'బాహుబలి-2'లో మార్పులు అవేనట

'బాహుబలి-1' విడుదలయ్యాక ఆడియన్స్‌ నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ నేపథ్యంలో, రెండో పార్ట్‌ని దర్శకుడు రాజమౌళి ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాడనీ, కథలో కొన్ని మార్పులు చేశాడనీ, కొన్ని పాత్రల లెంగ్త్‌ తగ్గించడం, పెంచడం చేశాడనీ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఇంతకీ, ముందు అనుకున్నదానికన్నా 'బాహుబలి-2'లో మార్పులు ఏమైనా జరిగాయా.? లేదా.? ఈ విషయమై రాజమౌళిని ప్రశ్నిస్తే, 'కొన్ని మార్పులున్నాయ్‌..' అని సమాధానమిచ్చాడు. 

అయితే, ఆ మార్పులు కేవలం యాక్షన్‌ ఎపిసోడ్స్‌లోనూ, ఇతరత్రా చిన్న చిన్న ఎపిసోడ్స్‌లో మాత్రమేనని అంటున్నాడు రాజమౌళి. కథలోగానీ, పాత్రల్లోగానీ ఎలాంటి మార్పులూ చేయలేదనీ, నిజానికి 'బాహుబలి-1'తోపాటే, 'బాహుబలి-2'లోనూ కొంత పార్ట్‌ చిత్రీకరించేశాం గనుక, కథలో పాత్రల తీరుతెన్నుల్లో ఎక్కువ మార్పులు చేయడానికి వీలుపడదని రాజమౌళి చెప్పుకొచ్చాడు. 

తొలి పార్ట్‌ పాత్రల పరిచయం కోసమే అన్నట్లుగా వుంటుందనీ, రెండో పార్ట్‌లో డ్రామా ఎక్కువగా వుంటుందనీ, ఎమోషన్స్‌ పీక్స్‌లో వుంటాయనీ, పోరాట సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా వుంటాయనీ చెబుతున్నాడు రాజమౌళి. అన్నిటికీ మించి, మాహిష్మతి రాజ్యం తొలి పార్ట్‌లో తక్కువగా వుంటే, రెండో పార్ట్‌లో చాలా ఎక్కువగా వుంటుందని రాజమౌళి వ్యాఖ్యానించాడు. ఈరోజు 'బాహుబలి-2' ట్రైలర్‌ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియా ముందుకొచ్చింది.

Show comments