జయ ఎపిసోడ్ లో రాహుల్ ట్విస్ట్!

జయలలిత ఏమీ వారికి మిత్ర పక్ష నేత కాదు.. కానీ ఏదో మానవతా దృక్పథంతో పరామర్శించాడని అనుకుంటే, ఆమె ఇంకా కోలుకోలేదనే వార్తలే వస్తున్నాయి. పదిహేను రోజులుగా ఇప్పటి వరకూ జయలలితను పరామర్శించిన రాజకీయ నేత ఎవరూ లేరు కూడా. గవర్నర్ విద్యాసాగర్ రావు ఆసుపత్రికి అయితే వెళ్లాడు కానీ.. ఆయన కూడా జయను చూడలేదనే తెలుస్తోంది. తన బాధ్యతగా ఆయన ఆసుపత్రి వరకూ వెళ్లి వచ్చాడు.

అంతకు మించి.. జయలలిత రాజకీయ సన్నిహితులు ఎవరూ ఆసుపత్రిలో అడుగుపెట్టనేలేదు! బీజేపీ వాళ్లు గానీ , ఆఖరికి తనంటే జయకు చాలా ఇష్టం అని చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా అటువైపు వెళ్లలేదు. ప్రస్తుతానికి జయతో బీజేపీ సంబంధాలు బాగానే ఉన్నాయని బయటకు స్పష్టం అవుతోంది. మరి లోపల ఏం జరుగుతోందో తెలీదు. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఉన్నఫలంగా చెన్నై రావడం సంచలనాత్మకమైన అంశమే!

కాంగ్రెస్ వాళ్లో మొన్నటి ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో తమ బంధం తెగిపోయిందని డీఎంకే ఇది వరకే ప్రకటించింది. మరి ఇలాంటి నేపథ్యంలో రాహుల్ చెన్నై వచ్చి.. జయను కలవడానికి ఆసుపత్రికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. జయను పరామర్శించడానికి స్వయంగా మోడీ ఫోన్ చేసినా.. ఆమె లభించలేదట!

మరి ఎలాంటి పిలుపూ లేకుండా రాహుల్ చెన్నైకి వచ్చాడని అనుకోలేం. ఇక రాహుల్ చెన్నై రావడం గురించి కాంగ్రెస్ నేతలు ఎవరూ ఇంకా పెదవి విప్పలేదు. ఏం మంత్రాంగం కోసం ఆయన వచ్చాడనేది ఇంకా తెలియ రాలేదు. మొత్తానికి ఢిల్లీ నుంచి నేరు చెన్నై వచ్చి.. తమతో ప్రస్తుతానికి రాజకీయ సాన్నిహిత్యం లేని జయ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి రాహుల్ ఆసక్తినే రేపాడు. మరి దీని గురించి కాంగ్రెస్ ఏమని ప్రకటన చేస్తుందో చూడాలి! 

Show comments