'ఖైదీ' ప్రీ రిలీజ్‌: పదనిసలు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' ఆడియో విడుదల వేడుక గుంటూరు జిల్లాలోని హాయ్‌లాండ్‌లో ఘనంగా జరిగింది. పెద్దయెత్తున అభిమానులు ఈ వేడుకకి హాజరయ్యారు. అభిమానుల కోలాహలం, వేదికపైన మెగా ఫ్యామిలీ సందడి.. వెరసి, చాలా కాలం తర్వాత ఈ స్థాయి సినీ ఫంక్షన్‌ జరిగిందనే అభిప్రాయం సినీ వర్గాల్లోనూ వ్యక్తమయ్యింది. అయితే, ఈ ఫంక్షన్‌లో అనేక 'పదనిసలు' చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం. 

- ఓ అభిమానికి గుండెపోటు రావడంతో, తక్షణం అతన్ని ఆసుపత్రికి తరలించారు. 

- సినీ ఇండస్ట్రీలో చిరంజీవిని ఆశీర్వదించే అతి కొద్దిమందిలో దాసరి నారాయణరావు ఒకరు.. అని రామ్‌చరణ్‌ వ్యాఖ్యానించడం. అభిమానులూ షాక్‌కి గురయ్యారు ఈ వ్యాఖ్యలతో. అంటే, ఇండస్ట్రీలో చాలామంది చిరంజీవిని వ్యతిరేకిస్తున్నారనే అర్థం ఇందులో వుందా.? 

- నాగబాబు తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయారు. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మీదా, రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ మీదా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారాయన. 

- మెగాభిమానుల సంస్కారం చాలా గొప్పదని చెబుతూ, ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నిటినీ ఆదరించమని మెగా ఫ్యామిలీ తరఫున కోరుతున్నానని చెప్పాడు హీరో అల్లు అర్జున్‌. 

- మా నాన్న తర్వాత ఆ స్థానంలో నేను అన్నయ్య చిరంజీవినే చూస్తానంటూ దర్శకుడు వినాయక్‌ ఎమోషనల్‌ అయ్యాడు. 

- చిరంజీవి తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ సంక్రాంతికి తన 'ఖైదీ నెంబర్‌ 150'తోపాటు మిత్రుడు, సోదరుడు బాలకృష్ణ హీరోగా నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి', అలాగే చిన్న సినిమా 'శతమానం భవతి', అలాగే ఆర్‌.నారాయణమూర్తి సినిమా కూడా విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. 

- చిరంజీవి ప్రసంగిస్తున్న సమయంలో జనసేన జెండా రెపరెపలాడింది.. పవన్‌ అభిమాని ఒకరు, ఈ జెండాని ఎగరవేశాడు. అది పలుమార్లు కెమెరాకి అడ్డంగా రావడంతో చిరంజీవి ఒకింత అసహనానికి గురయ్యారు. 

- ఈవెంట్‌ మొదట్నుంచి చివరిదాకా పవన్‌కళ్యాణ్‌ పేరు ప్రస్తావన చాలా తక్కువగానే వచ్చినా, ఆ పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ అభిమానులనుంచి రీసౌండ్‌ ఓ రేంజ్‌లో వచ్చింది. పవన్‌కళ్యాణ్‌ తరఫున 'కాటమరాయుడు' చిత్ర నిర్మాత శరద్‌మరార్‌ ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. పవన్‌కళ్యాణ్‌ మనస్ఫూర్తిగా 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి శుభాకాంక్షలు తెలిపారనీ, అన్నయ్యకు విషెస్‌ అందించమన్నారని చెప్పారాయన.

Show comments