ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి సత్సంబంధాలు ఏమైనా దెబ్బతిన్నాయా? లేదా, మోడీకి చిడతలు వాయించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను చేస్తున్న ద్రోహం ప్రజలు గుర్తించి నానా మాటలు అంటోంటో వెంకయ్యనాయుడిలోనే మార్పు వస్తున్నదా? అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతున్నాయి. ఓ మంత్రి వర్యుడు సెలవిచ్చినట్లుగా కాస్త అతిశయం జోడించి చెప్పాలంటే.. రోజుకు 48 గంటలపాటూ మోడీ భజన చేస్తూ.. తనకు అప్పగించిన ప్రసార శాఖను ప్రచార శాఖగా భావించి.. చేతికి చిడతలు అతికించుకుని తిరుగుతూ ఉండే వెంకయ్యనాయుడు ఇటీవలి కాలంలో కొద్దిగా మోతాదు తగ్గించారేమో అనిపిస్తోంది. అబ్బెబ్బే.. మోడీ దైవాంశసంభూతుడని, దేవుడే ఆయన రూపంలో అవతరించి పాలన సాగిస్తున్నాడని ఇటీవలి కాలంలో ఎక్కడా చెప్పకపోవడం ఒక్కటే ఈ అనుమానానికి కారణం కాదు.. ఇటీవలి కాలంలో కొన్ని సందర్భాల్లో వెంకయ్యనాయుడు నిజాయితీగా కూడా మాట్లాడినట్లు అనిపిస్తోంది గనుక.
తాజాగా విశాఖలో డిజిధన్ మేళా అనే దానిని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. హద్దూ అదుపూ తెలుసుకోకుండా దేశం మొత్తం ‘డిజి’ అనే పదాల చుట్టూ కొట్టుకుపోతున్న సీజన్ ప్రస్తుతం నడుస్తోంది గనుక.. అలాంటి వాటిలో ఇది కూడా ఒక కార్యక్రమం అనుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో ఇంకా అనేక కఠిన నిర్ణయాలు ఉంటాయంటూ వెంకయ్యనాయుడు జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి వెంకయ్యనాయుడు వంటి నాయకుడినుంచి అలాంటి డైలాగును ఊహించలేం. నిజంగానే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నా సరే.. ‘‘ప్రజలు హర్షిస్తున్న అద్భుత నిర్ణయాలు రాబోతున్నాయి’’ అంటూ ఊదరగొట్టే అలవాటున్న వెంకయ్య ఇలా వాక్రుచ్చడం ఒక విశేషం.
అదేసమయంలో ఇటీవలే ఆయన ఒక టీవీఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ గుర్తుకొస్తోంది. ప్రత్యేకహోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అంటూ దాన్ని ప్రజలు పూర్తిగా మరచిపోవడానికి వెంకయ్యనాయుడు కోటరీ చాలా రోజులుగా నానా పాట్లు పడుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కాస్త విభిన్నంగా ఆ ఇంటర్వ్యూలో మాత్రం వెంకయ్యనాయుడు.. ప్రత్యేకహోదా వలన కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్న మాట వాస్తవమే గానీ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇవ్వడం సాధ్యం కాదు గనుక.. ప్యాకేజీ ఇచ్చాం అంటూ అసలు మర్మం ఒప్పుకున్నారు. ప్రత్యేకహోదా వలన మేలు జరుగుతుందని ఆయన నోటమ్మట ఒక మాట వచ్చి చాలాకాలం అయింది. ఆయనలో ఏమైనా పరివర్తన వచ్చి ఇలా నిజాయితీగా మాట్లాడారో.. లేదా, హోదా గురించి ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు, ఉద్యమాల పుణ్యమాని వారిలో చైతన్యం, అవగాహన పెరుగుతోంది. ఇప్పటికీ తాను స్టీరియోటైపు అబద్ధాలు చెబితే.. తానే నవ్వులపాలైపోతాననే భయం కలిగిందో తెలియదు గానీ.. వెంకయ్యనాయుడు ఇలా నిజాన్ని ఒప్పుకోవడం చిత్రంగానే ఉందని పలువురు భావిస్తున్నారు.
ఇలా వాస్తవాలు మాట్లాడితే.. మోనార్క్ మోడీకి కోపం రాదా? అనుకుంటే.. మోడీతో సత్సంబంధాలు ఇదివరకటిలాగా ఇప్పుడు వర్ధిల్లడం లేదని, అందువల్లనే వెంకయ్య మాటతీరులోనూ మార్పు వచ్చిందని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ సంగతీ మరికొంతకాలం గడిస్తే గానీ తేలకపోవచ్చు.