మింగడానికి మెతుకుల్లేవుగానీ, మీసాలకు శంపంగె నూనె కావాలన్నాడట వెనకటికి ఒకడు. తమ ఖాతాల్లో డబ్బులున్నా, అవి తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి దేశ ప్రజానీకాన్ని నెట్టేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తాను చేసిన ఘోర తప్పిదానికి మసిపూసి మారేడుకాయని చేసి, 'పెద్ద పాత నోట్ల రద్దుతో అవినీతి అంతం' అనే ప్రచారం షురూ చేసిన విషయం విదితమే.
ఘోర తప్పిదం జరిగిపోయాక, దాన్నుంచి బయటపడ్డానికి తప్పు మీద తప్పు.. ఒకదాని తర్వాత మరో తప్పు చేస్తూనే వున్నారు. ఆయనదేంపోయింది, ఎంచక్కా ఖరీదైన సూట్లు వేసుకుని తిరుగుతారు.. ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడతారు.. మన్ కీ బాత్ అంటారో, ఇంకోటేదో చెప్తారు.. కానీ, ఆయన తీసుకున్న నిర్ణయం జనం చావుకొచ్చింది.
ఇక, అసలు విషయానికొస్తే, దేశంలో నగదు రహిత లావాదేవీలు చాలా చాలా తక్కువ. దాన్ని వున్నపళంగా పెంచేయాలంటే ఏం చేయాలి.? అని ఆలోచించీ చించీ, 'లాటరీ' పద్ధతి ప్రవేశపెట్టారు. ఎవరైతే నగదు రహిత లావాదేవీలు చేస్తారో (కార్డులను ఉపయోగించి..) వారికి, నెలకోసారి బహుమతులు ఇవ్వబోతున్నారు. నేటినుంచే ఈ 'లాటరీ బహుమతుల కార్యక్రమం' ప్రారంభమవుతోంది. ఇకనేం, అవసరం వున్నా లేకున్నా కార్డులు పట్టుకుని వెళ్ళి, గీకెయ్యాల్సిందే.
కొన్ని కాంటెస్ట్‌లు వుంటాయి.. చచ్చు ప్రశ్నలు వేస్తుంటారు.. ఆ ప్రశ్నకు సమాధానం చెబితే ఖరీదైన బహుమతులంటారు. కాస్త ఆశపడి, సమాధానం చెప్పడానికి ఎస్‌ఎంఎస్‌లను ఆశ్రయిస్తే అంతే సంగతులు.. పోన్లలోని బ్యాలెన్స్ ఔట్ అయిపోతుంటుంది. నరేంద్రమోడీ సర్కార్ తెరపైకి తెచ్చిన లాటరీ బహుమతుల పథకం కూడా అలాంటిదే. కార్డు గీకగానే సరిపోదు, దానికి తగ్గ 'భద్రత' దేశంలో వుండాలి కదా.! కార్డు పోయిందంటే, వెంటనే బ్లాక్ చేయడం అంత తేలికైన వ్యవహారం కాదు. దానికి సవాలక్ష ఆంక్షలు. కార్డుల్లోని డాటా తస్కరణకు గురైతే, ఆ పాట్లు నరకాన్ని తలపిస్తాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల క్లోనింగ్, స్కిమ్మింగ్ వంటివి దేశంలో అతి తీవ్రమైన నేరాలుగా మారిపోయాయి. అతి సర్వసాధారణంగా కూడా మారి, వినియోగదారుల్ని వేధిస్తున్నాయి.
అయినాసరే, కార్డులు వాడాల్సిందే.. తప్పదు, ఎందుకంటే అక్కడ కరెన్సీ అంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు క్యాష్‌లెస్ అంటున్నారు సరే, కానీ అందుకు తగ్గ యంత్రాంగం మన దగ్గర వుందా.? లేదు, అందుకే ప్రస్తుతానికి మేకిన్ ఇండియా నినాదాన్ని పాతాళంలోకి తొక్కేసి, 'జై చైనా' అంటోంది మోడీ సర్కార్. పీఓఎస్ మెషీన్లను అక్కడినుంచే తెచ్చుకోవాలి.. ఇది మన ఖర్మ కాక మరేమిటి.?
అంతా బాగానే వుందిగానీ, పెట్రోల్ బంకుల్లో మొబైల్ ఫోన్ల వినియోగం నిషేధం. మరి అక్కడ, ఎలా మొబైల్ ఫోన్లతో లావాదేవీలు నిర్ణయించాలట. అతి ప్రమాదకరమైన ఈ పద్ధతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆల్రెడీ పీఓఎస్ మెషీన్లు వినియోగంలో వున్నా, అవి ప్రమాదాలకు కారణమవుతాయంటూ నిపుణులు బాంబు పేల్చారు.
ఎవరెలా పోతేనేం, మా పాపాలు బయటపడకూడదు. ఇదీ మోడీ సర్కార్ తీరు. అందుకే, తప్పు మీద తప్పు చేస్తూనే పోతోంది.