దవాఖాన కెళ్లొద్దురా డింగరీ..!

నమస్తే దవాఖానా ఇన్‌చార్జ్‌ సార్‌..!

నమస్తే.. ఇంటర్వ్యూ జల్దీ ఖతం జేయండి.. బిజీగున్నా.. 


ఓకేసార్‌.. మీ హాస్పిటల్లో నడవలేని పేషెంట్స్‌ కోసం వీల్‌చైర్స్‌ లేవని పాపం పేషెంట్సే మూడు చక్రాల సైకిల్స్‌ తెచ్చుకుంటున్నారని వార్తలు వస్తున్నయ్‌..

అది తప్పుడు వార్త.. వీల్‌చైర్స్‌ లేవని కాదు.. మస్తుగా వున్నై.. కానీ వాటికోసం మనీ డిమాండ్‌ చేసారు మావాళ్లు..  Readmore!


మరి వాళ్లమీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

ఎలా తీసుకుంటామండీ? వాళ్లు కంట్రాక్టర్‌ సిబ్బంది.. మేము వాళ్లను ఏమీ చేయలేము.. 


అంటే ఈ ప్రాబ్లెం ఇలాగే కంటిన్యూ అవుతుందా?

అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.. 


ఏంటవి?

దవాఖానా గేటు దగ్గర్నుంచి లోపల అవుట్‌ పేషెంట్‌ విభాగం వరకూ రోప్‌ వే ప్రపోజ్‌ చేస్తున్నాం.. వీల్‌ చైర్‌కి ఎవరైనా పైసలు అడిగారనుకోండి.. వెంటనే వాళ్లు రోప్‌ వేలో వున్న ట్రాలీ ఎక్కి లోపలికొచ్చేయవచ్చు.. 


ఒకవేళ రోప్‌ వే ఆపరేటర్‌ పైసలడిగితే? వాళ్లూ కంట్రాక్టర్‌ సిబ్బందే ఉంటారుగా?

అందుకే అసలు సిబ్బందితో పని లేకుండా ఆపరేటర్‌గా ఒక రోబోట్‌ని ఏర్పాటు చేస్తున్నాం.. 


వాట్‌? రోబోటా?

అవును.. అవినీతిని అడ్డుకోడానికి టెక్నాలజీని వాడుకుంటామండీ.. 


కాని అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా?

డెమోక్రసీ అన్నాక అవినీతిని అడ్డుకోడానికి ఖర్చు చేయాల్సిందే మరి.. 


ఒకవేళ ఆ రోప్‌ వే ఫెయిల్‌ అయితే?

అందుకే ఆల్టర్‌ నేటివ్‌గా మానస సరోవర్‌ ప్రాంతంలో వుపయోగించే డోలీ సిస్టం కూడా ఏర్పాటు చేస్తున్నాం.. నడవలేని పేషెంట్స్‌ని వాళ్లే మోసుకెళ్తారు.. 


చాలా మంచి ఏర్పాటు సార్‌.. చాలా ఇన్నోవేటివ్‌ అయిడియాలు.. కానీ ఒకవేళ ఆ డోలీ వాళ్లు కూడా పేషెంట్స్‌ని పైసలడిగితే?

అలా జరగవచ్చని మేమూ ఊహించాము.. అందుకే ఆల్టర్‌ నేటివ్‌గా ఎస్కలేటర్స్‌ ఏర్పాటు చేస్తున్నాం.. పేషెంట్స్‌ అందరూ నడవకుండా అదెక్కి లోపలకి వచ్చేయవచ్చు.. 


వొండర్‌ఫుల్‌ సార్‌..! చాలా అద్భుతంగా ప్లాన్‌ చేసారు.. కానీ ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయ్‌?

పదేళ్లల్లో రడీ.. 


మరి అప్పటివరకూ?

వీల్‌ చైర్‌ సిస్టం.. 


సూపర్‌ సార్‌.. మరి ఎక్స్పైరీ అయిపోయిన మందుల సంగతేంటి? సర్కార్‌ దవాఖానాల్లో అవే ఎక్కువ వాడుతున్నారని అందరూ కంప్లైన్‌ చేస్తున్నారు కదా?

అదికూడా అవినీతికి సంబంధించిన విషయమే.. అందుకే ఆ సమస్య సాల్వ్‌ చేయడానికి మొన్నే ఆ మందులు సప్లై చేసే ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపాం.. అందరం కలసి ఒక అండర్‌ స్టాండింగ్‌కి వచ్చాం.. దానివల్ల ఇకముందు అలాంటి ప్రాబ్లెం రాకుండా చేస్తాం.. 


అంటే ఏంచేస్తారు?

వాళ్లు సప్లైచేసే మందుల మీద ఎక్స్పైరీ డేట్‌ అనేది లేకుండా చేస్తాం.. 


సూపర్‌ సార్‌.. అద్భుతమైన సొల్యూషన్‌.. ఇకపోతే పసి పిల్లల్ని కుక్కలు ఎత్తుకు పోతున్నాయ్‌ అని కొన్ని సర్కార్‌ దవాఖానాల్లో తల్లులు ఆరోపిస్తూన్నారు కదా.. ఆ విషయంలో కుక్కల్ని హాస్పిటల్‌లోకి రాకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?

అదెలా కుదురుతుందండీ? మన దేశంలో కుక్కలు రాని ప్రదేశం అంటూ ఎక్కడైనా ఉంటుందా? అదీగాక వాటి మీద ఏమి చర్యలు తీసుకున్నా జంతు సంరక్షణ సమితి వాళ్లూ, ఇతర కుక్కల ఎన్జీవోల వాళ్లూ విదేశాలకు కంప్లైన్‌ చేస్తారు.. దాంతో మనదేశం పరువు పోతుంది.. 


అంటే మరి మీరు చూస్తూ ఊరుకుంటారా?

ఎలా వూరుకుంటామండీ? యాక్షన్‌ తీసుకుంటాం.. 


ఏమిటా యాక్షన్‌?

పాపాయిలను కనే తల్లులందరికీ ఉయ్యాల తొట్లు సప్లై చేస్తున్నాం.. ఆ తొట్లు మంచానికి నాలుగడుగుల ఎత్తున సీలింగ్‌కి కట్టేస్తాం.. కనుకు కుక్కలు ఎంత ట్రై చేసినా ఎగిరి పట్టుకోలేవు.. 


సూపర్‌ ఐడియా సార్‌.. మరి ఈ మధ్య పిల్లల్ని హాస్పిటల్‌ నుంచి కొంతమంది అపహరిస్తున్నారు కదా.. ఆ ప్రాబ్లెం ఎలా సాల్వ్‌ చేస్తున్నారు?

ఈజీ.. పాపాయి పుట్టగానేతల్లికీ పిల్లకూ ఆధార్‌ కార్డ్‌ లింక్‌ చేసేస్తున్నాం.. కనుక దొంగల్ని ఇట్టె పట్టేసుకోవచ్చు.. 


అద్భుతం సార్‌..! మీలాంటి డైనమిక్‌ బాస్‌లు ఉండబట్టే దేశం ఇంత చక్కగా ముందు కెళ్తోంది..

(సరదాకి మాత్రమే ఇతర ఉద్యేశాలు లేవని మనవి)

-యర్రంశెట్టి సాయి

Show comments