జీవీఎంసీ - అస్త్రశస్రాలు సిద్ధం

- అధికార పార్టీలు సన్నద్ధం

- ఇటు రైల్వే జోన్‌... అటు పురుషోత్తమపట్నం 

- విపక్షాల ఎత్తులకు పై ఎత్తు

- జీవీఎంసీ ఎన్నికలకు మిత్రుల కసరత్తు Readmore!

పరాజయం అన్న మాట వినిపించుకూడదన్నది అధికారంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీల తాజా శపధం.  విశాఖ వంటి మహా నగరాన్ని గుప్పిట పట్టాలన్నది మిత్రుల పంతం. మూడేళ్ల క్రితం నాటి మేజక్‌ విక్టరీని మహా విశాఖ నగర పాలక సంస్ధ (జీవీఎంసీ) ఎన్నికలలో రిపీట్‌ చేయాలన్నది వ్యూహం.  ఈ కారణంగానే కేంద్రంలో, రాష్ట్రంలో పవర్‌ చేతిలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలు విశాఖపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. నాయుళ్ల ధ్వయం కనీసం నెలకు ఒకసారి అయినా విశాఖ పర్యటన చేస్తోంది. హామీల మీద హామీలను సీఎం హోదాలో చంద్రబాబు గుప్పిస్తూంటే, నేనూ తయార్‌ అంటూ కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు సైతం విశాఖపై అమితమైన ప్రేమను చాటుకుంటున్నారు. విడిగా, కలివిడిగా ఇద్దరూ నేతలూ ప్రారంభోత్సవాలు చేసేస్తూ పార్టీల జెండాలను జనం ముందుంచుతున్నారు. నగరంలో జరిగే ప్రతీ అధికారిక కార్యక్రమానికి ఠంచనుగా హాజరవుతున్న ఈ నాయుళ్ల జంట  అభివృద్ధి మంత్రంతో ఓట్ల పంట పండించుకోవాలని ఉబలాటపడుతోంది. కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్‌ విశాఖకు దక్కితీరుతుందని వెంకయ్య తాజా పర్యటనలో గట్టిగా హామీ ఇస్తే, విశాఖకు తాగునీరు, సాగు నీరు అందించడం ద్వారా పోలవరాన్ని తానే ఇస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించుకున్నారు. ఆకాశమే హద్దు అన్నట్లుగా  నేతలిద్దరూ వాగ్దానాలు చేస్తున్నారు. ప్రతీ కార్యక్రమాన్ని తమ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు  తాాపత్రయపడుతున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలలో జయ పతాక ఎగురవేయాలన్న లక్ష్యంతో సాగుతున్న ఈ రాజకీయ ఎత్తుగడలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది.

ఆ రెండు ట్రంపు కార్డులతో...

విశాఖ మహా నగరవాసులను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ అధినాయకత్వం భారీ స్కెచ్‌నే వేసింది. యాభై ఏళ్ల నాటి పోలవరం కల అలాగే మిగిలిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా తక్షణం నీరు అందించేందుకు పురుషోత్తమపట్నం పేరుతో ఎత్తిపోతల పధకానికి శ్రీకారం చుట్టడం అందులో భాగమే. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా పోలవరం ఎడమ కాలువ ద్వారా తూర్పు గోదావరి, విశాఖ జిల్లా, నగరాలకు సాగు నీరు, తాగు నీరు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పధకానికి శంకుస్ధాపన చేశారో లేదో జిల్లా తెలుగుదేశం నాయకులు అపుడే ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నగర ప్రజల దాహార్తిని తీర్చే అపర భగీరధుడు చంద్రబాబు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు విశాఖకు వరమని కీర్తించారు. గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఉత్తరాంధ్ర అన్నింటా వెనుకబడి పోయిందని, టీడీపీ హయాంలోనే విశాఖకు ఓ వెలుగు వచ్చిందంటూ జన్మభూమి సభలలో ఆయన హోరెత్తించేస్తున్నారు.

పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పధకం ద్వారా నగర వాసులకు వేసవి కష్టాలు తీరుతాయని, ఇకపై తాగు నీటికి కటకట  ఉండదని భరోసా ఇస్తూ అయ్యన్న జీవీఎంసీ ఎన్నికల ప్రచారాన్ని దాదాపుగా ప్రారంభించేశారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం జాతీయ విద్యా సంస్ధలన్నీ విశాఖ వేదికగా తరలిరానున్నాయని చెబుతూ తనదైన బాణీలో ముందుకు సాగుతున్నారు. ఇంకోవైపు అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాసరావు విశాఖ జోన్‌ ఎట్టి పరిస్థితులలోను వచ్చి తీరుతుందని నమ్మకంగా చెబుతున్నారు. తాను ప్రతీ పార్లమెంట్‌ సమావేశాలలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ వస్తున్నానని పేర్కొనడం ద్వారా టీడీపీకి రాజకీయ లాభాన్ని సమకూర్చే పనిలో పడ్డారు. ఇంకో వైపు బీజేపీ నేతలు సైతం విశాఖ అభివృద్ధి అంతా తమ వల్లేనంటూ చెప్పుకొస్తున్నారు. కేంద్రంలో అనుకూలమైన మోదీ సర్కార్‌ ఉండడం వల్లనే విశాఖ వంటి నగరానికి కావాల్సినన్ని నిధులు ఇస్తున్నామని విశాఖ ఎంపి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు తన ప్రతీ సభలోనూ తెలియచేస్తున్నారు. 

నగర నాయకులు ఇలా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తమదైన  శైలిలో నగర పర్యటనలు చేస్తూ  ట్రంప్‌ కార్డులను బయటకు తీస్తున్నారు. నగరంలో తాజాగా జరిగిన పర్యటనలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఓ అడుగు ముందుకేసి విశాఖకు రైల్వే జోన్‌ త్వరలోనే ఇవ్వబోతున్నామన్న తీపి కబురు వినిపించారు. ఇది తాను విశాఖవాసులకు నూతన వత్సర కానుకగా అందిస్తున్నానని చెప్పడం విశేషం. విశాఖకు రైల్వే జోన్‌తో పాటు, అడిగినవీ, అడగనివీ కూడా కేంద్రం చేసి పెడుతుందని వెంకయ్య గట్టి భరోసానే ఇచ్చారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపి కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్న నేపధ్యంలో విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు అందులో ఉంటుందన్న సంకేతాలను వెంకయ్య ముందుగానే అందించారు. ఆ విధంగా రైల్వేజోన్‌ ఏర్పాటు ఘనతను బీజేపీ ఖాతాలో వేసేసుకున్నారు. తాను కూడా విశాఖ వాసినేనని, ఇక్కడే చదువుకుని ఇక్కడే రాజకీయంగా అక్షరాభ్యాసం చేశానని చెప్పుకోవడం ద్వారా వెంకయ్య నగర వాసులకు పార్టీని దగ్గర చేసేందుకు యత్నిస్తున్నారు. ఇక, నగరంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం (సిజిహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయించిన వెంకయ్య విశాఖపై బీజేపీకి ఎనలేని ప్రేమ ఉందని ప్రకటించారు. 

మేయర్‌ పీఠం వైపుగా...

కొత్త సంవత్సరంలో సరికొత్త విజయాన్ని నమోదు చేయడం ద్వారా పార్టీకి జవజీవాలు అందించాలన్నది తెలుగుదేశం అధినాయకత్వం ఆలోచనగా ఉంది. ముప్పయి ఏళ్ల నాటి కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలన్న ఆశతో పసుపు పార్టీ పావులు కదుపుతోంది. పాత హామీలను మరోమారు వల్లె వేయడంతో పాటు, వీలున్న వాటిని నెరవేర్చడం ద్వారా విశాఖ వాసుల మనసు గెలుచుకోవాలని ఆరాటపడుతోంది. అమరావతి టు విశాఖగా వరుస పర్యటనలతో చంద్రబాబు వైజాగ్‌లో తరచూ సందడి చేస్తున్నారు. వచ్చినపుడల్లా చెప్పిన మాటను చెప్పకుండా జనం మదిలో పదిలంగా పార్టీని ఉంచేలా యత్నిస్తున్నారు. గత ఏడాది దాదాపుగా డజను సార్లు విశాఖ వచ్చిన చంద్రబాబు 2017 వస్తూనే తొలివారంలోనే టూర్‌ పెట్టేసుకున్నారు. ఇ-గవర్నెన్స్‌ పేరుతో నగరంలో జరిగిన అధికారిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పనిలో పనిగా పలు ఇతర కార్యక్రమాలలోనూ పాలుపంచుకున్నారు. ప్రతీ సందర్బంలోనూ విశాఖను అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్నట్లుగా ఆర్బాట ప్రకటనలు చేశారు. విశాఖను సిలికాన్‌ వాలీగా చేస్తామన్న ముఖ్యమంత్రి నవ్యాంధ్రలో ఐటి రాజధానిగా మహా నగరం తప్ప వేరొకటి లేనేలేదని కొనియాడారు.

