రిపోర్టుకే వంద కోట్లు... నిర్మాణానికెంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు 'చంద్రులు' నిర్మాణాలకు వేలకోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ లెక్కలు కూడా మీడియాలో వచ్చేది ఓ విధంగా ఉంటే ప్రభుత్వం చెప్పేది మరోవిధంగా ఉంటోంది. ఏపీలో నిర్మాణాలకు ఖర్చు చేస్తున్నారంటే (అవినీతి జరుగుతోందనుకోండి. అది వేరే విషయం) అర్థం చేసుకోవచ్చు. అక్కడ రాజధాని లేదు. అది లేదు కాబట్టి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వగైరా భవనాలు లేవు.

సీఎం చంద్రబాబు కొన్ని కారణాలతో తాత్కాలిక భవనాలు నిర్మించి, ప్రజాధనం వృథా చేసి శాశ్వత భవనాలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో భవనాలు తప్పనిసరిగా నిర్మించుకోవల్సిన అవసరం ఉంది. తెలంగాణకు రాజధాని అయిన హైదరాబాదులో సచివాలయం, అసెంబ్లీ భవనాలు వడ్డించిన విస్తరిలా ఉన్నాయి. ఒకవేళ చిన్న లోపలున్నాయనుకుంటే సరిచేసుకోవచ్చు. కాని వాస్తు నమ్మకాలు విపరీతంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తగా సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

ఆయన అధికారంలోకి రాగానే ఉన్న భవనాలను కూలగొట్టి మళ్లీ కడతానని పాట పాడటం ప్రారంభించారు. సచివాలయం కూలగొడతా, అసెంబ్లీ కూలగొడతా, ఉస్మానియా ఆస్పత్రి కూలగొడతా, రవీంద్ర భారతి కూలగొడతా...ఎప్పుడూ ఇదే పాట. దీంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. క్రమంగా కూలగొట్టే ఆలోచలను మానుకున్నారు. ఆ తరువాత వందల కోట్లు ఖర్చు పెట్టి కొత్త క్యాంపు కార్యాలయం 'ప్రగతి భవన్‌' నిర్మించారు. దీనికి వాస్తు నమ్మకమే కారణం.

ఇక తాజాగా కొత్త అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించాలనే నిర్ణయం జరిగింది. ఇందుకోసం రక్షణ శాఖకు చెందిన 60ఎకరాల బైసన్‌ పోలో గ్రౌండ్‌ తీసుకోవడానికి ఒప్పందం కుదిరింది. వాళ్ల భూమి తీసుకున్నందుకు ప్రతిఫలంగా వాళ్లకు 593ఎకరాలు ఇస్తున్నారు. అంతేకాకుండా 93కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం తీసుకుంది గోరంత అయితే రక్షణ శాఖకు ఇచ్చేది (భూమి ప్లస్‌ డబ్బు) కొండంత ఉంది. రక్షణ శాఖ భూమి చా...లా విలువైంది కాబట్టి ప్రభుత్వం అంత భారీగా ఇవ్వాల్సివచ్చిందట...! 

అయినా వాస్తు నమ్మకం ముందు ప్రజాధనం ఎంత? ఇక రక్షణ శాఖ నుంచి తీసుకున్న భూమిలో భవనాలు కట్టాలి. ఇక్కడ సచివాలయం, అసెంబ్లీ భవనాలే కాకుండా అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా నిర్మిస్తారు. కేసీఆర్‌కు వాస్తు పిచ్చి ఉన్నా చంద్రబాబు మాదిరిగా విదేశీ నిర్మాణ కంపెనీల పిచ్చి లేదనే చెప్పాలి. ఆయనకు ఇష్టమైన నిర్మాణ సంస్థ ముంబయికి చెందిన హఫీజ్‌ కాంట్రాక్టర్‌. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఏ నిర్మాణానికైనా ఈ కంపెనీ పేరే వినిపిస్తోంది. అసెంబ్లీ, సచివాలయం, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణ బాధ్యతలు హఫీజ్‌ కాంట్రాక్టర్‌కే అప్పగిస్తున్నారు.

మరి భవనాల నిర్మాణం కోసం డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డిపిఆర్‌) తయారుచేయాలి కదా. ఈ రిపోర్టు తయారీకి అయ్యే ఖర్చు 100కోట్లని సమాచారం. భవనాల నిర్మాణానికి ప్రాథమికంగా వేసిన అంచనా 600 నుంచి 750కోట్లు. ఇది ప్రాథమిక అంచనా కాబట్టి డిజైన్లలో చేసే మార్పులు చేర్పులను బట్టి, అనేక చిల్లరమల్లర ఖర్చులు కలుపుకొని వెయ్యికోట్లు కాకుండాపోదు. అంటే కేసీఆర్‌ వాస్తు పిచ్చి మూల్యం వెయ్యి కోట్లన్నమాట...!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా సీఎం వాస్తు నమ్మకానికి ఎంత ప్రజాధనం వృథా చేసినా ఎవరేం చేయలేరు. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నాళ్లు గొడవ చేస్తాయి? మొన్న మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్‌ కొత్త భవనాలను నిజాం నవాబుల సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తామన్నారు. ఇప్పుడేమో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మిస్తామంటున్నారు. తెలంగాణ అంటే నిజాం రాజులే అనుకుంటే రెండు సంస్కృతులు మిక్స్‌ చేస్తారేమో...! ఇక పాత భవనాలు ఏం చేస్తారయ్యా అంటే... సచివాలయం భవనాల్లోకి నగరంలో అక్కడక్కడా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తారట.

అసెంబ్లీ భవనాలను ఏం చేస్తారు? మ్యూజియంగా మారుస్తారు. ఇక్కడ ఏం మ్యూజియం ఏర్పాటు చేస్తారో ఇంకా వివరాలు తెలియలేదు. మొత్తం మీద గత 60 ఏళ్లుగా సేవలందించిన అసెంబ్లీ, సచివాలయం వైభవం అంతరించి పోతోంది. ఈ అసెంబ్లీ భవనాల చరిత్ర ఇప్పటిదా? ఇవి నిర్మించిందీ నిజాం రాజులే. వాస్తవానికి ఇది అప్పట్లో టౌన్‌ హాల్‌. 1905లో ప్రారంభమైన దీని నిర్మాణం 1913లో పూర్తయింది. ఇక ఇది ఓ మాన్యుమెంట్‌గా మిగిలిపోతుంది.

Show comments