అందుకే అది 'కబాలి' రా.!

'కబాలి'.. రజనీకాంత్‌ తాజా చిత్రం.. విడుదలకు సిద్ధమైందిది. రజనీకాంత్‌ సినిమా ఎప్పుడొచ్చినా, అంచనాలు ఆకాశాన్నంటేస్తాయి. తమిళ సినిమా అయినా, దానికి తెలుగులోనూ అంతే క్రేజ్‌ వుంటుంది. బాలీవుడ్‌లోకూడా రజనీకాంత్‌ సినిమాకి క్రేజ్‌ తక్కువేమీ కాదు. పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కబాలి'లో రజనీకాంత్‌ డాన్‌లా కనిపించనున్న విషయం విదితమే. 

ఇక, 'కబాలి' విడుదలకు ముందు రజనీకాంత్‌, విదేశాలకు వెళ్ళడం.. వైద్య పరీక్షలు చేయించుకుంటుండడంతోపాటు, ఆయన గత కొన్నాళ్ళుగా మీడియా ముందుకు రాకపోవడంతో 'కబాలి'పైనా, రజనీకాంత్‌ ఆరోగ్యంపైనా రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.. కొత్త కొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయి. 

అన్ని అనుమానాల్నీ పటాపంచలు చేస్తూ 'కబాలి' విడుదలకు సిద్ధమైపోయింది. తమిళనాడు వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 'కబాలి'ని ఈ నెల 22న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన 'కబాలి' పోస్టర్‌తో అభిమానులకు సినిమాపై ఇప్పటిదాకా వున్న అంచనాలు పదింతలయ్యాయి. రఫ్‌ లుక్‌తో రజనీకాంత్‌ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. 

సినిమా విడుదల ఖాయమవడంతో, తమిళనాడులో రజనీకాంత్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 'కబాలి' కన్‌ఫర్మ్‌ అయిన థియేటర్ల వద్ద అప్పుడే 'డెకరేషన్లు' కూడా ప్రారంభమయిపోయాయి. ఇంత సందడిలోనూ అభిమానులకి ఒకటే టెన్షన్‌, తమ అభిమాన హీరో ఆరోగ్యం ఎలా వుందోనని. ఆ ఒక్కటీ మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. తొలిరోజు వసూళ్ళ విషయంలో మొత్తంగా ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ రికార్డుల్ని 'కబాలి' కొల్లగొట్టేస్తుందన్నది అభిమానుల వాదన. 

ఏదిఏమైనా, వరుస ఫ్లాపుల తర్వాత కూడా రజనీకాంత్‌ సినిమాకి హైప్‌ తగ్గలేదు సరికదా, అమాంతం రెట్టింపయిపోయింది. దటీజ్‌ రజనీకాంత్‌. అందుకే అది 'కబాలి' రా.. అంటున్నారు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు.

Show comments