలకు స్పందించి స్వాతంత్ర పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తియైన సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఆజాద్ కా అమ్రోతోత్సవ్ పేరుతో ప్రపంచం అంతా కూడా ఈ ఉత్సవాలు జరగాలని నిర్ణయించటం జరిగిందని తెలుపుతూ ఈ సందర్భంగా మన యొక్క ఘంటసాల శతజయంతి జన్మ ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో కూడా జరపాలని  నిర్ణయించడం జరిగిందని, 4 డిసెంబర్ లో చెన్నైలో భారత ప్రభుత్వం తరపున ప్రారంభించడం జరిగిందని..  రానున్న రోజుల్లో ఒక సంవత్సరం పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దేశ రాజధానిలో లాంటి అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తరపున శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

అనేక దేశాలలో కూడా మన ఘంటసాల అభిమానులు, కళాకారులు, అనేకమంది ప్రముఖులు వారి శతజయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా  నిర్వహిస్తున్నారు, మీ ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరం అని తెలియజేస్తూ మరొక్క సారి భారత ప్రభుత్వం మరియు సాంస్కృతిక శాఖ తరపున ఘనమైన నివాళులు అర్పించారు.

రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి, మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలియని తెలుగు వారు ఉండరు, ఉదయాన్నే లేవగానే వారి గాత్రాన్ని భక్తి గీతాల రూపంలో, భగవద్గీత రూపంలో, సినిమా పాటలు రూపంలో  వింటూ ఉంటాము. చిన్నతనంలో తండ్రి గారు మరణించిన చాలా కష్టాలు పడి విజయనగం వెళ్లి వారాలు ఉండి సంగీతం నేర్చుకొని, వారికి సంగీతం నేర్పించిన గురువు గారు అయినా సీతారామ శాస్త్రి గారిని జీవితాంతం స్మరించుకున్నారు...  10,000 పైగా పాటలు, 110 ఎక్కువ సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. పిన్న వయస్సులోనే దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు గా 18 నెలల జైలు శిక్షను అనుభవించారు, తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గాయకుడు అని కొనియాడారు...

ఇంకా ఈ కార్యక్రమంలో 10 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన బిలియనీర్ వ్యాపారవేత్త డాక్టర్ MS రెడ్డి (జున్ను రాజు), ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి, ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత ఎం. మురళీ మోహన్, ఘంటసాల కుటుంభం నుంచి కృష్ణకుమారి ఘంటసాల W/o రత్నకుమార్ ఘంటసాల, నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, TTA మాజీ అధ్యక్షుడు భరత్ మాదాడి, శంకర నేత్రాలయ ట్రస్టీ, SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు భాస్కర్ గంటి, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు, NRIVA ఛైర్మన్, డాక్టర్ జయసింహ సుంకు, శంకర నేత్రాలయ ట్రస్టీ, శ్యామ్ అప్పాలి తదితరులు పాల్గొని మాట్లాడుతూ, ఘంటసాల గారి పాటలతో వారికున్న అనుబంధాన్ని పంచుకొని ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఆ మహనీయుడికి భారతరత్న గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా  కోరుకున్నారు. ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ, ఘంటసాలకి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు, అందుకు 33 దేశాల్లో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలు కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.

33 దేశాలను చేరుకోవడానికి సహాయ సహకారాలు అందచేసిన ఆదిశేషు కోట, శ్రీలత మగతల, మరియు రత్నకుమార్ కవుటూరులకు ఈ కార్యక్రమ నిర్వాహకులు బాలా రెడ్డి ఇందూర్తి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే 200 TV కార్యక్రమాలకి సాంకేతిక సహాయాన్ని అందచేసిన శ్యాం అప్పాలి, ప్రమీల గోపు, హరీష్ కోలపల్లి గార్లకు తన ధన్యవాదాలు తెలియజేశారు.  అలాగే 200 TV కార్యక్రమాలకి వ్యాఖ్యాతలుగా నిర్వహించిన శారద ఆకునూరి,   రత్నకుమార్ కవుటూరు,  శ్యామ్ అప్పాలి, విజు చిలువేరు, నీలిమ గడ్డమనుగు, Dr. రెడ్డి  ఉరిమింది, జయ పీసపాటి, రాం దుర్వాసుల, ఫణి డొక్క, మరియు శ్రీలత మగతల కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, వివారాలు మీ అందరి కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru

ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు మరియు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ప్రతి కార్యక్రమానికి సహాయాన్ని అందిస్తున్న రత్న కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ఈ అడ్రస్ కి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు.

Show comments