వాళ్లతో పవన్ బంధం బలపడుతోందా?

ఇప్పటికే టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాల్లో కమ్యూనిస్టు పార్టీ నేతలు, ఆ పార్టీల అనుకూలవాదులు పవన్ కల్యాణ్ విషయంలో చాలా సానుకూలంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం, బీజేపీల హామీల అమలుకు పూచీ తాను అని ప్రకటించిన పవన్ రెండున్నరేళ్ల నుంచి ఆ అంశాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు? అనే విషయంలో కూడా పవన్ ను వెనకేసుకు వస్తూ మాట్లాడుతున్నారు కమ్యూనిస్టులు. ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. పవన్ ను ఏమైనా అంటే వీళ్లు అస్సలు సహించడం లేదు!

పవన్ ను ఎవ్వరు ఏమన్నా.. అలా అన్నవాళ్లపై అక్కడిక్కడే మాటల దాడి చేస్తున్నారు కమ్యూనిస్టులు. ఏమిటీ లెక్క? అనేది బయటకు అర్థం కాని అంశంగానే ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా సీపీఐ నేత రామకృష్ణ వెళ్లి పవన్ తో సమావేశం కావడం ఆసక్తికరంగా ఉంది. మరి పవన్ కల్యాణే రామకృష్ణను పిలిపించుకున్నారా? లేక రామకృష్ణే పవన్ ను కలిసేందుకు వెళ్లారా? అనే అంశాల గురించి క్లారిటీ లేదు. 

పలు సమకాలీన అంశాల గురించి రామకృష్ణ , పవన్ ల మధ్య చర్చ జరిగిందనే మాట వినిపిస్తోంది. ప్రత్యేకహోదా, రాష్ట్రంలోని ఇతర సమస్యలు, నోట్ల మార్పిడి వ్యవహారాల గురించి ఈ ఇరువురు నేతలూ చర్చించారట. పవన్ వంటి స్టార్ క్యాంపెయినర్ కోసం కమ్యూనిస్టులు చాలా ఆశలనే పెట్టుకుని ఉన్నాయి. సినిమా స్టార్లను, సినిమా వ్యవహారాలను బూర్జువా.. అంటూ తీసిపారేసే కమ్యూనిస్టులే ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కోసం తపిస్తున్నాయి.

ఇప్పడు సమావేశాల వరకూ వచ్చింది కథ. ఇది ఎన్నికల పొత్తు వరకూ వెళ్తుందా? రేపటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాల నడుమ చీలిపోవడానికి అనుగుణంగా వేస్తున్న ప్రణాళికలోనే ఇదంతా జరగుతుందా? అనే సందేహాలు సహజంగానే కలుగుతాయి. పవన్ రేపటి ఎన్నికల నాటికి తమతో కలిసి ఉండటం కన్నా.. ప్రతిపక్షంగా ఉండి పోటీ చేస్తేనే కొంత ఉపశమనం ఉంటుందనేది చంద్రబాబు లెక్కకు అనుగుణంగానే ఈ పరిణామాలు సంభవిస్తూ ఉండవచ్చనేది విశ్లేషకుల మాట. 

Show comments