'దేశంలో అవినీతిని పారద్రోలేస్తాం.. దానికోసమే పెద్ద పాత నోట్ల రద్దు. డిసెంబర్ 31 తర్వాత దేశంలో అవినీతి అన్న మాటే విన్పించదు..'
- ఇదీ పెద్ద పాత నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యల సారాంశం.
అయితే, గతంలో దేశంలో అవినీతి ఎలాగైతే వుందో.. ఇప్పుడూ అలాగే వుంది. అప్పటికీ ఇప్పటికీ తేడాలేం రావు. మార్పు రాత్రికి రాత్రి వచ్చేయదుగానీ.. ఎంతో కొంత మార్పు 50 రోజుల తర్వాత కాకపోయినా, 60 రోజుల తర్వాత అయినా కన్పించాలి కదా.! కానీ, కన్పించదు. ఎందుకంటే, అవినీతి సర్వాంతర్యామి.
ఇక, రాజకీయ అవినీతి గురించి మాట్లాడకుండా సామాన్యుడ్ని పెద్ద పాత నోట్ల రద్దుతో రోడ్డున పడేసిన నరేంద్రమోడీ, వ్యవస్థలో మార్పుల వచ్చేస్తుందంటూ ఇంకా పాత కథే చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకేముంది, అక్కడికి నోట్ల కట్టలు పరుగులు పెడ్తున్నాయి. తనిఖీల్లో పెద్దమొత్తంలో కొత్త పెద్ద నోట్లు బయటపడ్తున్నాయి. ఇప్పటికీ బ్యాంకుల్లో నగదు ఉపసంహరణ పరిమితిలో పెద్దగా మార్పులేమీ రాలేదు. కానీ, కోట్ల రూపాయలు మాత్రం ఎంచక్కా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. అదెలా సాధ్యం.?
ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో కరెన్సీ ప్రవాహమే కన్పిస్తోందట. పెద్ద నోట్లతో ఇప్పుడు ఓట్లను కొనేయడం మరింత తేలికైపోయిందన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ. ఇలా ఓట్లను కొనేయడంలో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడాల్లేవు.. అన్ని పార్టీలదీ అదే బాట. ఇందులో బీజేపీ ఏమీ మడికట్టుక్కూర్చుంటుందని ఎలా అనుకోగలం.? పైగా, ఆ పార్టీదే ఈ విషయంలో పెద్ద చేయి.. అన్న ఆరోపణలున్నాయి.
ఏదిఏమైనా, పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత ఎన్నికల ప్రక్రియలో చాలా మార్పులు వస్తాయని ఆశించినవారికి భంగపాటే ఎదురవుతోంది.