చంద్రబాబు అహంకారానికి ఇది నిదర్శనం!!

నదీజలాల పంపకాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా వివాదాలు ఉన్నాయి. కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు చెబుతోంది. ఇలాంటి నేపథ్యంలో వివాదాలు పరిష్కరించుకోవడానికి కేంద్రం ఆధ్వర్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి రంగం సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. 

ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి సమావేశం నిర్వహించడానికి కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ రాశారు. 11, 18, 19 తేదీల్లో మీకు ఎప్పుడు వీలవుతుందో చెబితే ఉభయ రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటుచేసి సంగతి తేల్చేద్దాం అని ఉమాభారతి లేఖ రాశారు. అయితే.. ఈ విషయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తన అహంకారాన్ని ప్రదర్శించారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. 

ఎందుకంటే.. ఇద్దరు సమాన స్థాయి ముఖ్యమంత్రులను మీకు సౌకర్యమైన తేదీలు చెప్పవలసిందిగా.. మూడు ఆప్షన్స్‌ను ఇచ్చినప్పుడు కనీసం ఒకటికంటె ఎక్కువ ఆప్షన్స్‌ను ఎంపిక చేసి.. అవతలి ముఖ్యమంత్రికి కూడా.. ఆప్షన్స్‌ ఎంచుకునే వెసులుబాటు ఇవ్వడం కనీస మర్యాద అని పలువురు భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలాంటి మర్యాదను పాటించకుండా.. 19వ తేదీ తనకు వీలవుతుందంటూ.. ఒకే ఆప్షన్‌ ను ఎంపిక చేసి.. దానిని కేంద్రానికి పంపేశారు. 

కేసీఆర్‌ ఇంకా తన విషయం కేంద్రానికి లేఖ రాయలేదు. చంద్రబాబు ఒకే తేదీని ఎంచుకోవడంతో.. ఇప్పుడు కేసీఆర్‌ కూడా విదిగా 19వ తేదీకే ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇది ఖచ్చితంగా కేసీఆర్‌ ఈగోను దెబ్బతీసే వ్యవహారమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

అదే సమయంలో.. ఒకవేళ కేసీఆర్‌ తనకు 11, 18 తేదీల్లో ఏ రోజు అయినా పర్లేదని రెండు ఆప్షన్స్‌ ఇస్తూ కేంద్రానికి లేఖ రాస్తే పరిస్థితి ఏంటి? కేసీఆర్‌ ఎంపికలో ఎదుటివారికి కూడా ఆప్షన్‌ ఇచ్చే మర్యాదను పాటించినట్లుగా ఉంటుంది. తాను చంద్రబాబునాయుడు లాగా అహంకార స్వభావిని కాదని చాటుకున్నట్లుగానూ ఉంటుందని పలువురు అంటున్నారు. అప్పుడు అయితే.. చంద్రబాబు అయినా ఓ మెట్టు దిగివచ్చి.. ఆ తేదీలకు ఒప్పుకోవాలి. లేదా.. సమావేశం క్యాన్సిల్‌ కావాలి. 

చంద్రబాబునాయుడు ఇలా ఏకపక్షంగా ఒక్కటే తేదీ తన ఆప్షన్‌గా ఇవ్వకుండా కాస్త విజ్ఞత పాటించి ఉంటే.. ఇరురాష్ట్రాలు సమస్యను పరిష్కరించుకోగలిగే సామరస్య వాతావరణం ఏర్పడి ఉండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Show comments