తారలపై బాబుకు అభిమానం లేదా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో సినిమా నటీనటుల సందడి కనబడటంలేదు. సాధారణంగా వీరి సందడంతా ఎన్నికల సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కొందరు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తే కొందరు నచ్చిన పార్టీల్లో చేరుతుంటారు. ఇంకొందరు తాము చేరిన పార్టీ తరపునో, అభిమానించే పార్టీ తరపునో ప్రచారం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాల్లో నటీనటుల సందడి లేదా ప్రమేయం ఎక్కువగా ఉండేది. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి అనేకమంది నటీనటులు రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. ఎక్కువమంది టీడీపీలో చేరారు. పలువురు ఇతర పార్టీల్లోకి వెళ్లారనుకోండి. 

అప్పట్లో ఎన్టీఆర్‌ ప్రముఖ తారలను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పుణ్యమా అని పలువురు ప్రముఖ నాయకులుగా ఎదిగారు. చట్టసభలకు వెళ్లారు.  మంత్రులైనవారూ ఉన్నారు. క్రియాశీలక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టీడీపీలో చేరిన కొందరు తారలు రాజకీయంగా ఎదిగారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొందరు తారలను పార్టీలోకి తీసుకొచ్చారు. ఇక కాంగ్రెసు, బీజేపీలో చేరిన కొందరు తారలు రాజకీయంగా ఎదగలేదు. పైగా మధ్యలోనే రాజకీయాలు విరమించుకున్నారు. 

ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీలో చేరిన వారిలో జయప్రద ప్రముఖ నాయకురాలయ్యారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో రాణించి రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు.చంద్రబాబు రాజకీయాల్లోకి తెచ్చిన రోజా ఇప్పుడు ఆయనకు శత్రువయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాల్లో చేరిన నటీనటుల చరిత్ర చెప్పుకుంటూపోతే చాలా ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలో మురళీమోహన్‌, హీరో నందమూరి బాలయ్య, వైఎస్సార్‌సీపీలో రోజా చట్టసభలకు వెళ్లడమే కాకుండా క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణకొస్తే కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి మౌనంగా ఉన్నారు. 

వైఎస్సార్‌ ఎమ్మెల్యేగా చేసిన జయసుధ టీడీపీలో చేరారు. కాని యాక్టివ్‌గా లేరు. మొత్తం మీద చెప్పాలంటే సినిమా నటీనటుల హవా మొదటినుంచి టీడీపీలోనే ఎక్కువగా ఉంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మొదటినుంచి సినిమా తారలతో లింకులు లేవు. ఒకప్పుడు విజయశాంతి ఉండేది.  ఎన్టీఆర్‌, చంద్రబాబు మాదిరిగా కేసీఆర్‌ ఎన్నడూ సినిమా తారలను పనిగట్టుకొని రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. దానికి తగ్గట్లు పక్కా తెలంగాణీయులైన చెప్పుకోదగిన తారలెవరూ లేరు. ఒకరిద్దరున్నా రాజకీయాలవైపు ఆకర్షితులైనవారు లేరు. 

రాజకీయాల్లో ఇప్పుడున్న తారలందరూ ఉమ్మడి రాష్ట్రంలో అరంగేట్రం చేసినవారే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎందరు తారలు రాజకీయల్లోకి వస్తారు, ఏఏ పార్టీల్లో చేరతారు, ఎంతమంది అసెంబ్లీలకు, పార్లమెంటుకు వెలతారు అనే విషయాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుస్తాయి. ఆ సమయంలో తెలంగాణకు చెందిన నటీనటులు, ఇతర సినిమా ప్రముఖులు టీఆర్‌ఎస్‌లోనూ, ప్రతిపక్షాల్లోనూ చేరొచ్చు. అయితే సినిమా గ్లామర్‌ ఆంధ్రాలో వర్కవుట్‌ అయినంతగా తెలంగాణలో అవుతుందా? అనేది చెప్పలేం. 

వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పలేంగాని ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినిమా తారల మీద అభిమానం తగ్గిపోయిందట...! ఇందుకు భిన్నంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ తారల మీద అభిమానం ఉందట...! ఈ సంగతి చెప్పింది ఎవరు? ఆంధ్రా టీడీపీ నాయకురాలు, సినిమా నటి కవిత. సినిమా తారలను కేసీఆర్‌ పట్టించుకున్నంతగా బాబు పట్టించుకోవడంలేదని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎన్నికలు లేవు కదా. ఏం పట్టించుకుంటారు? అనుకోవచ్చు. కాని కవిత ఉద్దేశం అది కాదు. ఏపీ ప్రభుత్వం  ప్రజాహిత, సంక్షేమ కార్యక్రమాల్లో సినిమా తారలను భాగస్వాములను చేయడంలేదన్నారు. 

టీడీపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎప్పుడు ఆందోళనలు, ధర్నాలు చేసినా పార్టీ సభ్యులైన సినిమా తారలను భాగస్వాములను చేసేవారని, కాని అధికారంలోకి వచ్చాక వారిని పక్కకు పెట్టేశారని చెప్పారు. అయితే కేసీఆర్‌ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో సినిమా తారలను భాగస్వాములను చేశారు. ప్రముఖ తారలు, హీరోలు, దర్శకులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. హరితహారంలో భాగస్వాములు కావాలని కేసీఆర్‌ సినిమా వారిని కోరారు. చంద్రబాబు ఏపీలో  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో సినిమా వారిని భాగస్వాములను చేయలేదట...! సినిమా తారలు రాజకీయ ప్రయోజనాలకేనా?

Show comments