2023.. తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు!

వ‌చ్చే ఏడాది లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీల‌కు కూడా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఆ సంగ‌త‌లా ఉంటే.. 2023లో ఏకంగా తొమ్మిది రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. వీటిల్లో బుల్లి రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు కూడా ఉన్నాయి. 

మేఘాల‌య‌, నాగాలాండ్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల‌కు ఈ ఏడాది డిసెంబ‌ర్ లోపు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ లు గ‌ట్టిగా త‌ల‌ప‌డే అవ‌కాశం ఉన్న క‌ర్ణాట‌క‌లో ఈ ఏడాది మే నెల‌లోపు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్తాన్, ఛ‌త్తీస్ గ‌డ్ ల‌లో కూడా ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. మ‌రోవైపు తెలంగాణ‌కు కూడా ఇది అసెంబ్లీ ఎన్నిక‌ల నామసంవ‌త్స‌రం. ఇలా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ ఏడాదిలో షెడ్యూల్ అయిన‌ట్టే.

ఇక వీటితో పాటు కేంద్రం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సై అంటే జ‌మ్మూ అండ్ క‌శ్మీర్ కూడా వ‌ర‌స‌లో ఉంది. ఇప్ప‌టికే జ‌మ్మూ క‌శ్మీర్ లో ఎప్పుడో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అయితే చేసింది కానీ బీజేపీ స‌ర్కారు జ‌మ్మూ క‌శ్మీర్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మాత్రం సిద్ధం కావ‌డం లేదు. ఒక‌వేళ కేంద్రం రెడీ అయితే అక్క‌డ కూడా ఈ ఏడాదే ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.

మ‌రో విశేషం ఏమిటంటే.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ప్ర‌ధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ పోరాటం ఉండ‌బోతోంది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ పోటీలో కీల‌కంగా ఉండ‌బోతోంది. జేడీఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుని బ‌రిలోకి దిగితే.. ఆ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్ల‌కూ పోటీ చేయ‌గ‌లిగేది కాంగ్రెస్ పార్టీనే. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటూ బీజేపీ అక్క‌డ ఏ మేర‌కు రాణిస్తుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఛ‌త్తీస్ గ‌డ్ ల‌లో కూడా కాంగ్రెస్ పార్టీ బ‌లంగానే ఉంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో గ‌త ప‌ర్యాయం కాంగ్రెస్ క‌నీస మెజారిటీని సాధించుకుంది. అయితే ఆ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టి బీజేపీ అధికారాన్ని చేప‌ట్టింది. ఇక రాజ‌స్తాన్ లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ పోటీనే ఉండ‌బోతోంది. అక్క‌డ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్ర‌తి ఐదేళ్ల‌కూ ప్ర‌భుత్వాన్ని మార్చేసే రాజ‌స్తానీలు ఈ సారి ఏం చేస్తార‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. మొత్తానికి లోక్ స‌భ ఎన్నిక‌లు వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అసెంబ్లీ ఎన్నిక‌లు రాజ‌కీయంగా అమితాస‌క్తిని రేప‌నున్నాయి.

Show comments