నేనేమన్నానని: చంద్రబాబు ఆవేదన

ఒకప్పుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేస్తే ఎలా.? 'తెలంగాణ రాష్ట్ర సాధన మాతోనే సాధ్యమయ్యింది.. మేమే తొలి లేఖ కేంద్రానికి రాశాం.. మా పార్టీ నేతలు ఎన్నో త్యాగాలు చేశారు.. తెలంగాణకు నేనెప్పుడూ వ్యతిరేకం కాదు..' అంటూ తెలంగాణలో కొన్నాళ్ళ క్రితం చంద్రబాబు బీభత్సమైన ప్రసంగాలు చేసిన విషయం విదితమే. ఇప్పుడు అదే చంద్రబాబు, తెలంగాణ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ఇంకేముంది, ఆటోమేటిక్‌గా, 'తెలంగాణ'లో మంటలు పుట్టుకొస్తాయి కదా, చంద్రబాబుకి వ్యతిరేకంగా.! అదే జరుగుతోందిప్పుడు. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో 'తాత్కాలికం' అనే పేరుతోనే అయినా, అసెంబ్లీని, శాసనమండలిని, సచివాలయాన్నీ నిర్మించేసుకున్నాక, 'ఈ ఘనత నాదే..' అని చంద్రబాబు చెప్పుకోడాన్ని తప్పు పట్టలేం. 'ఇలా ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందంటే..' అంటూ పాత పురాణాన్ని చంద్రబాబు మళ్ళీ తిరగేశారు. 'అవమానకరం.. ఆవేదనాభరితం..' అని చంద్రబాబు, అసెంబ్లీ - శాసనమండలి ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాక పుట్టించాయి. 

ఇక్కడ, చంద్రబాబు చెబుతున్న 'విభజన తీరు' గురించి. కానీ, అక్కడ మెసేజ్‌ కన్సీవ్‌ అయ్యింది ఇంకోలా. అందుకే మరి, ఇలాంటివి సున్నితమైన అంశాలనేది. చంద్రబాబు 'విభజన తీరు' గురించే మాట్లాడినా, 'అసహనం, ఆవేదన, ఆగ్రహం..' అన్న పదాల్ని గట్టిగా ఆయన ఉపయోగించడం వెనుక 'ఇన్‌టెన్షన్‌' ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది. ఈ విషయం, టీడీపీ తెలంగాణ నేతలకీ అర్థమయ్యింది. అందుకే, చంద్రబాబు తీరు పట్ల వాళ్ళు సైతం గుస్సా అవుతున్నారట. 

'తెలంగాణలో పార్టీ ఇప్పటికే నాశనమయ్యింది.. ఇంకా నాశనం చెయ్యాలనుకుంటున్నారా.?' అంటూ ఒకరిద్దరు టీడీపీ తెలంగాణ నేతలు చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేశారట కూడా. 'నేనేమన్నానని, విభజన తీరు గురించే కదా మాట్లాడాను..' అని చంద్రబాబు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా, అది తెలంగాణ నేతలకే రుచించని పరిస్థితి. అందుకేనేమో, టీఆర్ఎస్ నేతలు, చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఖండించే సాహసం టీడీపీ తెలంగాణ నేతలెవరూ చేయలేదు.

అయినా, నిండా మునిగినోడికి చలేంటన్నట్లు.. ఆల్రెడీ తెలంగాణలో టీడీపీ ఖతం అయిపోయింది.. ఇంకా తెలంగాణలో ఆ పార్టీ గురించి, అందులోని నేతల గురించి చంద్రబాబు ఆలోచించడం అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. కానీ, జాతీయ పార్టీ అని చెప్పుకోవాలంటే, తెలంగాణలో పార్టీ నామమాత్రంగానే అయినా వుండాలి కదా. అలాంటి ఆలోచనలు వున్నప్పుడు, తెలంగాణ గురించి తాను 'మాట్లాడకపోవడమే మంచిది' అని చంద్రబాబుకి ఎప్పుడు అర్థమవుతుందట.? అసలు అర్థమవుతుందా.? అవదా.?

Show comments