కులాల ఓటుబ్యాంక్ పై ప్రశాంత్ కామెడీ చేశాడా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ .. ఎలాగైనా సరే 2019 ఎన్నికలలో అధికారంలోకి రావాలనే తపనతోనే శక్తివంచన లేకుండా అన్నిరకాల ప్రయత్నాలను చేస్తోంది. ఒకవైపు ప్రజాపోరాటాలను కొనసాగించే తమ రెగ్యులర్ ప్రయత్నాలతో పాటూ.. దేశంలో రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ను కూడా కన్సల్టెంట్ గా నియమించుకుని ఆయన సేవలు తీసుకుంటోంది. అయితే సాంప్రదాయంగా ఒక రకమైన రాజకీయ పోకడలకు అలవాటు పడిన పార్టీలోని సీనియర్లకు ఇది పెద్దగా రుచించడం లేదు. నిజానికి ఇలాంటి వ్యూహకర్తల సలహాలు ప్రజల ఓట్లను శాసించగలవా? అధికారాన్ని అందించగలవా? అనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైకాపాలో ప్రశాంత్ కిషోర్ మీద ఒక జోకు వినిపస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తన టీమ్ ల ద్వారా ప్రాథమిక సర్వేను పూర్తి చేసిన ప్రశాంత్ కిషోర్ జగన్ కు ఒక నివేదిక కూడా ఇచ్చారుట. రాష్ట్రంలో ఓట్లను ప్రభావితం చేయగల స్థాయిలో నాలుగు కులాలు ప్రధానంగా ఉణ్నయని.. ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆ నాలుగు కులాలను మేనేజ్ చేస్తే చాలునని ఆయన నివేదికలో పేర్కొన్నారట. ఇంతకూ ప్రశాంత్ నివేదికలోని నాలుగు కులాలేంటో తెలుసా.. ‘‘రెడ్డి, కమ్మ, కాపు, చౌదరి’’ లునట!! ఆంధ్రప్రదేశ్ లో తమ పేరు చివర చౌదరి అనే సఫిక్స్ ఉన్న వారినే కమ్మకులస్థులు అంటారని, ఆ సఫిక్స్ లేకుండా కూడా కొందరు కమ్మవాళ్లు ఉంటారనే ప్రాథమిక అవగాహన కూడా లేకుండా.. ఇక్కడి కులవ్యవస్థలు ఓటు బ్యాంకు గురించి ఆయన ఎలాంటి సలహాలు ఇస్తారు సార్.. అంటూ ఆయన మీద జోకులేసుకుంటున్నారట.

ప్రశాంత్ తెలివితేటల్ని వాడుకోవాలని జగన్ కు స్వతహాగానే అనిపించి ఉండవచ్చు. లేదా, ప్రశాంత్ తెలివి తేటలు తన ప్రత్యర్థుల పరం కాకుండా ముందు జాగ్రత్తగా కూడా నియమించుకుని ఉండొచ్చు. కానీ ప్రశాంత్ తన పార్టీలోని వారందరికీ సలహాలు చెప్పించడానికంటె ముందు.. తన పార్టీలోని సీనియర్లు.. వ్యూహరచనలో కొమ్మురు తిరిగిన పెద్దలతో ప్రశాంత్ కు కాస్త అవగాహన కల్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక్కడి కులాలు, ఆంధ్రప్రదేశ్ కు లేదా తెలుగు ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకించిన కొన్ని పోకడల గురించి ప్రశాంత్ కు ప్రాథమిక అవగాహన కల్పించకపోతే గనుక.. ఇలాంటివే మరిన్ని జోకులు పుట్టడానికి ఆస్కారం ఉంటుందని జగన్ గుర్తించాలి. 

Show comments