తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు అభిమానులు. అభిమానులే ఏ హీరోకి అయినా బలం. దురదృష్టవశాత్తూ అభిమానులకు, సదరు హీరోలే బలహీనత.! అవును, ఆ బలహీనతను క్యాష్ చేసుకోవడంలో హీరోలు ఎప్పుడూ బిజీగా వుంటారు. అందరూ అని కాదుగానీ, చాలామంది హీరోల పరిస్థితి ఇదే. వెల్లువెత్తే అభిమానాన్ని చూసి మురిసిపోతారు. ఆ అభిమానం తమకు ఇబ్బంది కలిగించే స్థాయిలో వుంటే మాత్రం, అభిమానుల సంగతి అంతే.!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఇప్పుడు చిత్రమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 'రజనీకాంత్ మీతో సమావేశమవుతారు.. చెన్నయ్‌కి వచ్చేయండి..' అంటూ మొన్నామధ్య రజనీకాంత్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. అంతే, పెద్ద సంఖ్యలో రజనీ అభిమానులు, ఆయన్ని కలిసేందుకు చెన్నయ్‌కి పరుగులు పెట్టారు. రజనీకాంత్ పిలిస్తే ఆ ప్రభంజనం ఎలా వుంటుంది.? అదే జరిగిందక్కడ. దాంతో, ఆ అభిమానానికి రజనీకాంతే అవాక్కవ్వాల్సి వచ్చింది. 'ఇలాగైతే చాలా కష్టం..' అనుకుంటూ ఆ 'ప్రయత్నాన్ని' వాయిదా వేసుకున్నారు.
'రాజకీయ ప్రకటన' చేయడం కోసం అభిమానుల్ని కలిసి, వారితో ముచ్చటించి, ఓ నిర్ణయం తీసుకోవాలన్నది రజనీకాంత్ ఆలోచన. దీనికోసం చాలా ఎత్తుగడలు వేశారాయన. అయితే, అభిమానుల్ని 'మేనేజ్' చేయడంలోనే ఎప్పటికప్పుడు ఆయనకు ఇబ్బందులెదురవుతున్నాయి. తాజాగా, మరోమారు అభిమానులకు 'పిలుపు' అందింది. ఈసారి ఇంకాస్త ప్లాన్డ్‌గా వ్యవహారాన్ని చక్కబెట్టేద్దామనుకుంటున్నారు. 'రజనీకాంత్‌తో ఫొటోలు, విందు కూడా..' అంటూ అభిమానులకు సంకేతాలు వెళ్ళాయి.
ఇక్కడే, అభిమానుల్లో కొంత గందరగోళం క్రియేట్ అయ్యింది. గత అనుభవాల నేపథ్యంలో, రజనీకాంత్ అబిమానులు ఆచి తూచి స్పందిస్తున్నారు. 'ఇది రజనీకాంత్ నుంచి వచ్చిన ప్రకటనేనా.? దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు.?' అంటూ అభిమాన సంఘాల నేతలు, డైరెక్ట్‌గా రజనీకాంత్ ఇంటికే ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారట. 'మేం గత నెలలో మీ కోసం వచ్చి, లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది..' అంటూ సోషల్ మీడియాలో రజనీకాంత్‌కి షాకిస్తున్నారు మరికొందరు అభిమానులు. ఊహించని ఈ పరిణామంతో రజనీకాంత్ అవాక్కవ్వాల్సి వస్తోంది.
సినీ అభిమానాన్ని, రాజకీయాలకు ఆపాదించుకోవాలనే 'స్టార్స్'కి ఈ తరహా సమస్యలు మామూలే. అయినాసరే, రాజకీయ రంగ ప్రవేశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్న రజనీకాంత్, తన అభిమానుల్ని ఇలా ముప్పుతిప్పలు పెట్టడం ఏమాత్రం సమంజసంగా అన్పించడంలేదు.