చిరంజీవి గారూ.. ఈ యాడ్ ఏంటండీ బాబూ!

అదిగో ఇదిగో అన్న.. చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఇంకా ‘త్వరలో’ అనే ట్యాగ్ తోనే కొనసాగుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక యాడ్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ యాడ్ చూస్తే.. “ ఏం జరుగుతోంది? ఇదేమైనా లాటరీ టికెట్ యాడా? లేక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచార యాడా?’’ అనే రెండు సందేహాలు కలుగుతున్నాయి!

ఒక మధ్య తరగతి మానవుడు.. ఐదారేళ్ల వయసున్న కొడుకు పెద్దయ్యాకా పైలెట్ అవుతాను అనగానే, సర్వం కోల్పోయినట్టుగా మొహాన్ని నేలకేస్తాడు!
అంతే వయసున్న కూతురు.. పెద్దయ్యాకా డాక్టర్ అవుతా అనంగానే.. భూమి బద్దలైపోయినంత నిరాశతో కుమిలిపోతాడు!
ఇక భార్యకు ఖర్చుకు డబ్బులిస్తూ.. ఈ సారి కొంచెం తగ్గింది.. జాగ్రత్తగా వాడుకో అంటూ చెబుతుంటాడు! అందుకు ప్రతిగా భార్య ‘పిల్లలకు భవిష్యత్తు..?’ అంటూ విషాదభరితంగా అడగగానే!

సదరు కుటుంబరావు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో చిరంజీవి ముందుంటాడు… “25 లక్షలు.. 25 లక్షలు గెలిచావ్..’’ అని చిరంజీవి చెబుతాడు! కుటుంబరావేమో.. ‘ఆనందాన్ని’ చాలా అసహజంగా ప్రదర్శించేస్తాడు. ‘ఆలోచించకండి.. రండి.. ఆశలకు రెక్కలు కట్టండి.. రండి కలను గెలిపిద్దాం..’ అంటూ చిరంజీవి మిగతా వారిని ఆహ్వానిస్తాడు. ఇదీ యాడ్ సారాంశం! 

పిల్లలు పెద్దయ్యాకా.. పైలెట్ అవుతా, డాక్టర్ అవుతా అంటే.. తల్లిదండ్రులు ఆనందపడాలి, కానీ ఈ యాడ్ లో కుటుంబరావు అంతులేని విషాదాన్ని మొహంలో ప్రదర్శించేస్తాడు. మామూలుగా ఇలాంటి కాన్సెప్టులు పొలిటికల్ పార్టీ ల ఎన్నికల యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాయి. 

మా పార్టీకి ఓటేయండి.. మీ జీవితాలు ఇలా తిరగబడతాయనే సందేశంతో ఉంటాయవి. ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ యాడ్ కూడా ఇలానే ఉంది. ఏదో ఆలోచించకుండా లాటరీ టికెట్ కొనండి.. మీ జీవితాలు మార్చేసుకోండి అన్నట్టుగా.. కలలకు రెక్కలు కట్టుకోండి.. అని అన్నట్టుగా దీని ప్రచారం చేస్తున్నారు.

ఇక ‘ట్వంటీ ఫైవ్. .ట్వంటీ ఫైవ్ లాక్స్ గెలిచారు..’ అంటూ చిరంజీవి ఇచ్చే ఎక్స్ ప్రెషన్ చూస్తే…. అందులోని అసహజత్వాన్ని వర్ణించడం మానవమాత్రులకు సాధ్యం కాదు! ‘చిరంజీవిని పెట్టుకుని.. సరిగా వాడుకోలేకపోతున్నారు..‘ అనేవి ఈ ట్రైలర్ వీడియో కింద సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు!

Show comments