బెదిరించడం మొదలెట్టిన వెంకయ్య!

మోడీని కీర్తించే స్టైలు చూసి ముప్పవరపు వెంకయ్యనాయుడు కేవలం భజన బృందం పాత్రలు, సొంత డబ్బా కొట్టుకునే పాత్రలు, కమెడియన్ పాత్రలు మాత్రమే పోషించగలరని ఎవరైనా అనుకుంటే పొరబాటే. ఆయన విలన్ పాత్రలు కూడా తనకు చేతనవుతాయని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. తమ జట్టులోంచి కటీఫ్ చెబితే.. మీ అంతు చూస్తాం అన్నట్లుగా ఏపీ సర్కారును ఇండైరక్టుగా హెచ్చరిస్తున్నారు. తాను చెబుతున్న మాటలకు వంత పాడకుండా, తాను చేసే భజనకు గొంతుకలపకుండా ఉంటే ఏపీ ప్రజలందరూ కూడా మూర్ఖులే అని చెప్పడానికి కూడా ఆయన వెనుకాడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రత్యేకహోదాకు సంబంధించిన డిమాండ్, ఆకాంక్ష వెల్లువలా పైకి ఎగసిన ప్రతిసారీ.. దాన్ని తొక్కేయడానికి రకరకాల మాయమాటలతో తనదైన ప్రయత్నాలు సాగించే వెంకయ్యనాయుడు.. ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చారు. 

ప్రత్యేకహోదాను మించిన ఆసరాను కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి అందిస్తుందని వెంకయ్యనాయుడు తాజాగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పాచిపాటే పాడుతున్నారు. దాంతో పాటూ ఆయన కొత్తగా విలన్ పాత్రధారిలాగా బెదిరింపులకు దిగుతుండడం విశేషం. ఏపీలో కొన్ని పార్టీలో తెలుగుదేశం ఎన్డీయేలోంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాయని, కేంద్రప్రభుత్వంలోంచి తప్పుకుంటే.. రాష్ట్ర ప్రగతి దెబ్బతింటుందని ఆయన హెచ్చరిస్తున్నారు. అంటే కేంద్రంలో తాము చెప్పిన మాట వింటూ చెప్పుకింద తేలులా పడి ఉన్నంతవరకే, తమ భజన చేస్తూ ఉన్నంత వరకే మీ రాష్ట్రం సంక్షేమం చూస్తాం.. లేకుంటా మీ నాశనానికి పంతం పడతాం.. అని వెంకయ్యనాయుడు హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. 

హోదా గురించిన ఉద్యమం ప్రజల్లోకి చేరువ అవుతున్న ప్రతిసారీ.. వెంకయ్యనాయుడు ఇలాంటి డ్రామాలే నడిపిస్తున్నారు. గతంలో కూడా హోదా డిమాండ్ బలంగా ఉన్నప్పుడు ప్యాకేజీ చాలా గొప్పదంటూ ఊరూవాడా ఊదరగొట్టి జనాన్ని గందరగోళంలోపడేశారు. ఇప్పుడు కూడా హోదా డిమాండ్ ఉధృతంగా మారుతున్న వేళ మళ్లీ అదే పని చేస్తున్నారు. ‘ప్రజలు విజ్ఞులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉంటారు’ అని ఆయన చెప్పడం గమనిస్తే... ఈ ప్రభుత్వాలకు కొమ్ముకాయకపోతే.. ప్రజలు మూర్ఖులు అని వెంకయ్య నిందిస్తున్నట్లుగా ఉంది. 
విశాఖపట్నం సదస్సులో లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయని తన డబ్బా కొట్టుకోవడానికి చంద్రబాబు తాపత్రయపడుతోంటే.. దాన్ని కాస్తా హైజాక్ చేసి, అంతా కేంద్రప్రభుత్వ రంగ సంస్థల వల్ల వస్తున్న ప్రాజెక్టులే అంటూ తనకు కీర్తిని ఆపాదించుకోవడానికి వెంకయ్య ప్రయత్నిస్తున్నారు. తన మాటల చాతుర్యంతో ఇంత చెబుతున్నారు గానీ.. రాష్ట్రానికి ముష్టిలాగా విదిలించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడం గురించి గానీ.. రైల్వే మంత్రిని ఎన్నుకున్నందుకు మీకు చాలా లాభం అంటున్నా.. విశాఖపట్నానికి రైల్వేజోన్ ఇవ్వడం గురించి గానీ పెదవి విప్పకపోవడం అసలు ట్విస్టు. 

 

Show comments