గవర్నర్.. వెళ్లి శశి చేత ప్రమాణం చేయించండి!

తమిళనాడు సీఎంగా శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించాలి.. గవర్నర్ మహారాష్ట్రలో కూర్చుంటే కుదరదు.. చెన్నై వెళ్లి ఆయన శశికళ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలి.. అని అన్నాడు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. తన సొంత రాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి రాష్ట్రపతితో తను చర్చించాను అని, ఈ సమయంలో గవర్నర్ ఏం చేయాలో తాము మాట్లాడామని స్వామి చెప్పుకొచ్చాడు. విద్యాసాగర్ రావు మహారాష్ట్రలో ఉండి లాభం లేదు.. చెన్నై వెళ్లి శశి చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్వామి వ్యాఖ్యానించాడు.

ఒకవైపు  తమిళనాడు పరిణామాల గురించి బీజేపీ పైకి గుంభనంగా కనిపిస్తున్నా.. స్వామి మాత్రం తనదైన శైలి వ్యాఖ్యానాలు చేశాడు. అలాగే పన్నీరుపై కూడా స్వామి ధ్వజమెత్తాడు. పన్నీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అర్థం లేనివి అని స్వామి వ్యాఖ్యానించాడు.

రాజీనామా పత్రాన్ని అందించక మనుపే పన్నీరు సెల్వం పోరాడాల్సింది అని, రాజీనామా ఇచ్చాకా ఇప్పుడు ఇలా మాట్లాడి ఏం ప్రయోజనం అని స్వామి ప్రశ్నించాడు. శశికళను ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేల్లో కూడా పన్నీరు ఉన్నాడు కదా.. అని స్వామి గుర్తు చేశాడు. 

మరి ఇన్ని మాట్లాడుతున్న స్వామి.. శశికి ఎమ్మెల్యేల పూర్తి విశ్వాసం ఉందని చెప్పగలడా? శశి వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ రాజనీతిజ్ఞుడికి తెలుసా? అని! అయినా స్వామి మాటలను సొంత పార్టీనే పెద్దగా పట్టించుకోవడం లేదు గత రెండేళ్లలో! మరి ఈ రన్నింగ్ కామెంట్రీకి విలువేముందిలే! 

Show comments