టీడీపీ.. తన్నించుకునే సమయం దగ్గరపడిందా!

పెన్షన్ తీసుకుంటున్న వృద్ధుల నుంచి ఏడాదికి ఒకసారి వంద రూపాయలు కట్ చేస్తున్నారు. అదేమంటే.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము అని చెబుతున్నారు! రెండేళ్లుగా ఈ తతంగం నడుస్తోంది. ఈ ఏడాది కూడా నడుస్తోంది.

ఎలాగూ గ్రామాల్లో పెన్షన్ ను ఇచ్చే బాధ్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. గ్రామాల్లోని పచ్చ చొక్కాలను ఆ కమిటీల్లో నింపారు. అధికారాన్ని వారి చేతిలో పెట్టారు. తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగినప్పుడల్లా పెన్షనర్ల కు ఇచ్చే డబ్బులో వంద కట్ చేసి.. వారి చేతిలో టీడీపీ ఐడెంటిటీ కార్డు పెడుతున్నారు.

అదే అనుకుంటే.. ఇప్పుడు రేషన్ కావాలన్నా.. తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవడం తప్పనిసరి అవుతోంది. అధికారంలోకి వస్తూ వస్తూనే.. కాంగ్రెస్ హయాంలోని రేషన్ డీలర్లందరినీ తొలగించేసి, తమ వారిని నియమించేసుకున్నారు. పాతిక, ఇరవై ఇళ్లు ఉన్న గ్రామాల్లో కూడా తెలుగుదేశం అనిపించుకున్న వారి చేతిలోనే రేషన్ డీలర్ షిప్ ఉందిప్పుడు.

అలాంటి డీలర్లను అడ్డం పెట్టుకుని.. ఏకంగా లక్షల సంఖ్యలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్లకు ఇప్పుడు  తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తప్పనిసరి చేశారు. రేషన్ సరుకులకు అవసరమైన సొమ్ముతో పాటు.. వంద రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ నెల అని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. ఆ వంద రూపాయలు ఎందుకు? అనే విషయం గురించి కొన్ని చోట్ల సూటిగా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసమని. మరి కొన్ని చోట్ల.. ఏదో నిర్వహణ ఖర్చు అన్నట్టుగా వసూలు చేస్తున్నారు.

అధికారికంగా తెలుగుదేశం సభ్యత్వం కోసం అని ప్రకటించిన చోట.. తెలుగుదేశం సభ్యత్వం కార్డును రేషన్ కార్డు హోల్డర్ చేతిలో పెడుతున్నారు. ఎందుకో చెప్పకుండా వంద వసూలు చేసిన చోట.. మాత్రం ఆ వందను తెలుగుదేశం రికార్డులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు!

మరి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా.. సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ఈ విధమైన బలవంతపు ఒత్తిడులు చేసిన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఇంత వరకూ లేదు. పెన్షనర్ల విషయంలో అయితే నిర్మొహమాటంగా వంద రూపాయలు కట్ చేస్తూ.. తెలుగుదేశం సభ్యత్వాన్ని ఇస్తున్నారు. రేషన్ కార్డు ఉండాలంటా.. రేషన్ అందాలంటే.. అదనంగా వంద రూపాయలు తప్పనిసరి చేశారు.

ఇలాంటి పద్ధతుల ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం అయ్యిందనిపించుకోవాలని తెలుగుదేశం ఆలోచించడం హేయమని వేరే చెప్పనక్కర్లేదు. వీళ్ల వేషాలు చూస్తుంటే.. జనాలతో తన్నించుకునే రోజులు మరెంతో దూరంలో లేవనిపిస్తోంది.

Show comments