క్యాష్‌ లెస్‌.. సింప్లీ బ్రెయిన్‌ లెస్‌.!

భారతదేశాన్ని క్యాష్‌ లెస్‌ కంట్రీగా మార్చెయ్యాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ యోచన. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసేశారు. ఆ కమిటీ త్వరలోనే సమావేశమయి, దేశాన్ని ఎలా క్యాష్‌ లెస్‌గా మార్చెయ్యాలో అధ్యయనం చేస్తుంది. 

ఏ పని చెయ్యాలన్నా, దానికో పద్ధతి పాటించాల్సి వుంటుంది. 125 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తుకు సంబంధించిన ఓ నిర్ణయాన్ని చాలా సింపుల్‌గా తీసేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రాత్రికి రాత్రి పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయం తీసేసుకున్న తర్వాత, తలెత్తిన గందరగోళ పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు ఇప్పుడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. 

ఏమన్నా అంటే, 'ముందుగా ఏ చర్య తీసుకున్నా.. అది ఓపెన్‌ అయిపోతుంది.. నల్ల దొంగలు జాగ్రత్తపడిపోతారు..' అని మేధావి లోకం నరేంద్రమోడీకి మద్దతుగా మాట్లాడుతోంది. ఇందులో నిజమెంత.? అన్న విషయం పక్కన పెడితే, రోడ్డున పడ్డది 125 కోట్ల మంది ప్రజలు మాత్రమే. రోడ్డున పడకుండా తప్పించుకున్న నల్లకుబేరులు జస్ట్‌ లక్షల్లో వుంటారేమో.! మరెందుకీ పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. 

రద్దయిన పెద్ద పాత నోట్లను కొత్త నోట్లతో రీప్లేస్‌ చెయ్యడానికి సుమారు 7 నెలల సమయం పడ్తుందన్నది ఓ అంచనా. యుద్ధ విమానాల్లో డబ్బుని తరలిస్తున్నారు ఆయా రాష్ట్రాలకు చేరవేసేందుకు. యుద్ధ విమానాలు అవసరమా.? సాధారణ విమానాల్లోనో, లేదంటే రైళ్ళలో పంపించినా సరిపోతుంది. కానీ, ఏదో హడావిడి చెయ్యాలి కదా.. అదే జరుగుతోందిక్కడ. 

క్యాష్‌ లెస్‌.. అనే మాట వినడానికి చాలా బాగుంటుంది. కానీ, 125 కోట్ల మంది భారతీయుల్లో క్యాష్‌ లెస్‌ అంటే తెలిసిందెంతమందికి.? ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్‌ చేసేస్తే, దాని గురించి తెలుసుకునేదెందరు.? పాటించేదెందరు.? అన్నిటికీ మించి, దేశంలో అక్షరాస్యులెంతమంది.? నిరక్షరాస్యులెంతమంది.? అన్న లెక్కలు తీసి, అధ్యయనం చెయ్యాల్సిందే కదా.! ఈ ప్రక్రియ పూర్తయ్యాక, క్యాష్‌ లెస్‌ గురించి ఆలోచించాలి. 

కానీ, ఘోర తప్పిదం జరిగిపోయింది.. సుదీర్ఘ అధ్యయనం అనంతరం తీసుకోవాల్సిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, 'తుగ్లక్‌' తరహాలో షడెన్‌గా జరిగిపోవడంతో, కేంద్రం వద్ద వేరే ఆప్షన్‌ లేదు. జనాన్ని రోడ్డున పడేసి, ఇప్పుడు బ్రెయిన్‌లెస్‌గా క్యాష్‌ లెస్‌ కంట్రీ.. అనే నినాదాన్ని నెత్తికెత్తుకున్నారు. దేశంలో ఇంటర్నెట్‌ ఎంతమందికి అందుబాటులో వుంది.? స్మార్ట్‌ మొబైల్స్‌ ఎంతమంది వినియోగిస్తున్నారు.? అసలు కరెంటు ఎన్ని గ్రామాలకు ఇంకా లేదు.? ఇలాంటివన్నీ తలచుకుంటే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది. 

10 వేలు జీతమిచ్చి, ఉద్యోగుల్ని రోడ్డున పడేశారు. అసలు జేబులో డబ్బు లేకుండా జనాన్ని రోడ్డుకీడ్చేశారు. క్యాష్‌ లెస్‌ అట, ప్లాస్టిక్‌ మనీ అట, మొబైల్‌ బ్యాకింగ్‌ అట, ఆన్‌లైన్‌ లావాదేవీలట.. ఇంత బ్రెయిన్‌లెస్‌గా పాలకులు ఆలోచిస్తారా.? అన్న అనుమానం వీసమెత్తు కూడా కలగలేదు ఇంతకు ముందు వరకూ దేశ ప్రజానీకానికి. తుగ్లక్‌ ఎలా వుంటాడో తెలియదు.. ఇప్పుడు చూస్తున్నాం.!

Show comments