పన్నీరు సీఎం.. బీజేపీ కొత్త గేమ్..!

తమిళనాడు రాజకీయ రచ్చను నిన్నటి వరకూ వెనకుండి నడిపినట్టుగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు డైరెక్టుగా రంగంలోకి దిగుతున్నట్టుగా ఉంది. అసలు పార్టీ నుంచి శశికళ, దినకరన్ హఠాత్ సస్పెన్షన్ వెనుక భారతీయ జనతా పార్టీ మంత్రాంగం ఉందనేది దాచేస్తే దాగే అంశం కాదు. బీజేపీ భరోసా ఇవ్వంది పళనిసామి అంత ధైర్యం చేయగలిగే వాడే కాదనేది ప్రత్యేకంగా వివరించాల్సిన అంశం కాదు. 

ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరన్ గెలిచే పరిస్థితి కనిపించడంతో.. భారతీయ జనతా పార్టీ అలర్ట్ అయ్యింది. దినకరన్ అల్లాటప్పా వ్యక్తికాదు.. ఎన్నికల్లో ఎలా గెలవాలో తెలిసిన వాడు. అతడికి ఊపు ఉండటంతో.. కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోని వ్యవస్థలతో ఆట మొదలుపెట్టింది. ధన ప్రవాహం అంటూ అక్కడ ఉపఎన్నికకు బ్రేక్ వేసింది. అసలు దేశంలో ధన ప్రవాహం జరగని ఎన్నికలు ఎక్కడైనా జరుగుతున్నాయా? స్వయంగా ఏపీ స్పీకరే చెప్పారు కదా.. తనెంత ఖర్చు పెట్టారో! అలాంటి ప్రజా స్వామ్యంలో ఆర్కేనగర్ ఎలా ప్రత్యేకం అవుతుంది? బీజేపీ వ్యూహాత్మకంగా అక్కడ ఎన్నికలను బ్రేక్ వేయించి.. ఆ గ్యాప్ లో తను రంగంలోకి దిగింది. 

ఆది నుంచి పన్నీరు బీజేపీ అధినాయకత్వానికి టచ్ లోనే ఉన్నారు.. మరోవైపు పళనిని గోకింది. మాతో చేతులు కలిపితే పర్వాలేదు.. లేకపోతే ఆర్కేనగర్ పంపకాలకు సంబంధించిన జాబితాలో నీ పేరు కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేయాల్సి ఉంటుందన్న బెదిరింపుతో.. సీఎం టక్కున దారిలోకి వచ్చాడు. అక్కడ నుంచి కథ కమలం కనుసన్నల్లో నడుస్తూ వస్తోంది. ఆర్కేనగర్ పంపకాలతో, ఈసీకి లంచం ఇవ్వజూపడంలో ఇరుక్కుపోయిన దినకరన్ ఇప్పుడు కదిలే మెదిలే పరిస్థితిలో లేడు. దీంతో ఒకే దెబ్బకు అటు శశిని, ఇటు దినకరన్ సాగనంపారు. ఈ కథనంతా వెనకుండి నడిపించిన కమలం పార్టీ ఇప్పుడు డైరెక్టుగా రంగంలోకి దిగి అన్నాడీఎంకేను శాసించడం మొదలుపెట్టింది. ఇలా ఎంత వరకూ వెళ్తుందో..!

Show comments