మంత్రివర్గం రీషఫుల్ కు బాబు డిసైడ్?

తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. ఇంతవరకు మంత్రివర్గం లో మార్పులు చేర్పులు లేవు. తొలిసారి మంత్రివర్గం ఏర్పాటుచేసినపుడు మాత్రం, బాబు పట్ల అసంతృప్తి ప్రబలకుండా అస్మదీయ పత్రికలు, బాబు రెండెళ్ల లోపే మంత్రివర్గాన్ని షఫుల్ చేసి, మరి కొందరికి చాన్స ఇస్తారని, ఇలా విడతల వారీ వీలయినంత మందికి చాన్స్ ఇస్తారని, పక్కకు తప్పించిన వారికి వేరే పదవులు ఇస్తారని కథనాలు వండి వార్చాయి. అయితే రెండున్నరేళ్లు గడిచిపోయింది కానీ, బాబు మంత్రి వర్గాన్ని టచ్ చేసే దాఖలాలు కనిపించలేదు. మరోపక్క చినబాబు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న గుసగుసలు అలా వినిపిస్తూనే వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో త్వరలో బాబు మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది.

కొందరిని పార్టీలోకి తీసుకోక తప్పని సరి పరిస్థితి వల్లే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. కొందరిని తీయడానికి కాకుండా, కేవలం చేర్చడానికే మంత్రి వర్గాన్ని రీషఫుల్ చేస్తున్నా, అనివార్యంగా కొందరిని తప్పించక తప్పదు. అయితే ఇక్కడ మరో ముచ్చట ఏమిటంటే, ఈ అసెంబ్లీ కాలానికి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ రీషఫుల్ అని కూడా వినవస్తోంది. ఎందకుంటే మళ్లీ మరో రెండేళ్ల తరువాత రీషఫుల్ అంటే ఎన్నికలు ఆర్నెల్ల దగ్గరలోకి వస్తాయి. అలాంటపుడు మంత్రివర్గ మార్పులు చేర్పులు చేసేంత సీన్ వుండదు.

వైకాపా జనాలకు చాన్స్ ?

సారి మంత్రివర్గ విస్తరణలో రెండు మూడు కీలక అంశాలు వుంటాయి. ఒకటి వైకాపా  నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం. ఇలా ఇవ్వకపోవడం వల్ల కొత్తగా ఎవరైనా రావాలనుకున్నా, నమ్మకం కలిగించడం కష్టం అవుతుంది. ఇప్పటికే వచ్చినవారు అలా దిగాలుగా కూర్చుని వున్నారు. పదవులు ఎప్పుడు వరిస్తాయో తెలియవు. ముఖ్యంగా ఈస్ట్ నుంచి జ్యోతుల నెహ్రూ, విజయనగరం నుంచి రంగారావు ఆశలు పెట్టుకుని వున్నారు. వీరు కాక మరి కొంతమందికి ఆశలు వున్నా, అవకాశాలు తక్కువే అని వినికిడి.  వైకాపా జనాలకు అవకాశాలు ఇస్తే, మరింత మంది వలస వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. అయితే ఇదే సందర్భంలో పార్టీని నమ్ముకున్నవారిలో కాస్త అసంతృప్తి వున్నా, బాబును కాదని చేసేది ఏమీ వుండదు. కీలకంగా వైకాపా జనాల నుంచి ఒక్క జ్యోతుల నెహ్రూకే ఎక్కువ చాన్స్ వుంటుందని తెలుస్తోంది. ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా ఈస్ట్ లో ముద్రగడకు మరింతగా చెక్ పెట్టే అవకాశం వుంటుందని బాబు భావిస్తున్నారని తెలుస్తోంది.

స్పీకర్ మార్పు?

అసెంబ్లీ స్పీకర్ సీటులో కోడెల శివప్రసాదరావు అసంతృప్తిగానే వున్నారన్నది తెలిసిన విషయమే. ఆయనకు మొదట్నించీ హోం మంత్రి పదవిపైనే గురి. అందుకే ఈ మార్పులు చేర్పులలో ఆయన కోరిక తీరే అవకాశం వుందని తెలుస్తోంది. హోం మంత్రి పదవి తమ సామాజిక వర్గానికి కావాలని కమ్మ సామాజిక వర్గ పెద్దలు బాబుపై చాలా కాలంగా వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో స్పీకర్ గా మరెవరినైనా చూడాలి. ధూళిపాళ నరేందర్ ను తీసుకుంటే ఎలా వుంటుంది అన్న ఆలోచన వున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.  అలాగే మంత్రి నారాయణను మంత్రి వర్గ బాధ్యతల నుంచి తప్పించి, పూర్తిగా రాజధాని బాధ్యతలు  నిర్వహించే పదవిని అప్పగిస్తారని కూడా వినిపిస్తోంది.

