'ఆంధ్రప్రదేశ్‌కి నేనే బ్రాండ్ అంబాసిడర్..' అంటూ పదే పదే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పుకోవడం చూస్తున్నాం. ఇంకెవరూ తనను పొగడనప్పుడు, తనను తానే పొగిడేసుకోవడాన్నే 'సెల్ఫ్ డబ్బా' అని పిలుస్తారు. ఈ విషయంలో చంద్రబాబుకి సాటి ఇంకెవరూ రారంటే రారంతే. చంద్రబాబుని ఆయనతోపాటుగా ఇంకొకరున్నారండోయ్ 'డబ్బా' కొట్టేందుకు. ఆయనెవరో కాదు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.
ఇంతకీ చంద్రబాబు - వెంకయ్య మధ్య ఇంత 'అనుబంధానికి' కారణమేంటట.? ఇది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో చంద్రబాబు సంతృప్తి చెందారట. అర్థం చేసుకున్నారట. ఇది వెంకయ్య తాజా ఉవాచ. 'ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాం.. అంతకు మించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం.. అది చంద్రబాబు అర్థం చేసుకున్నారు..' అంటూ తాజాగా వెంకయ్య మరోమారు 'డబ్బా' వాయించేశారు.
అయినా, చంద్రబాబెవరు అర్థం చేసుకోవడానికి.? అర్థం చేసుకుంటే చేసుకున్నారు.. అది అర్థమవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కదా.! ఈ లాజిక్‌ని, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న వెంకయ్యనాయుడు మర్చిపోతే ఎలా.? విభజన కారణంగా ఏర్పడ్డ ఆర్థిక లోటుని నరేంద్రమోడీ సర్కార్ పూడ్చుతోందట.
ఇది వెంకయ్య చెప్పిన తాజా మాట. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పెటోడు వెంకయ్య.. అనాలిప్పుడు. ఓ పక్క, వెంకయ్యగారి ప్రియ మిత్రుడు చంద్రబాబే, 'కేంద్రం ఆర్థిక లోటుని పూడ్చడంలేదు.. మా రెక్కలు తెగ్గొట్టి మమ్మల్ని ఎగరమంటున్నారు..' అంటూ మొసలి కన్నీరు కార్చేస్తున్నారు.
ప్రత్యేక హోదా కాంగ్రెస్‌కి గతంలో ఎందుకు గుర్తుకురాలేదన్నది వెంకయ్య ప్రశ్న. అసలంటూ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది, తుంగలోకి తొక్కేసిందీ వెంకయ్యగారే కదా.! ఆ విషయం ఆయన మర్చిపోతే ఎలా.? అప్పటి కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక హోదా ఐదేళ్ళ కాలానికి ప్రకటిస్తే, మేం వచ్చాక దాన్ని 10 ఏళ్ళకు పెంచుతామన్నారు వెంకయ్య. పదేళ్ళు కాదు కదా, కాంగ్రెస్ ఇస్తామన్న ఐదేళ్ళ ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ ప్రభుత్వం. మొత్తానికే ప్రత్యేక హోదా ఎత్తేసిన ఘనత మోడీ సర్కార్‌దే.
ఏదిఏమైనా, వెంకయ్యనాయుడు - చంద్రబాబునాయుడు శాటిస్‌ఫై అయిపోతే, అక్కడికేదో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సంతృప్తి చెందినట్లని ప్రచారం చేసుకోవడమంత హీనమైన విషయం ఇంకోటుండదు. 'సీనియర్' అని తనకు తాను కితాబిచ్చుకోవడం కాదు.. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని తన మాటలతో తానే అపహాస్యం పాల్జేస్తున్న వెంకయ్య, తనను తాను ప్రశ్నించుకుంటే, సమీక్షించుకుంటే మంచిదేమో.!