పాక్‌ ప్రజలు శాంతినే కోరుకుంటున్నారా?

సినిమాలో హీరోను అంతం చేయాలని విలన్‌ ఎత్తులు వేస్తుంటాడు. హీరో అతని పన్నాగాల నుంచి తప్పించుకొని దెబ్బ తీస్తుంటాడు. వీరిద్దరి ఎత్తులు పైఎత్తులతో సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. చూస్తున్న ప్రేక్షకులు  హీరో చేతిలో విలన్‌ చనిపోవాలని, అతన్ని చిత్తుగా ఓడించి దారుణంగా అంతం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇండియా-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి భారత్‌ బలగాలు ప్రవేశించి, మెరుపుదాడులు చేసి ఉగ్ర తండాలను ధ్వంసం చేయడం...ఈ ఘటనల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన సంగతి తెలిసిందే. 

ఉరీ దారుణం తరువాత భారత్‌ సైన్యం పాక్‌ పై యుద్ధం చేసి దాని పీచమణచాలని ప్రజలు కోరుకున్నారు. పాక్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని సామాజిక మీడియాలో హోరెత్తించారు. ఉరీ ఘటన తరువాత తామనుకున్న యుద్ధం జరగకపోవడంతో కొందరు ప్రధాని మోదీని పిరికివాడిగా అభవర్ణించారు కూడా. కొందరు నాయకులు సైతం పాక్‌పైకి వెంటనే పైన్యాన్ని పంపి దాన్ని తునాతునకలు చేయాలని కోరారు. ఇదే సమయంలో పాక్‌ కూడా భారత్‌ను రెచ్చగొట్టే ప్రకటనలు చేసింది. యుద్ధం వస్తే భారత్‌ను మటాష్‌ చేస్తామని అక్కడి సైనికాధికారులు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. 

ఆ దేశంలోని కొందరు ప్రజలు కూడా ఆవేశపడిపోయుండొచ్చు. రెండు దేశాల మధ్య జరిగిన ఘటనలు అటువంటివి మరి. కాని ఒక్కసారి యుద్ధమంటూ ప్రారంభిస్తే జయాపజయాల సంగతి తరువాత, ప్రాణనష్టం జరగకుండా చూడటం సాధ్యం కాదు. యుద్ధంతో రెండు దేశాలకు జరిగే ఆర్థిక నష్టం అంతాఇంతా కాదు. ఆ కారణంగా ప్రజల బతుకులు గందరగోళమైపోతాయి. ఇరు దేశాల్లోనూ వ్యక్తిగతంగా వేలాది సైనికుల జీవితాల్లో తీరని విషాదం అలుముకుంటుంది. యుద్ధం వల్ల జరిగే అనర్థాలు ఒకటీ రెండు కావు. కాబట్టి సాధ్యమైనంతవరకు యుద్ధం జరగకూడదని రెండు దేశాల్లోనూ కోరుకోవాలి. 

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ ఆ దేశం నుంచి వైద్యం కోసం, ఆపరేషన్ల కోసం ప్రతి రోజు ఎంతోమంది భారత్‌కు వస్తూనే ఉన్నారు. పాకిస్తాన్‌,  బంగ్లాదేశ్‌, నేపాల్‌ మొదలైన ఇరుగుపొరుగు దేశాల నుంచి వైద్యం కోసం ఇండియాకు రావడం సాధారణమే. ఎందుకంటే ఆయా దేశాల్లో అత్యున్నత వైద్య సౌకర్యం లేదు. ముఖ్యంగా గుండె జబ్బులున్న పిల్లలను తీసుకొని పాక్‌ నుంచి అనేకమంది ఇండియాకు వస్తున్నారు. మన డాక్టర్లు వారిని ఆదరించి  చికిత్స చేస్తున్నారు. ఉచితంగా ఓపెన్‌హార్ట్‌ సర్జరీలు చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితి మధ్యనే పాక్‌ నుంచి ఢిల్లీకి వైద్యం కోసం వస్తున్నవారిని పలకరిస్తే రెండు దేశాల మధ్య యుద్ధం జరగకూడదని మెజారిటీ పాక్‌ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. 

కొద్దిమందిలో ఆవేశం ఉంటే ఉండొచ్చునేమోగాని ఎక్కువమంది శాంతిని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. రెండు దేశాల మధ్య రైలు, బస్సు సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. ఓ మహిళ తన ఐదేళ్ల పిల్లవాడికి ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయించేందుకు బస్సులో ఢిల్లీ వచ్చింది. మీడియా ఆమెను పలకరించినప్పుడు రెండు దేశాల మధ్య శాంతి వెల్లవిరియాలనే పాక్‌ సామాన్య ప్రజల అభిప్రాయంలో మార్పు లేదని చెప్పింది. కాకపోతే ఒక తేడా ఏమిటంటే నాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు ఇండియాకు వీసా దొరకడం కష్టంగా ఉందని చెప్పింది. 

బంధువుల ఇంట్లో పెళ్లి కోసం వచ్చిన ఒకాయన మాట్లాడుతూ తన బంధువర్గంలో సగంమంది ఇండియాలోనే ఉన్నారని, అలాంటప్పుడు యుద్ధం జరగాలని తామెందుకు కోరుకుంటామని ప్రశ్నించాడు. ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలోనే కాకుండా గతంలోనూ తాను ఇండియాకు వచ్చానని, తనకేమీ తేడా కనబడలేదని చెప్పాడు. పాక్‌లోని సామాన్య ప్రజలెవరికీ ఇండియా మీద కోపం లేదన్నాడు.  పాక్‌లో ఉన్న సోదరిని చూడటానికి లక్నో నుంచి అక్కడికి వెళ్లిన ఓ మహిళ మాట్లాడుతూ ఆ దేశంలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పింది. ప్రజలు శాంతియుతంగా ఉన్నారని,  ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పింది.

భారత్‌ నుంచి (ఢిల్లీ నుంచి) పాక్‌కు వెళుతున్న ప్రభుత్వ బస్సు డ్రైవర్లు మాట్లాడుతూ లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ (సరిహద్దు నియంత్రణ రేఖ) వద్ద తమకు ఇబ్బందులు కలగలేదని చెప్పారు. ఉరీ ఘటన తరువాత కూడా పాక్‌కు వెళ్లే బస్సులకు బుకింగ్స్‌ తగ్గలేదని అధికారులు చెప్పారు. దీన్నిబట్టి అర్థయ్యేది ఒక్కటే. ఏ దేశంలోని వారైనా సామాన్య ప్రజలెప్పుడూ శాంతినే కోరుకుంటారు. పాక్‌ కూడా తీవ్రవాద బాధిత దేశమే. ఈ విషయం నవాజ్‌ షరీఫ్‌ గతంలో చెప్పారు. అలాంటప్పుడు భారత్‌ సైన్యం దాడులు చేసింది ఉగ్రవాదుల మీదనేగాని పాక్‌ మీద కాదు కదా. ఉగ్రవాదులు హతులైతే సంతోషించాల్సిదిపోయి కయ్యానికి కాలు దువ్వడమేంటి?

Show comments