పర్యాటకపరంగానూ విశాఖకు పెద్ద పీట వేస్తున్నట్లుగా వెల్లడించిన సీఎం ఆ దిశగా చేపడుతున్న పలు ప్రాజెక్టులను వల్లె వేశారు. విశాఖ వంటి మెగా సిటీని  అమరావతితో సరిసమానంగా ప్రగతి బాటన నడపించనున్నట్లుగా కూడా పేర్కొన్నారు. అటు అధికారులతో విశాఖ అభివృద్ధిపై సమీక్ష జరిపిన సీఎం పనిలో పనిగా ఇటు పార్టీ నేతలతోనూ భేటీ అయ్యారు. రానున్న రోజులలో విశాఖలో జరిగే జీవీఎంసీ ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. 1987లో ఒకేఒక్కసారి టీడీపీ విశాఖ మేయర్‌ను కైవశం చేసుకుంది, ఇప్పటికి ముప్పయి ఏళ్లయినా మళ్లీ ఆ మహా పీఠం దక్కలేదు. దీంతో, ఈసారి ఎటువంటి పరిస్థితులలోనూ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుని తీరాలని పార్టీ నాయకత్వానికి బాబు దిశా నిర్దేశం చేశారు. నగర అభివృద్ధిపై తాను ప్రత్యేక దృష్టి పెడతానని, జనంలో పార్టీ పట్ల సానుకూల స్పందన లభించేలా కేడర్‌ చూడాలని ఆయన కోరారు. జీవీఎంసీ పీఠంపై పసుపు జెండా ఎగిరితేనే పార్టీ పరువు నిలబడినట్లు అన్నట్లుగా అధినాయకత్వం సంకేతాలు పంపుతోంది. తాను మూడేళ్లుగా పడిన కష్టానికి  తగిన రాజకీయ ప్రతిఫలం విశాఖ కార్పొరేషన్‌ ద్వారా దక్కాలన్నది బాబు ఆదేశంగా ఉంది. 2014 నాటి రాజకీయ ప్రభ తగ్గుతున్న వేళ పాత విజయాన్ని తిరిగి రాయాలన్న కసితో అధినాయకత్వం పనిచేస్తోంది. విభజన ఏపీలో విశాఖకే ఎక్కువగా మేలు చేస్తున్నామన్న ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నది కేడర్‌కు నిర్దేశించడం అందులో భాగమే. గత ఏడాది రెండు నెలల పాటు జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ఈ ఏడాది మొదలవుతూనే నిర్వహించిన నాలుగవ విడత జన్మభూమి వంటి వాటి ద్వారా పార్టీని జనానికి చేరువ చేయాలన్న లక్ష్యంతో టీడీపీ సాగుతోంది.

ప్రత్యేక హోదాను మరచిపోయేలా...

విశాఖవాసులు  రాజకీయ పార్టీల కంటే ఇచ్చిన హామీలు, నెరవేర్చడంతో చిత్తశుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  అదే సమయంలో మాట తప్పిన పార్టీలకు తగిన గుణపాఠాన్ని కూడా నేర్పడంలోనూ వెనక్కు తగ్గరు. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నగరంలో ప్రత్యేక హోదా డిమాండు బాగానే ఉంది. గత ఏడాది చివరలో వైసీపీ నగరంలో నిర్వహించిన భారీ సభలో ఇది రుజువైంది కూడా. నాటి నుంచి మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలకు నగర రాజకీయాలపై గుబులు పట్టుకుంది. పార్టీల గ్రాఫ్‌ పడిపోతోందన్న సత్యాన్ని ముందుగానే గుర్తించిన టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా ఓ రాజకీయ ఆయుధంగా మారకుండా వేగంగా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నగరంలో పేదల ఆక్రమణలో ఉన్న వంద గజాల లోపు స్ధలాలను ఉచితంగా వారికే అప్పగించడం ద్వారా ఆయా వర్గాల మన్ననలను పొందే ప్రయత్నం చేశారు. ఒకే మారు 31 వేల పట్టాలను ఇటీవల జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పంపిణీ చేయడం ద్వారా రాజకీయంగా భారీ మైలేజ్‌ని సాధించేందుకు యత్నించారు. ఇక, సుదీర్ఘకాలంగా మిగిలిపోయిన సింహాచలం భూముల వ్యవహారాలను కూడా త్వరలోనే పరిష్కరించడం ద్వారా వేలాది కుటుంబాలకు ఊరటను ఇవ్వాలన్న ఆలోచనలో టీడీపీ సర్కార్‌ ఉంది.

