థియేటర్లు తగలబడిపోతాయ్‌

'నో డౌట్‌ థియేటర్లు తగలబడిపోతాయ్‌.. ఈ విషయంలో చిత్ర దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే.. థియేటర్‌ యాజామాన్యాలు ముందుగానే మేలుకోవాలి.. లేదంటే ఆ తర్వాత జరిగే నష్టానికి మాది బాధ్యత కానే కాదు.. మేం హెచ్చరిస్తున్నాం, లైట్‌ తీసుకుంటే జరిగే నష్టం అంచనాలకు అందదు..' 

- ఇది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) తాజా హెచ్చరిక 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమాకి. 

గత కొద్ది రోజులుగా 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమా టీమ్‌కి నిద్ర కరవయ్యింది. పాకిస్తాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ ఈ సినిమాలో నటించడమే అందుక్కారణం. మొదట్లో ఈ వ్యవహారాన్ని లైట్‌ తీసుకున్న కరణ్‌ జోహార్‌, నోరు జారేశాడు కూడా ఆందోళనకారులపై. 'పాకిస్తాన్‌ నటుల్ని తీసుకోవడం తప్పెలా అవుతుంది.? వారు నటులు మాత్రమే, వారేమీ టెర్రరిస్టులు కాదు, వారికి భారత ప్రభుత్వమే వీసా ఇచ్చింది..' అంటూ కరణ్‌ జోహార్‌ నోరు జారేయడంతో, వివాదం ఇక్కడిదాకా వచ్చింది. 

ఐశ్వర్యారాయ్‌, రణ్‌బీర్‌కపూర్‌, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 'యే దిల్‌ హై ముష్కిల్‌' ట్రైలర్‌ ఓ పక్క ఇంటర్నెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంటే, ఇదిగో.. సినిమా ఇలా విడుదలకు ముందే వివాదాల్ని ఎదుర్కొంటోంది. హైద్రాబాద్‌లోనూ, బీజేపీ నేత రాజాసింగ్‌, 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమాని ఏ థియేటర్‌ అయినా ప్రదర్శిస్తే ఆ థియేటర్‌ని తానే కాలబెడ్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. 

ఈ పరిస్థితుల్లో కరణ్‌ జోహార్‌, తన తప్పుని ఒప్పుకున్నా ఆందోళనకారులైతే వెనక్కి తగ్గే అవకాశాలు కన్పించడంలేదు. కానీ, విడుదలకు డేట్‌ ఇచ్చేసి, అంతా సిద్ధం చేసుకున్న కరణ్‌ జోహార్‌, నానా తంటాలూ పడ్తున్నాడు. కేంద్రానికి ఫిర్యాదు చేసి, థియేటర్ల వద్ద రక్షణ కోరుతున్నాడు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో సింగిల్‌ థియేటర్‌ ఓనర్స్‌ ఆల్రెడీ, సినిమా ప్రదర్శనకు ఒప్పుకోబోమని తెగేసి చెప్పేశారు. 

భారత్‌ - పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో, పాకిస్తాన్‌ తమ దేశంలో బాలీవుడ్‌ సినిమాల్నే కాదు, భారతీయ ఛానళ్ళనూ నిషేధించేసింది. అలాంటప్పుడు, మన దేశంలో పాకిస్తాన్‌ నటుడు నటించిన ఓ సినిమాని నిషేధించడం, పైగా సైన్యం త్యాగాల్ని తక్కువ చేసేలా మాట్లాడిన కరణ్‌ జోహార్‌ రూపొందించిన సినిమాని అడ్డుకోవడం తప్పెలా అవుతుందన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం. 

ఇంతకీ, 'యే దిల్‌ హై ముష్కిల్‌' ఈ వివాదాల సెగను తట్టుకుని నిలబడ్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments