బాబుకే బాబులా తయారైన సుజనా.!

ఇంకోస్సారి రాజ్యసభ సభ్యుడిగా ఛాన్స్‌ దొరికిన తర్వాత కేంద్ర మంత్రి సుజనా చౌదరిలో తీవ్రమైన మార్పులు కన్పిస్తున్నాయి. ఆ మార్పులు ఎంత తీవ్రంగా వున్నాయంటే, చంద్రబాబుకే బాబులా తయారయ్యేంతలా.! నిన్న రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లుపై గందరగోళం అనంతరం, సభ వాయిదా పడ్డాక మీడియా ముందుకొచ్చిన సుజనా చౌదరి మాటల్లోని 'తీవ్రతను' తెలుగు మీడియా గుర్తించినా, తెలుగు మీడియాలో చాలావరకు 'టీడీపీ కంట్రోల్‌'లో వుండడంతో ఆ తీవ్రత బయటపడలేదు. 

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి లేదు.. అనడం వరకూ బాగానే వుంది, అసలు అది చెత్త కాగితంతో సమానం.. అని తేల్చేయడం వరకూ ఓకే. రాజకీయ విమర్శలు చేయడంలో ఇదేమీ అంత పెద్ద తీవ్రమైన విషయం కాకపోవచ్చు. కానీ, అధినేతనే ధిక్కరించేలా సుజనా చౌదరి వ్యాఖ్యలు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 

'కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో శీతకన్నేసిందని చంద్రబాబు చెబుతున్నారు కదా..' అన్న ప్రశ్నకు సమాధానమివ్వని సుజనా చౌదరి, మీడియాని అదిలించేసినంత పన్జేశారు. అంతేనా, 'చంద్రబాబు స్వయంగా చెప్పారు కదా.. పోలవరం సహా అన్ని విషయాల్లోనూ కేంద్రంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది..' అని మీడియా ప్రశ్నిస్తే, 'కేంద్రం ఇంకా ఇవ్వాల్సి వుందని మాత్రమే చంద్రబాబు చెప్పి వుంటారు..' అని ఇంకోసారి విదిలించుకుపోయేందుకు ప్రయత్నించారు సుజనా చౌదరి. 

ఇంకా నడిచిన ఘాటు వ్యవహారం చాలానే వుంది. సుజనా చౌదరి రెక్లెస్‌నెస్‌ని చూసి టీడీపీ అనుకూల మీడియానే షాక్‌కి గురయ్యింది ఆయన తీరుతో. నిన్న మొన్నటిదాకా ప్రత్యేక హోదా విషయంలో సుజనా చౌదరి కూడా కథలు చెప్పినవ్యక్తే. 'ప్రత్యేక హోదా వస్తుంది, ఆ నమ్మకం నాకుంది.. కేంద్ర మంత్రిగా చెబుతున్నా.. ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది..' అని ఇదే సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. 

'కేంద్రం మా రెక్కల్ని విరిచేసింది..' అని స్వయంగా చంద్రబాబు, కేంద్ర - రాష్ట్ర సంబంధాలపై పెదవి విరిచారు గతంలో. ఇదే విషయాన్ని మీడియా, సుజనా చౌదరి వద్ద తాజాగా ప్రస్తావించేందుకు ప్రయత్నించింది. 'అది తప్పు.. ఆ ఆలోచన కరెక్ట్‌ కాదు..' అంటూ చంద్రబాబుకే సుజనా చౌదరి క్లాస్‌ తీసుకున్నంత పన్జేశారు. చంద్రబాబుని సుజనా చౌదరి ధిక్కరించేంతలా సుజనా చౌదరికి 'బలుపు' పెరిగిపోయిందంటూ టీడీపీ వర్గాల్లోనే ఆఫ్‌ ది రికార్డ్‌గా గుసగుసలు విన్పిస్తున్నాయి. 

కోర్టు కేసుల కారణంగా ఇంకోసారి రాజ్యసభకు వెళ్ళే అవకాశం లేదనీ, కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుందనీ ప్రచారం జరిగిన దరిమిలా సుజనా చౌదరి అటు నరేంద్రమోడీని మేనేజ్‌ చేయడం, ఇటు చంద్రబాబుని సంతృప్తి పరచడం వంటి చర్యల దా&్వరా బలం పెంచుకున్నమాట వాస్తవం. ఆ బలం 'ధనబలం' అన్నదీ నిర్వివాదాంశం. ఇకనేం, ముందు ముందు సుజనా చౌదరి నుంచి 'అగ్రెసివ్‌నెస్‌'ని ఇంకా గట్టిగా చూడాల్సి రావొచ్చు.

Show comments