ఆమెకు అవమానం కాదు...అవకాశం...!

మొన్నీమధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో భారీగా మార్పులు చేర్పులు చేయగానే దాంట్లో మీడియాను, రాజకీయ విశ్లేషకులను ఆకర్షించిన ప్రధానాంశం మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని జౌళి శాఖ మంత్రిగా నియమించడం. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ జర్నలిస్టులంతా విశ్లేషణలు వెలువరించారు. సోషల్‌ మీడియాలోనూ చర్చ జరిగింది. అనేకమంది చిత్రవిచిత్రమైన కామెంట్లు రాశారు. దీన్నిబట్టి చూస్తే స్మృతి ఇరానీ ఎంత ప్రముఖంగా మారిపోయారో అర్థమవుతోంది. ఇంత ప్రముఖ వ్యక్తిగా మారడానికి కారణం వివాదాస్పద మంత్రిగా మారడం. ఫైర్‌బ్రాండ్‌గా చెలరేగిపోవడం. 

స్మృతి ఇరానీ శాఖ మార్చడంతో ఆమె వ్యతిరేకులంతా సంతోషించారు. తగిన శాస్తి జరిగిందని ఆనందపడ్డారు. పూర్తిగా మంత్రివర్గం నుంచి తొలగించకపోవడంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆమె పని అయిపోయిందని, అధ్యాయం ముగిసిందని అన్నవారూ ఉన్నారు. స్మృతి శాఖను మోదీ ఎందుకు మార్చారు? అనేదానిపై ఒక్కోరు ఒక్కోవిధంగా విశ్లేషిస్తున్నారు. కీలక శాఖ నుంచి అప్రాధాన్య శాఖకు మార్చారని, ఇది అవమానకరమని కొందరంటున్నారు. స్మృతి ఇరానీ కేంద్రంగా విశ్వవిద్యాలయాల్లో, విద్యా రంగంలో అనేక వివాదాలు తలెత్తాయి. 

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాదులో దళిత విద్యార్ధి రోహిత్‌ వేముల ఆత్మహత్య మొదలుకొని అనేక వివాదాలు ప్రధాని మోదీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆమె విద్యార్హతల విషయంలో చెలరేగిన వివాదం తెలిసిందే. ఆమె ధాటికి విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లు భయపడే పరిస్థితి ఏర్పడింది. స్మృతి పేరు చెబితేనే ప్రతిపక్షాలు ఆగ్రహంతో ఊగిపోయాయి. ఈ నేపథ్యమంతా ఆమె శాఖ మార్పుకు కారణం. ఇదే కాకుండా ఆమె కొన్ని నిర్ణయాలు, పనితీరు ప్రధాని మోదీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆగ్రహం కలిగించాయట...! 

వచ్చే ఏడాది కీలకమైన యూపీ ఎన్నికలకు తయారవుతున్న తరుణంలో స్మృతి శాఖ మార్చడమే మంచిదని మోదీ, అమిత్‌ షా నిర్ణయించుకున్నారు. ఆమెను పూర్తిగా తొలగించకపోవడానికి కారణం ఏమిటి? యూపీ ఎన్నికలే కారణం. స్మృతి ఇరానీ వివాదాస్పదురాలే. కాని ఆమె వాక్చాతుర్యం, వాగ్ధాటి, ఎవ్వరికీ, దేనికీ భయపడని మనస్తత్వం ఉన్న నాయకురాలు. అదనంగా గ్లామర్‌ ఉంది. యూపీ ఎన్నికలకు ఆమె అవసరం. రోహిత్‌ వేముల వివాదంపై పార్లమెంటులో స్మృతి మాట్లాడిన తీరుకు ప్రతిపక్ష నాయకులు డంగైపోయారు. ఆశ్చర్యపోయారు.  Readmore!

ఆమె ప్రసంగంలో అర్థసత్యాలు, అసత్యాలు ఉన్నాయనే విమర్శలొచ్చాయి.  కాని ఆమె ప్రసంగించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆకట్టుకుంది. మోదీ ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ నేపథ్యమే ఆమెను మంత్రివర్గంలో ఉండేలా చేసింది. యూపీ ఎన్నికల్లో కాంగ్రెసు తరపున ప్రధాన ప్రచారకురాలిగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ రంగంలోకి దిగుతారని చెబుతున్నారు.  బీఎస్పీ నుంచి ఆ పార్టీ అధినేత మాయావతి ఉండనేఉంది. వీరిని ఎదుర్కోవాలంటే బీజేపీలో సరైన నాయకురాలు స్మృతి ఇరానీయేనని మోదీ, అమిత్‌ షా భావిస్తున్నారు. 

గత ఎన్నికల్లో అమేధీలో రాహుల్‌ గాంధీపై పోటీ చేసి ఓడిపోయిన స్మృతి ఆ నియోజకవర్గానికి మాత్రం దూరం కాలేదు. అప్పుడప్పుడు వెళ్లి పర్యటనలు చేస్తున్నారు. సభలు నిర్వహిస్తున్నారు. యూపీలో ప్రచారానికి వీలుగానే ఆమెకు బిజీ లేని శాఖను ప్రధాని ఇచ్చారని కమలం నాయకులు చెబుతున్నారు. ప్రియాంకను స్మృతి తప్ప మరెవరూ కౌంటర్‌ చేయలేరని అంటున్నారు. ఆమె నాయకత్వ లక్షణాల మీద మోదీ, అమిత్‌షాకు నమ్మకం ఉందంటున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్మృతిని బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదికి తెచ్చే అవకాశాలను తోసిపుచ్చడంలేదు. 

కొందరు రాజకీయ విశ్లేషకులూ ఇదే మాట చెబుతున్నారు. రాజకీయ అవసరాలు తెర చాటుకు వెళ్లాల్సిన నాయకులను కూడా తెర మీదికి తీసుకొస్తాయి. గత ఎన్నికలప్పుడు స్మృతి ఇరానీని మోదీ తన సోదరిగా చెప్పుకున్నారు. ఆమెకు విద్యార్హతలు లేకపోయినా కీలకమైన మానవవనరుల శాఖను కట్టబెట్టారు. నిజానికి నిర్మలా సీతారామన్‌ ఈమె కంటే ఎక్కువ విద్యార్హతలున్నాయి. కాని సహాయ మంత్రి పదవితో సరిపెట్టారు. వివాదాస్పదంగా వ్యవహరించినా సహించారు. కాని సోదరికి అన్యాయం చేసే ఉద్దేశం మోదీకి లేదు. 

Show comments

Related Stories :