కత్తెర ఎవరిపై?

కత్తెరలు పెద్దగా వుండవని, మంత్రుల సంఖ్య పెరుగుతుందని, అయితే వేటు పడేకన్నా, కొంతమందిని అప్రాధాన్య శాఖలకు మార్చే అవకాశం వుందని కూడా తెలుస్తోంది. అయితే కనీసం అయిదు మంది పైనే వేటు వుంటుందని తెలుస్తోంది. ఇలా వేటు అన్న మాట వినిపించినపుడల్లా ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి కిమిడి మృణాళిని పేరు వినిపిస్తోంది. కారణం, ఆమె దగ్గర బంధువు కిమిడి కళా వెంకటరావుకు పదవి ఇవ్వబోవడమే. ప్రస్తుతం లోకేష్ కోటరీలో కీలకంగా వున్నారు కళా వెంకటరావు. ఇక పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, శిద్దా రాఘవరావుల పేర్లు కూడా గతంలో తరచు వినిపించినవే. ఇప్పుడు కొత్తగా పత్తిపాటి పుల్లారావు పేరు వినిపిస్తోంది. రాజధాని భూముల వ్యవహారంలో, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన కాస్త అపఖ్యాతి మూట కట్టుకున్నారు. అదీ కాక, కొత్తగా చేర్పులు తప్పనపుడు, ఇలా ఒకరిద్దరు త్యాగం చేయక తప్పదు.

తగ్గించేది ఎవరికి?

శాఖల మార్పులు తప్పవు అన్న మాట వినిపిస్తుంటే, అందులో మంత్రి గంటా శ్రీనివాస రావు పేరు బాగా వినిపిస్తోంది. హోం మంత్రిత్వ శాఖను మారిస్తే, చినరాజప్ప మంత్రి పదవి మార్చినట్లే కదా. ఇంకా ఒకరిద్దరి మంత్రి పదవుల్లో కూడా మార్పు వుంటుందని తెలుస్తోంది.

లోకేష్ సంగతేమిటి?

లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల వారసత్వ వాసనలు, విమర్శలు వస్తాయని అందరూ భావిస్తున్నదే. కానీ మారుతున్న కాలంలో ఈ వారసత్వ వాదన పసలేకుండా పోయింది. తెలుగుదేశం పుట్టి ముఫై ఏళ్లు దాటిపోయింది. అప్పటి నుంచి అధికారం చెలాయిస్తున్న చాలా మంది నాయకుల వారసులు అప్పుడే రంగంలోకి దిగిపోయి పెత్తనం చెలాయిస్తున్నారు. వీరిలో చాలా మంది వచ్చే ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. 

అలాంటి సమయంలో లోకేష్ ను పదవిలోకి తీసుకోవడం పెద్ద చిత్రం కాదు. కానీ లోకేష్ ఇప్పుడు శాసన సభ లేదా మండలి రెండింటిలో సభ్యుడు కాడు. మంత్రి అయిన తరువాత ఆయనను ఎక్కడో ఒక దగ్గర నుంచి పోటీకి నిలపాలి. మరి అదెలా? డైరక్ట్ గా ప్రజల ముందు నిలబెట్టాలి అంటే, శాసనసభకు పోటీ చేయించాలి. అది కాస్త రిస్కే. లేదూ అంటే దొడ్డి దోవన మండలికి తీసుకెళ్లాలి. కానీ లోకేష్ ను మంత్రి పదవిలోకి ఇప్పటి నుంచి తీసుకోకపోతే 2019 నాటికి ఓ స్థాయికి చేరడం కష్టం అన్న సూచనలు బాబుకు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ బాబు తన మైండ్ ఫిక్స్ చేసుకోలేదని తెలుగుదేశం వర్గాల బోగట్టా.

పార్టీ పదవిలో వుంటూ, డిఫాక్టోగా అనేక పనులు చక్కబెడుతున్న లోకేష్ కు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కొత్తగా వచ్చేది ప్రజలకు దగ్గర కావడం ఒకటే అని. అది వచ్చే ఎన్నికలప్పుడు అయినా, ఇప్పుడయినా ఒకటే అని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ అదే సమయంలో లోకేష్ పలు విధాలుగా ఇన్ డైరక్ట్ గా బాబు పై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో అతి కీలకమైన నిర్ణయం ఇదే అవుతుంది.

చూడాలి మరి దసరా నాటికి విస్తరణ జరిగితే, బాబు చాణక్యం ఎలా వుంటుందో ?

Show comments