ఉండవల్లితో స్నేహం.. జగన్‌కెంత లాభం.?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. గత కొంతకాలంగా ఉండవల్లి అరుణ్‌కుమార్‌, వైఎస్సార్సీపీతో టచ్‌లోనే వున్నారు. జగన్‌కి పలు సందర్భాల్లో బయటనుంచి మద్దతినిస్తోన్న ఉండవల్లి, వైఎస్సార్సీపీలో చేరే విషయమై మాత్రం తెగ మొహమాటపడిపోతున్నారట. 

అందరికీ తెలిసిన విషయమే ఉండవల్లి అరుణ్‌కుమార్‌, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమా అని రాజకీయంగా ఎదిగారు. 'నేను రాజశేఖర్‌రెడ్డికి వీరాభిమానిని..' అని చాలా సందర్భాల్లో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పుకొచ్చారు కూడా. అయితే, కాంగ్రెస్‌కి జగన్‌ గుడ్‌ బై చెప్పాక, పదవిని కాపాడుకునేందుకు ఉండవల్లి, జగన్‌పైనా విమర్శలు చేశారు. వీలు చిక్కినప్పుడల్లా తనకు రాజకీయంగా గుర్తింపు తీసుకొచ్చిన వైఎస్‌పైనా నోరు పారేసుకున్నారు. రాజకీయం అంటేనే అంత.! 

ఇక, ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్‌ అవ్వాలనుకుంటున్న ఉండవల్లి, తన సేవల్ని వినియోగించుకోవాలంటూ వైఎస్‌ జగన్‌ని కోరారనీ, దాంతో జగన్‌ కూడా ఉండవల్లి సూచన పట్ల సానుకూలంగా స్పందించారనీ తెలుస్తోంది. అతి త్వరలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌, అధికారికంగా వైఎస్సార్సీపీలో చేరే అవకాశం వుందట. 

ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మంచి వాగ్ధాటి వున్న వ్యక్తి. ఏం లాభం.? రాజకీయంగా ఆయనకి అంత సీన్‌ లేదు. ఏదో, వైఎస్‌ హవాలో ఆయన ఎంపీగా గెలిచారు తప్ప, నియోజకవర్గంలోనూ రాజకీయంగా సొంత బలం లేని వ్యక్తి ఉండవల్లి అరుణ్‌కుమార్‌. మరి, ఉండవల్లి విషయంలో వైఎస్‌ జగన్‌ ఎందుకు ఇంత సాఫ్ట్‌గా స్పందిస్తున్నట్లు.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.

Show comments