రామ్ చరణ్-సమంత... ఓ టాప్ సీక్రెట్?

దర్శకుడు సుకుమార్ కమర్షియల్ సినిమా చేస్తున్నాడా లేక ప్రయోగాత్మక చిత్రం తీస్తున్నాడా..? ఇవేవీ కాకుండా అవార్డు కోసం ఆర్ట్ ఫిలిం తీస్తున్నాడా అనే డౌట్ వస్తోంది. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకు సంబంధించినవే ఈ అనుమానాలన్నీ. అవును.. ఈ సినిమాలో చెర్రీ చెవిటివాడిగా నటిస్తున్నాడనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. పూర్తిగా చెవుడు కాకుండా, వినిపించీ వినబడని రేంజ్ లో చెవుడు ఉండే పాత్ర చేస్తున్నాడనే ప్రచారం చాలా రోజులుగా ఉంది. 

ఇదే పెద్ద ప్రయోగం అనుకుంటే ఇప్పుడు సమంతకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్. రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె మూగదాని పాత్ర చేస్తోందట. వినడానికి షాకింగ్ గా ఉన్నప్పప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం ఇదే. 80ల నాటి పల్లెటూరి ప్రేమకథ, హీరోకు చెవుడు, హీరోయిన్ మూగ. ఇలాంటి క్వాలిటీస్ ఆర్ట్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. 

ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా రామ్ చరణ్-సమంత మధ్య వచ్చే ఓ పాటతో షూటింగ్ స్టార్ట్ చేశారు. తాజాగా వీళ్లిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఆ సీన్లు పిక్చరైజ్ చేసిన తర్వాతే సమంత మూగ పాత్ర పోషిస్తోందనే రూమర్ బయటకు వచ్చింది. 

సమంత ఈమధ్య చేసిన ఓ ప్రకటన దీనికి మరింత బలం చేకూరుస్తోంది. కాస్త వెయిట్ ఉండే పాత్రలు మాత్రమే పోషిస్తానని చెప్పిన సమంత, చెర్రీ సినిమాతో కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నట్టు వెల్లడించింది. సరే, ఈ క్యారెక్టర్ల సంగతి కాసేపు పక్కనపెడితే సెట్స్ నుంచి లీకైన చరణ్ ఫొటో మాత్రం అదిరిపోయింది. గుబురు గడ్డంతో పూల చొక్కా వేసుకొని, లుంగీ కట్టుకొని కుర్చీలో కూర్చున్న చెర్రీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Show comments