జీవీఎంసీలో మరో కీలక ప్రాంతమైన గాజువాకలోనూ పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను రెండవ విడతగా సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా,  నగరంలో తరచూ పర్యటనలు చేయడం, అభివృద్ధి మంత్రంతో హోదా డిమాండును మరుగున పరచడం అజెండాగా చేసుకుని మిత్రులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలోనే పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పధకానికి శ్రీకారం చుట్టడం, యుద్ధ ప్రాతిపదికన దానిని పూర్తి చేసి జీవీఎంసీ ఎన్నికలకు వెళ్లాలన్న ఎత్తుగడతో టీడీపీ ఉంది, అదే విధంగా అటకెక్కించిన రైల్వే జోన్‌ను పట్టాలెక్కించడం ద్వారా తన పట్టును నిలుపుకోవాలని బీజేపీ చూస్తోంది. వీటితో పాటుగా, విభజన చట్టంలో ప్రతిపాదించినట్లుగా విశాఖకు గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు, మరిన్ని కేంద్ర విద్యా సంస్ధలను కూడా ఏర్పాటుచేయాలన్నది బీజేపీ నాయకుల ఆలోచనగా ఉంది. ప్రత్యేక హోదా అన్న మాటను గతంలో వల్లె వేసిన అధికార పార్టీలు ఇపుడు ఆ ఊసే ఎత్తకుండా తమ ప్రసంగ ప్రావీణ్యాన్ని చాటుకుంటున్నాయి. తాజా పర్యటనలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతిపై యుద్ధం చేస్తున్నట్లుగా వెల్లడించారు. నల్ల కుబేరుల భరతం పట్టడానికే మోడీ సర్కార్‌ కట్టుబడి ఉందని వెంకయ్య పేర్కొంటే, కేంద్రం ఆశించిన డిజిటల్‌ ఇండియాను ఏపీలో చేసి చూపిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నగదు రహిత సమాజాన్ని ఆవిష్కరించడం ద్వారా నూతన ఒరవడిని సృష్టిస్తామని ఇద్దరు నాయకులు తెలియచేశారు. 

ఇదిలా ఉండగా, ఈ నెలాఖరున మరోమారు నగరానికి ఇద్దరు నాయకులు వచ్చే అవకాశం ఉంది. 27, 28 తేదీలలో నగరంలో జరగనున్న పారిశ్రామిక సమ్మిట్‌ ద్వారా పెట్టుబడులను ఆకట్టుకోవాలన్న ధ్యేయంతో ఏపీ సర్కార్‌ ఉంది. తద్వారా  విశాఖకు భారీ ఎత్తున పెట్టుబడులను సేకరించామని పేర్కొంటూ జీవీఎంసీ ఎన్నికలలో ఆ అంశాన్ని అస్త్రంగా చేసుకోవాలనుకుంటున్నారు. ఇక, 28 నుంచి మూడు రోజుల పాటు విశాఖ ఉత్సవ్‌ పేరుతో భారీ ఆర్భాటానికి తెర తీస్తున్నారు. దానికి కూడా ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరవుతున్నారు. విశాఖ  పర్యాటకరంగానికి పెద్ద పీట వేస్తున్నట్లుగా ఈ ఉత్సవ్‌ వేదికగా ప్రకటించడం ద్వారా ఓటు బ్యాంకుకు మరింతగా పదును పెట్టాలన్న ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారు. అదే విధంగా, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో సైతం విశాఖకు వరాలను మరిన్ని ప్రసాదించడం ద్వారా వైజాగ్‌వాసును తమ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నారు. జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి న్యాయ పరమైన అడ్డంకులు ఒక్కొక్కటీ తొలగిపోయి వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్న నేపధ్యంలో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ముగియగానే ఎన్నికల నగరా మోగించేందుకు టీడీపీ సర్వం సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ సైతం అయిదు రాష్ట్రాల ఎన్నికలలో భారీ విజయాలను నమోదు చేసుకుంటే ఆ ఊపులో విశాఖలో కూడా పాగా వేయవచ్చునని వ్యూహ రచన చేస్తోంది. 

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌,

విశాఖపట్నం.

Show comments