మోడీ.. అలా మూయించేశారంతే

నరేంద్రమోడీ.. రాజకీయ వ్యూహాల్లో దిట్ట.. పబ్లిసిటీ కింగ్‌.. ఏం చేసినా సరే, ప్రత్యర్థులకు ఊపిరాడనివ్వకూడదంతే.. చేసేది తప్పయినా, ఒప్పయినాసరే.. తన మాటే నెగ్గాలనుకునే తత్వం ఆయనది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడూ, దేశ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడూ.. ఆయన వ్యూహాల్లో రోజురోజుకీ పదును పెరుగుతోంది తప్ప తగ్గడంలేదు. 

పెద్ద పాత నోట్ల రద్దు అనంతరం, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్‌ చేస్తూ చాలా హంగామా చేస్తున్న విషయం విదితమే. 'నరేంద్రమోడీని రాజకీయాలనుంచి తరిమికొట్టేదాకా నిద్రపోను..' అంటూ ఆమె శపథం చేసేశారు.. అంతే, నరేంద్రమోడీలో ఎక్కడ లేని ఆవేశం పుట్టుకొచ్చినట్లుంది. స్కెచ్‌ వేశారు.. ఆ దెబ్బకి మమతా బెనర్జీ అడ్డంగా బుక్కయిపోయారు. 

పశ్చిమబెంగాల్‌లో సైన్యం సోదాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ పెద్దయెత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఓ ముఖ్యమంత్రి ఇలా పిలుపునివ్వడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. సరిగ్గా, ఈ వ్యూహాత్మక తప్పిదాన్నే నరేంద్రమోడీ సర్కార్‌ క్యాష్‌ చేసుకుంది. అసలు వివాదమేంటి.? అన్నది అంతా మర్చిపోయారు. రాత్రికి రాత్రి మమతా బెనర్జీ ఇమేజ్‌ పాతాళానికి పడిపోయింది. 

నిజానికి పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ తిరుగులేని నేత. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారామె. పెద్ద పాత నోట్ల రద్దుకు సంబంధించి చాలా ఎగ్రెసివ్‌గా మమతా పోరాటం చేస్తున్నారు. ఓ ముఖ్యమంత్రి ఇలా రోడ్డెక్కి ఆందోళనలు చేయడమంటే చిన్న విషయం కాదు. పశ్చిమబెంగాల్‌ మొత్తాన్నీ కదిలించగల శక్తి ఆమెకుంది. అలాంటి వ్యక్తిని, రాత్రికి రాత్రి 'జీరో'ని చేసి పారేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 

అధికారుల స్థాయిలో కేంద్రానికి అందిన ఓ లేఖ, ఇప్పుడు మమతా బెనర్జీ కొంప ముంచేసింది. ఆ లేఖని సైన్యం ద్వారా బయటపెట్టించడంతో మమతా బెనర్జీ వాదనకు విలువ లేకుండా పోయింది. పెద్ద పాత నోట్ల రద్దు వివాదం వెనక్కి వెళ్ళి, మమతా బెనర్జీ ఇమేజ్‌ స్పాయిల్‌ అయిపోవడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు కూడా నివ్వెరపోతున్నాయట. ఇకపై మమతా బెనర్జీ పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారంపైనా పెదవి విప్పే అవకాశం లేదనే వాదనలు బీజేపీ నుంచి విన్పిస్తున్నాయి. 

సెల్ఫ్‌ గోల్‌ అనొచ్చు.. ఇంకేమైనా అనొచ్చు.. మమతా బెనర్జీ మాత్రం ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్కయిపోయారు. ఈ ఎపిసోడ్‌లో నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.. మమతా బెనర్జీపై పైచేయి సాధించేశారు. మోడీకి తెలియకుండా, సైన్యం పశ్చిమబెంగాల్‌లో హల్‌చల్‌ చేసే అవకాశం లేదు కదా.!

Show comments