చూస్తూనే వుండండి.. అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా నిర్మిస్తాం..
- పాడిందే పాటరా పాచిపళ్ళ డాష్ డాష్.. అన్నట్లు తయాయరయ్యింది వ్యవహారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెబుతున్నారు. అసలు అమరావతి అనేదొకటి వుందా.? అన్న అనుమానం కలుగుతోంది ఇప్పుడు అందరికీ. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అమరావతి కనిపించలేదు. అమరావతిలో ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తోన్న విషయం విదితమే.
నువ్వెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు.. అన్నాడు వెనకటికి ఓ మహానుభావుడు. రైలు సంగతేమోగానీ, అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం అనేది అలాగే ఓ ప్రసహనమైపోయింది. జూన్ 27 డెడ్‌లైన్ అన్నారు. జూన్ పాయె, జులై పాయె, ఆగస్ట్ కూడా పాయె. అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తప్ప, ఎలాంటి అధికారిక కార్యకలాపాలూ నడవని పరిస్థితి. స్వాతంత్య్ర దినోత్సవం నాడు అమరావతిలో కనీసం జాతీయ జెండా ఎగరవేసే దిక్కు కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి.?
అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అనంతపురంలో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని అధికారికంగా రాష్ట్రప్రభుత్వం నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ నానా హడావిడీ చేశారు. మరి అమరావతిలో ఉప ముఖ్యమంత్రితోనో, జిల్లాకు చెందిన ఎంపీతోనో, జిల్లాకి చెందిన మంత్రితోనో, కలెక్టర్ లేదా ఇతర అధికారులతోనో అయినా జాతీయ జెండాని ఎగురవేయించేందుకు ప్రభుత్వం చొరవ చూపలేకపోవడం అత్యంత దారుణం, అత్యంత హేయం.
గోదావరి పుష్కరాల కోసం వెయ్యి కోట్లకు పైనే ఖర్చు చేసేశారు. కృష్ణా పుష్కరాల కోసం కూడా అంతకు మించి ఖర్చు చేస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు ఎంత ఖర్చయ్యిందో చూశాం. అయినా, అమరావతి నిర్మాణానికి మాత్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేయలేకపోతున్నారు. మేం 2050 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతుంది. కాదు కాదు, అందులో వెయ్యి కోట్లు విజయవాడ, గుంటూరు నగరాలకే పోతుందనీ, మిగిలిన వెయ్యికోట్లు మాత్రమే అమరావతికి ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఏది నిజం.?
ఒక్కటి మాత్రం నిజం. అమరావతి పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేస్తున్నారు. అంతర్జాతీయ రాజధాని పేరుతో జనాన్ని మభ్యపెడుతున్నారు. అమరావతి - ఆత్మగౌరవం అంటూ సెంటిమెంట్ రాజేసి, పొలిటికల్ మైలేజీ పొందుతున్నారు. అంతకు మించి, అమరావతిని ఆత్మగౌరవంగా చంద్రబాబే భావించడంలేదు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ, అమరావతిని నిర్లక్ష్యం చేయడమే ఇందుకు నిదర్శనం. ఎనీ డౌట్స్.!