సింధు కోసం తెలుగు సర్కార్లు పోటాపోటీ...!

ఒలింపిక్స్‌ రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు ఇప్పుడు జాతీయస్థాయిలో అత్యున్నత సెలబ్రిటీ. ఆమె విజయం సాధించగానే రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని దేశంలోని ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రశంజల జల్లు కురిపించారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నజరానాలు ప్రకటించాయి. సచిన్‌ టెండూల్కర్‌వంటి పలువురు ప్రముఖులు వ్యక్తిగతంగా బహుమతులు ప్రకటించారు. నగదు బహుమతుల పరంగా చూస్తే కొన్ని కోట్ల రూపాయలు సింధుకు దక్కినట్లయింది. 

ఇక అసలు విషయానికొస్తే సింధు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. 'అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న' అనే టైపులో రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా నజరానాల వర్షం కురిపించాయి. విచిత్రమేమిటంటే రెండు ప్రభుత్వాలు ఈ రోజే (శనివారం) మంత్రివర్గ సమావేశాలు నిర్వహించడం, సింధును తమ తమ రాష్ట్రాల తరపున విజేతగా ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ నజరానాలు ప్రకటించడం జరిగింది. 

తెలంగాణ ప్రభుత్వం అంతకుముందు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. తెలంగాణ ప్రకటించే సమయానికి బాబు సర్కారు ఎలాంటి నజరానా ప్రకటించలేదు. ఆ తరువాత కేబినెట్‌ సమావేశంలో 3 కోట్ల  క్యాష్‌ రివార్డు ప్రకటించింది. అంతేకాకుండా అమరావతిలో వెయ్యి గజాల ఇంటి స్థలం బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది.  ఇక బాబు సర్కారు సింధును సొంతం చేసుకోవడానికి  ఆమెకు గ్రూప్‌ ఒన్‌ సర్వీస్‌ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  ఆ ఉద్యోగాన్ని సింధు అంగీకరిస్తే ఆమె ఆంధ్రా ప్రభుత్వంలో భాగమైపోతుంది. 

ఇక సింధు గురువు పుల్లెల గోపీచంద్‌కు బాబు సర్కారు యాభై లక్షలు రివార్డు ప్రకటించింది.  ఆంధ్రా సర్కారు ఎప్పుడైతే సింధుకు ఏ సర్కారు ఇవ్వనన్ని వరాలు ఇచ్చిందో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాక పుట్టింది. ఆమెపై నజరానాల వాన కురిపించి, ఆమె విజయాన్ని ఆంధ్రా ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించగానే ఇదే రోజు జరిగిన కేబినెట్‌ సమావేశంలో 5 కోట్ల క్యాష్‌ అవార్డు ప్రకటించారు. దేశం మొత్తం మీద ఇదే అత్యున్నతం. ఇక సింధు కోచ్‌ గోపీచంద్‌కు ఆంధ్రా సర్కారు కంటే డబుల్‌ అమౌంట్‌ కోటి రూపాయల అవార్డు ప్రకటించారు.  Readmore!

తాటి చెట్టు ఎక్కేవాడుంటే తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడు. అత్యధికంగా నజరానాలు ప్రకటించి దేశంలో తానే ఉదారంగా వ్యవహరించానని చంద్రబాబు అనుకున్నారు. కాని వెంటనే కేసీఆర్‌ ఆయన్ని మించి నజరానాలు ప్రకటించి 'ఇంతకు మించి పోతవా బిడ్డా' అని సవాల్‌ విసిరినట్లు వ్యవహరించారు. రెండు ప్రభుత్వాలు ప్రకటించిన క్యాష్‌ అవార్డులను, ఇంటి స్థలాలను సింధు స్వీకరించే అవకాశం ఉంది. అవి బహుమతులు కదా. కాని ఉద్యోగం విషయంలో ఏ రాష్ట్రం వైపు మొగ్గుతుందో తెలియదు. 

ఆమె ఉద్యోగానికి ప్రాధాన్యం ఇస్తుందా, ఇంకేదైనా ఆలోచన ఉందా చెప్పలేం. బాబు సర్కారు గ్రూప్‌ ఒన్‌ పోస్టు ఆఫర్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో టాప్‌ ఉద్యోగం. కేసీఆర్‌ సర్కారు ప్రభుత్వ ఉద్యోగమని చెప్పిందిగాని ఏం పోస్టో తెలియదు. సో...ఆమెకు ఉద్యోగం తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్లయితే ఏ రాష్ట్రం వైపు మొగ్గు చూపుతుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ట్రీట్‌ చేస్తారు కాబట్టి ఆమె విజయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. సింధుకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఆఫర్‌ చేసినట్లు సమాచారం లేదు. 

ఒకవేళ అలాంటిది జరిగితే కేంద్రం వైపు మొగ్గు చూపొచ్చు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.  సింధు తెలంగాణ అమ్మాయా? ఆంధ్రా అమ్మాయా? అనే చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో బాబు, కేసీఆర్‌ ఉద్యోగాలు ఆఫర్‌ చేసి  విజయాన్ని తమ రాష్ట్రాలకు  అంకితం చేయాలని భావించినట్లుగా ఉంది.  కేసీఆర్‌ కుటుంబ పత్రిక 'నమస్తే తెలంగాణ' సింధు గురించి 'ఆంధ్రా అమ్మాయా? తెలంగాణ బిడ్డా'...అంటూ కథనం ప్రచురించింది. ఒలింపిక్స్‌ విజేత తెలంగాణ అమ్మాయే అని చెప్పుకునేలా ఈ కథనం సాగింది. 

సింధు సికింద్రాబాదులో పుట్టిందని, మారేడుపల్లిలో ఉంటోందని, గత ఏడాది ఆమె బోనమెత్తిందని, లాల్‌ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పించిందని, కాబట్టి పక్కా తెలంగాణ అమ్మాయేననే వాదం బలపడుతోందని రాసింది. ఆమె బతుకమ్మలు ఆడిన విషయం చాలామందికి తెలియదని పేర్కొంది. ఆమెను సానియా మీర్జా స్థానంలో తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించాలనే డిమాండ్‌ వస్తోందని తెలిపింది. విభజన జరిగినప్పటినుంచి రెండు రాష్ట్రాలు అనేక విషయాల్లో పోటీ పడుతుండటం చూస్తున్నాం.  సింధు విషయంలోనూ ఇదే కొనసాగుతోంది. 

Show comments