గౌతమ్ ని బతిమాలుకున్న నాగ్

గౌతమ్‌ మీనన్‌తో పనిచేయాలన్నది నాగార్జున కోరిక అట. కానీ, ఆ కోరికను దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ మన్నించడంలేదు. అయితే, గౌతమ్‌ మీనన్‌ ఇప్పటికే నాగార్జున తనయుడు నాగచైతన్యతో ఓ చిత్రం చేసేశాడు. ఇంకో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అదే 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక తాజాగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

వేదిక మీదనుంచే నాగార్జున, గౌతమ్‌ మీనన్‌కి మరోమారు రిక్వెస్ట్‌ చేశారు. 'గతంలో అడిగాను.. మీరు సరేనన్నారు.. మళ్ళీ మాట్లాడలేదు..' అంటూ నాగార్జున బుంగమూతి పెట్టినంత పన్జేశారు. అంతేనా, నెగెటివ్‌ రోల్‌లో చేస్తారా? అని గౌతమ్‌ మీనన్‌ తనను అడిగారనీ, దానికి ఓకే చెప్పినా గౌతమ్‌ మీనన్‌ తనతో సినిమా చేయడానికి ముందుకు రాలేదని వాపోయారు. సరదా సరదాగా సాగింది నాగార్జున ప్రసంగం ఆద్యంతం. 

అందరికీ తెల్సిన విషయమే గౌతమ్‌ మీనన్‌ వెరీ వెరీ స్పెషల్‌ డైరెక్టర్‌. ఆయన సినిమాల్లో కథకి వుండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. రొటీన్‌కి భిన్నంగా వుంటాయి ఆయన సినిమాలు. ఆ వెరైటీనే నాగార్జున కోరుకుంటారు. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో నాగార్జునకు సాటి వచ్చేదెవరు.? మరి, నాగార్జున కోరికని ఈ విలక్షణ దర్శకుడు ఇప్పటికైనా మన్నిస్తాడా.? వేచి చూడాల్సిందే.

Show comments