తెలుగుదేశం విప్… బాబు కాన్ఫిడెన్సేమిటో!

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఇప్పటికే చాలా సార్లు ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఒకసారి కాదు.. అనేక సార్లు.. బాబు ఈ  విషయాన్ని మీడియా ముఖంగా చాలాసార్లు ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ని శంకిస్తూ.. జీఎస్టీ బిల్లు విషయంలో ఆ పార్టీ వైఖరిని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పొచ్చేదిమిటంటే… ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని.. ఒకవేళ కాంగ్రెస్ గనుక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే.. ఏపీ కి ప్రత్యేక హోదా కల్పిస్తేనే జీఎస్టీకి మద్దతు పలుకుతామని బీజేపీకి షరతు పెట్టేదని బాబుగారు వ్యాఖ్యానించారు.

ఎలాగూ జీఎస్టీ బిల్లు విషయంలో ప్రతిపక్షాల మద్దతు అవసరమైన బీజేపీ.. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసమైనా ఏపీకి ప్రత్యేకహోదా కల్పించేదని.. బాబుగారు బ్రహ్మాండమైన లాజిక్ చెప్పారు! 
మరి కాంగ్రెస్ ఏం చేయాలో.. ఆ పార్టీ అజెండా ఎలా సెట్ చేసుకోవాలో వివరించిన బాబుగారు.. ఇప్పుడు తన పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన తీరును చూస్తుంటే ఏమనాలో అర్థం కాదు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఓటింగ్ కు రానున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. ఆ బిల్లును గట్టెక్కించడానికి తెలుగుదేశం సహకరించాల్సిందే అని నిర్ణయించి, జీఎస్టీపై చర్చ, ఓటింగ్ కు ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని విప్ జారీ చేశారు!

మరి ఇప్పుడు తెలుగుదేశానికి ప్రత్యేకహోదా గుర్తుకు రావడం లేదా? కాంగ్రెస్ మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ను ప్రకటించేంత వరకూ బీజేపీకి సహరించ కూడదు.. తెలుగుదేశం మాత్రం ప్రత్యేకహోదా విషయంలో వెక్కిరిస్తున్న బీజేపీకి జీఎస్టీ విషయంలో ఇలా పూర్తిగా సహకరిస్తుంది! బీజేపీ కన్నా ముందే విప్ జారీ చేసి.. బీజేపీ ఉద్ధరణకు పూనుకుంటుంది పచ్చపార్టీ!

ఇప్పుడు రాజ్యసభలో బీజేపీకి ప్రతి ఓటూ కీలకమైనదే! పెద్దల సభలో బిల్లులను గట్టెక్కించుకోలేని కమలం పార్టీ అందరి కాళ్లనూ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి పెద్దల సభలో తెలుగుదేశం మద్దతు కూడా కీలకమైనదే. ఇలాంటప్పుడు తెలుగుదేశం ఎందుకు షరతు పెట్టకూడదు? ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తేనే.. రాజ్యసభలో జీఎస్టీకి మద్దతునిస్తాం అని పచ్చపార్టీ షరతు పెడితే కాషాయ పార్టీ ఇరకాటంలో పడుతుంది. కానీ తెలుగుదేశం ఈ పని చేయదు!

కాంగ్రెస్ కు మాత్రం చంద్రబాబు నీతులు చెబుతున్నారు.. జీఎస్టీకి సహకరించవద్దు ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందంటాడు.. కానీ తను మాత్రం  పూర్తిగా చేతులెత్తి మద్దతునిస్తాడు! మరి తన రాజకీయాన్ని ప్రజలెవరూ అర్థం చేసుకోలేరనే కాన్ఫిడెన్సా ఇది.. అర్థమైనా ఎవరూ ఏం చేసుకోలేరనే అతివిశ్వాసమా?! 

Show comments