జూనియర్ పరిటాల.. తండ్రిని మించి పోతున్నట్టేనా!

తన చరమాంకంలో పరిటాల రవి ఇచ్చిన ఇంటర్వ్యూలను చూస్తే.. ఇంత శాంతి కాముకుడా ఈయన! అనిపిస్తుంది. తను ఎంత అభంశుభం ఎరగని వాడినో ఆయన ఆ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. మరి అంత అభంశుభం ఎరగని ఆయనకు అంత ప్రాణభయం ఎందుకు ఉండిందో దైవానికి ఎరుక! ఆ వీడియోలను చూసిన ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే అంశం ఏమిటంటే.. రవికి బోలెడంత లౌక్యం ఉందనేది!

అనంత ఫ్యాక్షన్ రచ్చతో తనకు ఏం సంబంధం లేదు.. రవి స్పష్టం చేశాడు. మరి రెండు వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలను, ఆ పార్టీ  సానుభూతి పరులను ఎవరు హత్యలు చేయించారు? వారిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా.. వారి హత్యల సమయంలో అన్ని వేళ్లూ మీవైపే చూపాయి కదా.. అంటే, “అబ్బే..అవన్నీ పీపుల్స్ వార్.. ఆర్వోసీ చేసిన పనులు’’ అని రవి తన లౌక్యాన్ని ప్రదర్శించాడు.

అర్వోసీ అంటే..  రీ ఆర్గనైజింగ్ కమిటీ.. అని రవి చెప్పాడు. దాన్ని రవీ ఆర్గనైజింగ్ కమిటీ అని ప్రత్యర్థులు అంటారు. అదంతా.. ఒక వ్యూహాత్మకం. అలా తన పనులు చక్కబెట్టుకోవడానికి రవి ఆర్వోసీ అనే ముఠాను నడిపించాడనేది ఆఖరి వరకూ ఆరోపణ గానే మిగిలింది!

ఆ చాకచక్యంతో రవి తన ప్రాణాలను అయితే కాపాడుకోలేకపోయాడు కానీ.. కేసుల భయం ఒక్కటీ లేకుండా చూసుకోగలిగాడు. మరి రవి రాజకీయ వారసుడు.. శ్రీరామ్ తీరులో మాత్రం ఈ చాకచక్యాలు కనిపించడం లేదు. రవి తన అనుచరులతో రాళ్లను రువ్వించే టైపు అయితే, శ్రీరామ్ స్వయంగా విసిరే టైపు … అనేది అనంతలో వినిపిస్తున్న మాట.

ఇప్పటికే శ్రీరామ్ కార్యక్షేత్రంలోకి దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయని.. అతడి అనాలోచిత చర్యల వల్ల ఇప్పటికే కేసులు ఎదుర్కోవడం జరిగింది. ఏదో మొన్న పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సరిపోయింది .. లేకపోతే కామిరెడ్డి పల్లి సుధాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఈ పాటికే శ్రీరామ్ కు పీకల మీద వరకూ వచ్చేది అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక శ్రీరామ్ పేరుతో జరుగుతున్న రౌడీయిజం.. ఈ కిరాతక చర్యలు ఇప్పుడు వీడియోల రూపం దాల్చి.. వాట్సాప్ వరకూ వచ్చేశాయి! శ్రీరామ్ తీరును నిరసిస్తూ ఇప్పటికే తెలుగుదేశం ఎమ్మెల్యేలు రోడ్డుకు ఎక్కారు! అనంతపురం, ధర్మవరం లనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, సొంత సామాజికవర్గం నేతలు.. ‘శ్రీరామ్ రౌడీయిజం నశించాలి..’’ అంటున్నారు!

ఇలా.. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండంటే రెండే సంవత్సరాల్లో పరిటాల శ్రీరామ్ పేరు మార్మోగుతోంది. అయితే ఈ అధికారాలు శాశ్వతం అనే భ్రమతో ఈ విధంగా దూసుకుపోతే మాత్రం.. చాలా ఇబ్బందులే ఉంటాయి. ఫ్యాక్షనిజం ఎలాంటి పులి స్వారీనో.. దాని మీద విహరించప్పుడు ఎంత వైభవం ఉంటుందో, ఆ పులి మింగిసినప్పుడు విషాదమూ ఉంటుందని పరిటాల ఫ్యామిలీకి అనుభపూర్వకంగా తెలిసి ఉండాలి.. అని పరిశీలకులు అంటున్నారు. అయితే అనతి కాలంలోనే తండ్రికి మించిన తనయుడు అని సొంత వాళ్ల చేత అనిపించుకుంటున్న శ్రీరామ్ తీరులో ఈ పాఠాల సారం కనిపించడం లేదని వీరు అంటున్నారు.  మరోసారి చెప్పే మాట.. ఫ్యాక్షనిజం పులి స్వారీ! అధికారంలో ఉన్నంతసేపే ఆనందమంతా! అది చేజారితే.. ఏమవుతుందో అనుభవాల నుంచే అర్థం చేసుకోవాలి!  

Show comments