ఇక నంది అవార్డులను మరిచిపోవడమే

రాష్ట్రం సమైక్యంగా వున్నపుడే నంది అవార్డుల ఫంక్షన్ లు ప్రభుత్వ చిత్తానికి అనుగుణంగా జరిగేవి. అలాంటిది విభజన జరిగిపోయాయక ఇవి ఎవరికీ పట్టనివి అయిపోయాయి. సినిమా రంగం అంతా తెలంగాణలోనే వుంది కాబట్టి కచ్చితంగా అక్కడి ప్రభుత్వం ఈ అవార్డులను కంటిన్యూ చేయాల్సి వుంది. కానీ ఆ విధంగా ముందుకు వెళ్లే సూచనలు అయితే కనిపించడం లేదు. పేరు మార్చి బతుకమ్మ అవార్డులు అనో, మరో అవార్డులు అనో స్టార్ట్ చేసే అయిడియా కూడా వున్నట్లు లేదు.

ఇక మహానంది పేరిట వెలిసాయి నంది అవార్డులు అనుకున్నా, ఆంధ్ర ప్రభుత్వం వీటిని కొనసాగించాల్సి వుంది. ఆ దాఖలాలు కూడా కనిపించడంలేదు. అస్సలు ఆ ఆలోచనే చంద్రబాబు మదిలో వున్నట్లు లేదు. పైగా పరిశ్రమ అన్నది ఆంధ్రకు తరలివచ్చే సూచనలు కూడా లేవు. పరిశ్రమ వల్ల ఆంధ్రకు ఒరిగేది లేదు. అందువల్ల పెద్దగా ఆసక్తి వున్నట్లు లేదు.

ఇదిలా వుంటే, అసలు ఈ అవార్డుల వైనాన్ని కదిపేవారే కరువు అయ్యారు. టాలీవుడ్ లేదా మా ప్రతినిధులు ఇరు రాష్ట్రాలకు ఓ విన్నపం చేసి వుంటే, కేసిఆర్ కో, బాబుకో గుర్తుకు వచ్చేదేమో ఈ వైనం. కానీ వారు గుర్తు చేయడం లేదు. ఎందుకంటే వారికి ఈ అవార్డుల వల్ల ఒరిగేది ఏమీ లేదు. అదే ప్రయివేటు అవార్డులు అయితే హ్యాపీ. ఆ వంకన విదేశాలకు అవార్డుల కమిటీ ఖర్చుతో వెళ్లి రావచ్చు. రెండు మూడు రోజులు ఎంజాయ్ మెంటే ఎంజాయ్ మెంట్. 

పైగా ప్రయివేటు అవార్డులు అంటే అదో భారీ వ్యాపారం కూడా. దీనికి తోడు సందట్లో సడేమియా అని కొంతమంది తమ పనులో, వ్యాపారాలో చక్క బెట్టేసుకోవచ్చు. మరి ఇలా పబ్బం గడిచిపోతుంటే, నంది అవార్డులు ఎవరికి పడతాయి? పైగా ఏ ప్రభుత్వం అధికారంలో వుంటే, ఆ ప్రభుత్వంతో సంబంధాలున్నవారికి అవార్డులు కట్టబెట్టే వ్యవహారానికి తెరతీసి, వాటి విలువ ఏనాడో తగ్గించేసారు.అందువల్ల మరింక నంది అవార్డులను మరిచిపోవచ్చేమో?

Show comments