నోటీస్ రాలేదన్నాడు.. సిట్ ముందు హాజరవుతున్నాడు

"మీకు దండం పెడుతున్నా. నన్ను వదిలేయండి ప్లీజ్. నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నన్ను పోలీసులు కలవలేదు. ఏమీ జరగలేదు. అలాంటివి ఉంటే నేను చెబుతాను. దయచేసి నా పేరు వేయొద్దు. నాకు సంబంధం లేదు". టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే తనీష్ రియాక్షన్ ఇది. తనకు నోటీసులే అందలేదని కొన్ని రోజుల కిందట బుకాయించిన ఈ నటుడు ఈరోజు సిట్ ముందు హాజరవుతున్నాడు. నోటీసులు అందకుండానే ఇంటరాగేషన్ కు ఎవరైనా వెళ్తారా..?

టాలీవుడ్ డ్రగ్స్ మాఫియాకు సంబంధించి పలు మాధ్యమాల్లో కొన్ని రోజుల కిందట తన పేరు రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు తనీష్. తన తల్లి చాలా బాధపడుతోందని, తండ్రి చనిపోయిన తర్వాత ఇంటికి తనే పెద్ద దిక్కుగా మారానని.. దయచేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండని అప్పట్లో మీడియాను రిక్వెస్ట్ చేసిన తనీష్.. ఈరోజు సిట్ కార్యాలయం మెట్లు ఎక్కబోతున్నాడు. 

రవితేజతో పాటు అతడి డ్రైవర్ ను కూడా విచారించిన సిట్ అధికారులు.. ఈరోజు తనీష్ నుంచి కూడా కీలక సమాచారం రాబట్టబోతున్నారు. ప్రధానంగా కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారనే విషయం ఇప్పటికే బయటకు రావడంతో.. కెల్విన్ కాల్ లిస్ట్ లో తనీష్ పేరు కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే యాంగిల్ లో ఈరోజు తనీష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశముంది.

Show comments