వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వైపుకు ఫిరాయించిన ఎమ్మెల్యే సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ఫిరాయింపు దారులు తాము తిరిగి వస్తామన్న సంకేతాలు ఇవ్వడం నిజం.. వీరిని మళ్లీ నమ్మడం విషయంలో జగన్ పునరాలోచనలో ఉన్నాడన్నదీ వాస్తవం. పార్టీ వీడటానికి ముందు పలు విధాలుగా వీరిని ఆపడానికి ప్రయత్నించాడు జగన్ మోహన్ రెడ్డి. అయితే వారు అప్పట్లో తాము చాలా దరిద్రంలో ఉన్నామని.. అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నామని అంటూ జగన్ పంపిన ప్రతినిధుల వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో వైకాపా అధినేత చేయగలిగింది ఏమీ లేకపోయింది.
జగన్ దగ్గర ఒకరమైన సింపతీని సంపాదించుకుని..వీళ్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తీరా అక్కడకు వెళ్లాకా అసలు పరిస్థితి అర్థం అయ్యింది. ఈ నేపథ్యంలో ఫిరాయించిన అరడజను మందిలో సగం మంది తిరిగి జగన్ తో టచ్ లోకి వచ్చేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు.
వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వీళ్లు కాకుండా వేరే నేతలను తయారు చేసుకోవడం ఏ మాత్రమూ సమస్య కాదు. గత ఎన్నికల్లో కూడా ఈ ఫిరాయింపుదారులు గెలిచింది పార్టీ బలంతో తప్ప వ్యక్తిగత ఛరిష్మాతో కాదు. అలాంటప్పుడు ఒకసారి ద్రోహానికి ఒడిగట్టిన వారిని ఎందుకు క్షమించాలి అనేది జగన్ ఆలోచన అని వైకాపా వర్గాలు చెబుతున్నాయి.
లోలోపల ఇలాంటి పరిస్థితి ఉండగా.. ఈ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. తాజాగా ఆ పార్టీ తరపున ఒక ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. దాని సారాంశం ఏమనగా.. జగన్ పై ధ్వజమెత్తడమే! కాపుల రిజర్వేషన్ల ఉద్యమం నేపథ్యంలో జగన్ దీన్ని సృష్టించాడని.. అంటూ ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ తదితర ఎమ్మెల్యేల పేరుతో ఆ నోట్ విడుదల అయ్యింది!
ఇక్కడ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. ఈ ఫిరాయింపుదారులు జగన్ పై ధ్వజమెత్తడానికి మీడియా ముందుకు దూకుడుగా రావాలి కానీ.. ఇలా ప్రెస్ నోట్ లు విడుదల చేయడం ఎందుకు? అనేది ధర్మ సందేహం. ప్రెస్ నోట్ విడుదలలో పార్టీలకు ఒక సౌలభ్యం ఉంది. సదరు నేతల అవసరమే లేకుండా.. పార్టీ కార్యాలయం నుంచి నోట్ విడుదల చేసేయవచ్చు! తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ సౌలభ్యాన్నే ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తోంది.
వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడల్లా జగన్ పై ధ్వజమెత్తడానికి ధాటిగా ముందుకు రావడం లేదు. తిరిగి వెనక్కు వెళ్లాల్సి వస్తుందన్న భావనతో వీరు ఆచితూచి స్పందిస్తున్నారు! అందుకే తెలుగుదేశం పార్టీ వారి పేర్లతో ప్రెస్ నోట్లు విడుదల చేస్తోందని సమాచారం. ఈ పత్రికా ప్రకటనల ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకే విధేయులుగా ఉన్నారు చూడండని చెప్పుకోవడం తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నం. తెలుగుదేశం పార్టీ ఇలాంటి రాజకీయాలు హ్యాపీగానే చేస్తోంది కానీ.. ఈ తతంగంలో ఫిరాయింపుదారుల పరిస్థితే కుడితో పడ్డ ఎలుకల చందాన తయారైంది.