జగన్‌.. ఇక ఆగిపోయినట్టేనా.?

'600 కోట్లు ఖర్చు చేయాలనుకున్నారు.. ఇరవై మందిని లాగెయ్యాలనుకున్నారు.. కానీ, ముగ్గురే దొరికారు.. మిగతావారెవ్వరూ లొంగలేదు..' 

- ఇదీ వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వైనం గురించి తాజాగా చేసిన వ్యాఖ్యల సారాంశం. వైఎస్సార్సీపీ చెప్పినా, సాక్షి మీడియాలో కథనాలొచ్చినా.. రెండూ ఒకటేననుకోండి.. అది వేరే విషయం. 5 నుంచి 30 కోట్లదాకా ఒక్కో ఎమ్మెల్యే రేటు పలుకుతోందని ఇటు సాక్షి, అటు జగన్‌ విమర్శిస్తూ వస్తుండడం చూస్తున్నాం. ఒకరకంగా ఈ రేటుని వైఎస్సార్సీపీనే ఫిక్స్‌ చేసేసిందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

మామూలుగా అయితే మరీ ఇంత రేటు వుండి వుండకపోవచ్చుగానీ, వైఎస్సార్సీపీ ప్రచారంతో.. ఆ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్‌ చేస్తున్న ఎమ్మెల్యేలకు డిమాండ్‌ బాగా పెరిగిపోతోందన్నది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న గాసిప్స్‌ సారాంశం. మరీ ఇంత నీఛమా.? ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడమేంటి.? అని సాదారణ ప్రజానీకం అనుకోవచ్చుగాక, నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.. అన్న చందాన వ్యవహరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పిరాయిస్తున్న ఎమ్మెల్యేలు. అధికారంలో వున్న పార్టీలది సైతం ఇదే తీరు.! 

సరే, పార్టీ ఫిరాయింపుల గురించి ఎంత మాట్లాడుకున్నా దండగే. ఎందుకంటే, అధికార పార్టీలకు తోలు మందమైపోయింది మరి. మీరేమన్నా అనుకోండి, అనైతికం అనుకోవచ్చు.. అక్రమం అనుకోవచ్చు.. సంతలో పశువులనుకోవచ్చు.. మేం చెయ్యాలనుకున్నది చేస్తాం.. అంటున్నాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధికారంలో వున్న పార్టీలు. ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ గడచిన ఆరు నెలల్లో కోల్పోయిన ఎమ్మెల్యేల సంఖ్య 20కి చేరింది. తెలంగాణలోనూ దాదాపుగా టీఆర్‌ఎస్‌ లాగేసుకున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఇంతే వుంది లెండి.! తెలంగాణలో అయితే ఫిరాయింపులు ఆగే అవకాశం లేదు. 

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులు ఇక్కడితో ఆగిపోతాయని, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఘంటాపథంగా చెబుతోంది. అఫ్‌కోర్స్‌ అలా చెప్పడం, ఆ పార్టీకి ఇదే కొత్త కాదనుకోండి. మొదట నలుగురైదుగురు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడే వైఎస్‌ జగన్‌ తొందరపడ్డారు, 'ఇంకెవరూ పార్టీని వీడరు.. ఇంకెవరూ అమ్ముడుపోరు..' అని వ్యాఖ్యానించేశారు.. అలా అలా మొత్తం 20 మంది, జగన్‌ భాషలో చెప్పాలంటే టీడీపీకి అమ్ముడుపోయారు. అమ్ముడుపోవడానికి ఇంకా చాలామందే సిద్ధంగా వున్నారు. 

ముందే చెప్పుకున్నాం కదా.. రాజకీయాల్లో నైతిక విలువల్లేవని. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? 2019 ఎన్నికల నాటికి ఖర్చు చేయాలంటే, ఇప్పుడే అమ్ముడుపోవాలన్న తొందర, విపక్షంలో వున్న ఎమ్మెల్యేలలో కన్పిస్తోంది.. అది తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా. సో, జగన్‌ పార్టీ ఫిరాయింపులపై తొందరపడటం అనవసరం. పార్టీలో వున్న ఎమ్మెల్యేలకు సర్టిఫికెట్లు ఇవ్వడం శుద్ధ దండగ. 'వేస్టేజీ పోతోంది..' అనుకోవడం మినహా, జగన్‌ ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు,సర్టిఫికెట్లు ఇచ్చేసి, తన ఇమేజ్‌ని జగన్‌ పాడు చేసుకోవడం ఎందుకట.?

Show comments